పారదర్శకత ఉండాలి

15 Jul, 2017 04:26 IST|Sakshi
పారదర్శకత ఉండాలి

అక్షర తూణీరం
ఒక కొత్త లోకం, అనూహ్యమైన ఆనందం ఎక్కడెక్కడో తేల్చి పారేసే చిటికెడు చిట్కాయే డ్రగ్స్‌. బంగారు భవిష్యత్తుని బలి తీసుకుంటున్నాయి. తెలిసి తెలిసి అత్యంత తెలివైన వారు, అద్భుతమైన సృజనశీలురు ఈ మాయలో పడటం బాధాకరం.

సర్వత్రా పారదర్శకత మా ఏకైక లక్ష్యం అంటారు. అవసరమైతే పేగుల్ని బయటేస్తామంటారు. మా మెదళ్లను అద్దాల పెట్టెలో పెట్టి పారదర్శకంగా పని చేయిస్తామని పదే పదే చెబుతూ ఉంటారు. తీరా ఏదైనా సంచలనాత్మక సంఘటన వెలుగులోకి వస్తే పూర్తిగా కప్పెట్టే ప్రయత్నం చేస్తారు. ఎప్పుడూ ప్రభుత్వపరంగా, మీడియాపరంగా ఈ ధోరణి కనిపిస్తూనే ఉంటుంది.

‘పేకాట ఆడుతూ నలుగురు ప్రముఖులు దొరికి పోయారు’ అంటూ వాళ్ల ఆనవాళ్లు మాత్రం చెబుతారు. బట్టతల, సిల్కు లాల్చీ ధరించిన వ్యాపారవేత్త, మాజీ రాజకీయ ప్రముఖుడు, ఇటీవల హత్యానేరంపై అరెస్టై విడుదలైన కాంట్రాక్టరు– ఇలాగా పొడుపు కథల్లా చెప్పి, విప్పుకోండని సవాల్‌ విసురుతారు. ఈ పజిల్స్‌ ఎందుకు సృష్టిస్తారో అర్థం కాదు.

రెడ్‌హ్యాండెడ్‌గా దొరికినప్పుడు వారి పూర్తి పేర్లు వాడుక పేర్లు చెప్పాలి. వీలుంటే అదే స్పాట్‌లో ఓ ఫొటో తీసి జనానికి అందించాలి. సాధారణంగా ఇలాంటి అధైర్యం వార్తలొచ్చినప్పుడు, ‘చూశారా, అందరూ కలిసి నొక్కేశారు. ఆ పేకాట దగ్గర బోలెడు క్యాష్‌ దొరికి ఉంటుంది. పంచేసుకుని ఉంటారు’ అని బాహాటంగానే వ్యాఖ్యానిస్తారు.

ధనం, కీర్తితో మదించిన కొందరు ఇంకా కొత్త నిషాలకు పాకులాడటం సహజం. ఒక కొత్త లోకం, అనూహ్యమైన ఆనందం ఎక్కడెక్కడో తేల్చి పారేసే చిటికెడు చిట్కాయే డ్రగ్స్‌. బంగారు భవిష్యత్తుని బలి తీసుకుంటున్నాయి. తెలిసి తెలిసి అత్యంత తెలివైన వారు, అద్భుతమైన సృజనశీలురు ఈ మాయలో పడటం బాధాకరం.

డ్రగ్స్‌ని అందకుండా నిరోధించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలా, వాడేవారే నిగ్రహించుకోవాలా? ఏది సబబో ఎవరికి వారు తేల్చుకోవాలి.

మాదక ద్రవ్యాలు మన నగరానికి కొత్తేమీ కాదంటున్నారు కొందరు పెద్దవాళ్లు. ఫిలింనగర్‌ వార్తలకి రేటింగులో అధికమనేది అందరికీ తెలిసిందే. పోలీసు వర్గాలు పొడుపు కథలు వదిలి హాయిగా పేర్లు బయటపెట్టవచ్చు. గుట్టుగా ఉంచిన డొంకల గుట్టు కూడా విప్పొచ్చు. మన అర్ధబలం, కీర్తిబలం తిరుగులేని పలుకుబడి ఎలాంటి తప్పుడు వ్యవహారాలనైనా శుద్ధి చేయగలదనే నమ్మకాన్ని బద్ధలు కొట్టాలి.

డ్రగ్స్‌ భయంకరమైన అంటువ్యాధి. సోకితే వదలడం చాలా కష్టం. మాదకాల వ్యాపారం చేసే వారికి ఖరీదైన కస్టమర్స్‌ కావాలి. అందుకు వారు నిరంతరం వలవేస్తూ ఉంటారు. చాలాసార్లు అన్యంపుణ్యం తెలి యని పిల్లలు వీరి వలల్లో పడుతుంటారు. ఆయా శాఖల్ని ట్రాన్స్‌పరెంట్‌గా ఉండేలా చూస్తే మంచిది. దయచేసి అన్ని కోటల్ని బద్ధలుకొట్టి డ్రగ్‌ బానిసలందర్నీ బయటపెట్టే స్వేచ్ఛ వారికివ్వండి. ఇంతకు మించిన స్వచ్ఛ భారత్‌ ఇంకోటి లేదు.

స్వానుభవం దృష్ట్యా సినిమా పరిశ్రమ పెద్దలంతా పూనుకుని– డ్రగ్స్‌ అనర్థాలను కళ్లకు కట్టే డాక్యుమెం టరీలు తీసి ప్రచారం చెయ్యాలి. చానల్స్‌ నిత్యం కొద్ది నిమిషాలు డ్రగ్స్‌ దుష్ప్రభావాలను విప్పేందుకు కేటాయించాలి.


- శ్రీరమణ

(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

మరిన్ని వార్తలు