రోజా సస్పెన్షన్ రాజ్యాంగ విరుద్ధం

13 Jan, 2016 01:51 IST|Sakshi
రోజా సస్పెన్షన్ రాజ్యాంగ విరుద్ధం

శాసనసభ స్పీకర్ కోడెలకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ
    తక్షణమే సస్పెన్షన్ ఉపసంహరించాలని విజ్ఞప్తి
* ఈ సస్పెన్షన్ బిజినెస్ రూల్స్‌కి కూడా విరుద్ధం
* 340 నిబంధనకు వక్రభాష్యం చెబుతున్నారు..
* చట్టసభల్లో నిబంధనల అతిక్రమణలు విచారణార్హమే
* సాక్షాత్తూ సుప్రీంకోర్టే అనేకమార్లు చెప్పింది..
* ప్రజాస్వామ్యంలో ఎవరి అధికారమూ తిరుగులేనిది కాదు..
* లోక్‌సభలో పెప్పర్‌స్ప్రే ఘటన రోజు ఏం చేశారు?
* న్యాయస్థానాలు ప్రశ్నించేలా మన నిర్ణయాలుండరాదు
* శాసనసభ ఔన్నత్యానికి భంగం కలగరాదు...
* అదే జరిగితే అదో విషాద దినం...

 
 వైఎస్సార్‌సీపీ శాసనసభ్యురాలు ఆర్.కె.రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయం చెల్లదని, ఆమె సస్పెన్షన్ రాజ్యాంగ విరుద్ధం, చట్ట వ్యతిరేకం కనుక తక్షణమే ఉపసంహరించాలని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జగన్ మంగళవారం స్పీకర్‌కు ఒక లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన రోజాను సస్పెండ్ చేయడం నిబంధనలకు ఎలా విరుద్ధమో వివరించారు. పార్లమెంటు ఉభయసభలు పాటిస్తున్న నియమనిబంధనలు, గతంలో ఇలాంటి సందర్భాలలో న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులు వంటి అంశాలన్నింటినీ నివేదించారు. చట్టసభలు న్యాయస్థానాల పరిధిలోకి రావంటూ శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్యల అసంబద్ధతను కూడా జగన్ ఎత్తి చూపారు. స్పీకర్‌ను ఉద్దేశించి జగన్‌మోహన్‌రెడ్డి రాసిన లేఖ పూర్తి పాఠం ఇలా ఉంది.
 
 
గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గారికి..
 ‘‘ఇటీవల ముగిసిన శాసనసభా సమావేశాల్లో మా ఎమ్మెల్యే ఆర్.కె.రోజాను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బిజినెస్ రూల్స్ 340(2) ప్రకారం ఒక ఏడాది పాటు సస్పెండ్ చేస్తూ తీర్మానం ఆమోదించిన సంగతి తెల్సిందే. రూల్ 340 ఏం చెబుతున్నదంటే...

 1)ఒక సభ్యుడు పదే పదే సభాపతిని అగౌరవపరుస్తూ, సభా నిబంధలను అదే పనిగా ఉల్లంఘిస్తూ, ఉద్దేశపూర్వకంగానే సభా కార్యక్రమాలకు భంగం కలిగిస్తున్నట్లుగా స్పీకర్ భావించినపుడు...

 2) అలా వ్యవహరిస్తున్న సభ్యుడి  సస్పెన్షన్ తీర్మానం తన ముందుకు వచ్చినపుడు ఆ శాసనసభా సమావేశాల్లో తదుపరి మిగిలి ఉన్న కాలానికి ఆ సభ్యుడిని సభా కార్యక్రమాల్లో లేకుండా స్పీకర్ సస్పెండ్ చేయవచ్చు. అయితే ఆ సభ్యుడి సస్పెన్షన్‌ను ఆ తదుపరి ఎప్పుడైనా ఉపసంహరిస్తూ మళ్లీ తీర్మానం చేసే అవకాశం ఎప్పుడూ ఉంటుంది.  

 3) అలా సస్పెండ్ అయిన సభ్యుడు ఈ నిబంధన కింద శాసనసభ ప్రాంగణం నుంచి వెళ్లి పోవాల్సి ఉంటుంది’ సభా నియమాలు ఇంత స్పష్టంగా ఉన్న నేపథ్యంలో... 340 నిబంధన కింద ఒక సభ్యుడి సస్పెన్షన్‌కు తీర్మానం వచ్చినపుడు అది సభా నియమాలకు లోబడి ఉన్నదా అనేది స్పీకర్  కచ్చితంగా పరిశీలించాలి. ఒక వేళ అది సభా నియమాలకు లోబడి లేనట్లయితే అలాంటి తీర్మానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ స్పీకర్ అనుమతించకూడదు. సభలోని వంద శాతం సభ్యులు ఆమోదిస్తారని భావించినా కూడా ఇలాంటి  అక్రమమైన తీర్మానాన్ని చేపట్టకూడదు.

 దురదృష్టకర సంఘటన.. బ్లాక్‌డే..
 డిసెంబర్ 2015, 18వ తేదీ నాటి ఆంధ్రప్రదేశ్ శాసనసభా కార్యక్రమాల రికార్డులను చూస్తే... శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు 340 నిబంధనను అనుసరించి రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేయాలని తీర్మానం ప్రతిపాదించారు. (వాస్తవానికి ఈ నిబంధన కింద సభా సమావేశాలు మిగిలి ఉన్న కాలానికే ఒక సభ్యుడిని లేదా సభ్యురాలిని సస్పెండ్ చేయాలి) నిబంధనలకు పూర్తిగా విరుద్ధమైన ఈ తీర్మానాన్ని స్పీకర్ అపుడే అభ్యంతరం తెలిపి ఆపాల్సింది. కానీ యనమల ప్రతిపాదించిన తీర్మానాన్ని సభలో అనుమతించి ఆ తరువాత రోజాను సస్పెండ్ చేయడం రాష్ట్ర శాసనసభ చరిత్రలో అత్యంత దురదృష్టకర సంఘటన. అదొక బ్లాక్‌డే.

 నిబంధనలున్నది ఉల్లంఘించడానికా..?
 జరిగిన ఈ తప్పును కప్పి పుచ్చుకోవడానికి.. శాసనసభ చాలా అత్యున్నతమైనదని, సభ బిజినెస్ రూల్స్‌ను పాటించాల్సిన అవసరం అంతకంటే లేదని శాసనసభా వేదికపైనే మంత్రి యనమల వెల్లడించారు. 1994-99 మధ్య ఐదేళ్ల పాటు స్పీకర్‌గా పనిచేసిన వ్యక్తి సభా నిబంధనలు అసందర్భమని ఎలా చెబుతారు? అలాంటపుడు ఇక నిబంధనలు ఎందుకున్నట్లు? లోక్‌సభలో మాత్రం నిబంధనలు ఎందుకు ఉండాలి? ఆ నిబంధనలున్నవి ఉల్లంఘించడానికేనా? పార్లమెంటు ఉభయసభలు, రాష్ట్రాల శాసనసభలు.. భారత రాజ్యాంగంలోని 208 లేదా 118 అధికరణల కింద రూపొందించుకున్న సభా నియమనిబంధనల ప్రకారం నడుస్తున్నాయి. ఈ నిబంధనలను అనుసరించే మన చట్ట సభలు కూడా నడుస్తున్నాయి. మన అసెంబ్లీ రూల్స్ ఇంచుమించుగా లోక్‌సభ నిబంధనల తరహాలోనే ఉంటాయి. ఇవన్నీ కాల పరీక్షకు నిలబడ్డాయి. సభ్యులమైన మనం ఈ నిబంధనలను అనుసరించకూడదని భావించినపుడే సమస్యలు తలెత్తుతాయి.

 రోజా శాసనసభ్యత్వం అలాగే ఉంటుంది...
 రోజా సస్పెండ్ అయ్యారు కనుక ఆమె ఒక సాధారణ వ్యక్తి మాత్రమేనని, శాసనసభ్యురాలిగా ఆమెకు ఎలాంటి ప్రభుత్వ సౌకర్యాలు కల్పించడానికి అర్హురాలు కాదని, వేతనం రాదని, ఎమ్మెల్యేగా ఆమెకు కేటాయించిన అధికార గృహంలో నివాసం ఉండరాదని కూడా శాసనసభా వ్యవహారాల మంత్రి చెప్పారు. ఆమెను కేవలం శాసనసభా కార్యక్రమాల  నుంచి మాత్రమే సస్పెండ్ చేశారని, ఆమె శాసనసభ్యత్వం అలాగే ఉందనే విషయం యనమల మరిచారా?

 లోక్‌సభలో 374.. అసెంబ్లీలో 340... ఒకటే...
 లోక్‌సభ బిజినెస్ రూల్స్‌లోని 374వ నిబంధనను ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తున్నాను. రాష్ట్ర శాసనసభలో 340 వ నిబంధన ఎలాఉందో లోక్‌సభలోని 374 లో కూడా అవే అంశాలున్నాయనే విషయాన్ని ఇక్కడ గమనించాలి.
 ‘374 (1) ఒక సభ్యుడు పదే పదే స్పీకర్‌ను అగౌరవపరుస్తూ సభా నిబంధనలను అదే పనిగా ఉల్లంఘిస్తూ, ఉద్దేశపూర్వకంగానే సభా కార్యక్రమాలకు భంగం కలిగిస్తున్నట్లుగా స్పీకర్ భావించినపుడు.
 (2) అలాంటి సందర్భంలో అలా వ్యవహరిస్తున్న సభ్యుడి  సస్పెన్షన్ తీర్మానం తన ముందుకు వచ్చినపుడు ఆ శాసనసభా సమావేశాల్లో తదుపరి మిగిలి ఉన్న కాలానికి ఆ సభ్యుడిని సభా కార్యక్రమాల్లో లేకుండా సస్పెండ్ చేయవచ్చు. అయితే ఆ సభ్యుడి సస్పెన్షన్‌ను  ఆ తదుపరి ఎప్పుడైనా ఉపసంహరిస్తూ మళ్లీ తీర్మానం చేసే అవకాశం ఎప్పుడూ ఉంటుంది.
 (3) అలా సస్పెండ్ అయిన సభ్యుడు ఈ నిబంధన కింద శాసనసభ ప్రాంగణం నుంచి వెళ్లి పోవాల్సి ఉంటుంది’

 లోక్‌సభలో పెప్పర్ స్ప్రే కంటే ఘోరమా..?
 ఈ సందర్భంగా 2014 ఫిబ్రవరి 13వ తేదీన లోక్‌సభలో చోటు చేసుకున్న పరిణామాలను గుర్తుకు తెచ్చుకోవాలి. ఆరోజు లోక్‌సభలో విపరీతమైన ఘర్షణ, ఉద్రిక్త వాతావరణం, గందరగోళం నెలకొంది. పోడియం వద్ద ఎంపీల మధ్య ముష్టిఘాతాలు చోటు చేసుకోవడమే కాక  ఆరోగ్యానికే తీవ్ర హానికరమైన పెప్పర్ స్ప్రేను కొందరు సభ్యులు ప్రయోగించారు. ఈ గలాభాకు, గందరగోళానికి కారణమైన 18 మంది ఎంపీలను లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ ఆ లోక్‌సభా సమావేశాలు మిగిలి ఉన్న కాలానికే సస్పెండ్ చేయడం ఇక్కడ గమనించాల్సిన అంశం. లోక్‌సభలో అలాంటి నిర్ణయం తీసుకున్నపుడు ఏపీ అసెంబ్లీలో మాత్రం ఇలాంటి అసాధారణమైన నిర్ణయం ఎలా తీసుకుంటారు? దేశం మొత్తం అనుసరించే విధానాలకు ఇక్కడ మాత్రమే భిన్నమైన భాష్యాన్ని చెబుతూ అనుసరిస్తున్నారు. పైగా ఆరోజు లోక్‌సభలో జరిగిన ఘటనలతో పోల్చితే ఏపీ శాసనసభలో జరిగింది చాలా స్వల్పం.

 అవసరమైతే బిజినెస్ రూల్స్ సవరించాలి..
 అందువల్ల, శాసన సభ నియమనిబంధనలకు మనం ఎంత కచ్చితంగా కట్టుబడి ఉన్నాం... ఎంత నిస్పాక్షికంగా సభా కార్యకలాపాలను నడిపిస్తున్నాం అనే దానిపై అంతా అధారపడి ఉంటుంది. కారణాలేవైనా ప్రస్తుతం ఉన్న నియమనిబంధనలు సరిపోవని మొత్తం సభ భావిస్తే, నిబంధనలకు అవసరమైన సవరణలను చేయడానికి గాను అసెంబ్లీ నిబంధనల కమిటీకి నివేదించాలి. ఆ విషయాన్ని సభ్యులందరికీ తెలియజేయాలి. ఆ తర్వాత వాటినే అమలు చేయాలి. ‘బిజినెస్ రూల్స్ పట్టించుకోనవసరం లేదు. సభలో స్పీకర్ నిర్ణయమే అంతిమం’ అనే వ్యాఖ్యలు చట్టం తెలియకపోవడం వల్లే చేశారనుకోవాలి. అటువంటి వైఖరి దురదృష్టకరం.
 మనం పారదర్శకమైన, హేతుబద్ధమైన, అర్థవంతమైన విధానాన్ని అనుసరించక పోతే మనం తీసుకునే నిర్ణయాలు న్యాయస్థానాలు ప్రశ్నించే విధంగానే తయారవుతాయి. అదే కనుక జరిగితే శాసనసభల ఔన్నత్యానికి భంగం వాటిల్లుతుంది. అదే జరిగిననాడు మనందరికీ అదొక విషాద దినంగా మారుతుంది.
 నేను 2015 డిసెంబర్ 19వ తేదీన రాసిన లేఖలో కూడా ఏపీ శాసనసభ నియమాల్లో 340 (2) నిబంధన ప్రకారం రోజా సస్పెన్షన్ విరుద్ధమని, ఉపసంహరించుకోవాలని మీకు విజ్ఞప్తి చేశాను.
 ఈ అంశాలన్నింటి నేపథ్యంలో.. బిజినెస్ రూల్స్‌కు విరుద్ధంగా ఏడాది పాటు చేసిన రోజా సస్పెన్షన్‌ను ఉపసంహరించుకోవాలని మీకు మరోమారు విజ్ఞప్తి చేస్తున్నాను. 340(2) నిబంధన కింద ఆమెను సస్పెండ్ చేయడం చట్ట విరుద్ధం , రాజ్యాంగ విరుద్ధమని మీకు మనవి చేస్తున్నాను.
 
 కృతజ్ఞతలతో
 మీ విశ్వాసపాత్రుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

నిబంధనలను అతిక్రమిస్తే న్యాయస్థానాల్లో విచారణార్హమే..
 శాసనసభ సర్వోన్నతమైనదని, సభ తీసుకునే నిర్ణయాలను ఏ న్యాయస్థానం కూడా ప్రశ్నించజాలదని శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల చెప్పారు. బహుశా ఆయన భారత రాజ్యాంగంలో 212 అధికరణలోని అంశాల ఆధారంగా అలాంటి అభిప్రాయానికి వచ్చినట్లుంది. స్పీకర్ స్థానం అనేది రాజ్యాంగం ప్రకారం అత్యున్నతమైన దే. కానీ స్పీకర్ స్థానంలో ఉన్న అతడు/ఆమె సభా నియమనిబంధనలకు లోబడి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. స్పీకరే కాదు చట్టసభలోని సభ్యులు కూడా వాటికి లోబడే విధులు నిర్వహించాలి. ఈ నియమ నిబంధనలకు లోబడే చట్ట సభలు నడుస్తాయి కనుక రాజ్యాంగంలోని 122/212 అధికరణల ప్రకారం వీటికి కొన్ని రక్షణలు కల్పించారు. 212 అధికరణలో ఏముందో ఇక్కడ పొందు పరుస్తాను.
 212(1) ప్రకారం.. ‘‘నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయన్న ఆరోపణలపై రాష్ట్ర శాసనసభల కార్యకలాపాల చట్టబద్ధతను ఎవరూ ప్రశ్నించడానికి వీల్లేదు’’
 దీనిని బట్టి సుస్పష్టంగా అర్థం అయ్యేది ఏమిటంటే నిబంధనలకు విరుద్ధంగా చట్టసభలు వెళుతున్నాయనే ఆరోపణలపై న్యాయ సమీక్షకు అవకాశం లేదు. కానీ అసెంబ్లీ నియమనిబంధనలను అతిక్రమించినపుడు న్యాయస్థానాలు సమీక్ష చేయరాదనే అడ్డు ఏమీ లేదు.
 ‘రాజా రాంపాల్ వర్సెస్ లోక్‌సభ స్పీకర్’ కేసులో సుప్రీంకోర్టు సుస్పష్టంగా ఇలా చెప్పింది. ‘పార్లమెంటు ఉభయ సభల్లో నియమ నిబంధనలు అతిక్రమించినట్లు వెల్లడైతే అవి హైకోర్టులలో, లేదా సుప్రీంకోర్టులో విచారణార్హంఅవుతాయి. ఈ సందర్భంలో రాజ్యాంగంలోని 122/212 అధికరణలలోని రక్షణలు అడ్డురావు.’
 ఎవరి అధికారాలూ తిరుగులేనివి కావు...
 ఏ రాజ్యాంగ పదవికి సంక్రమించిన అధికారాలైనా, రక్షణలైనా తిరుగులేనివి కావనే నియమంపైనే మన రాజ్యాంగ ప్రజాస్వామ్య పునాదులు ఏర్పడ్డాయి.  అందుకని అధికారాలను తమకు నచ్చని, ఎంపిక చేసుకున్న వ్యక్తులపై అడ్డగోలుగా, ఇష్టానుసారం ప్రయోగించడానికి వీలు లేదు. సహజన్యాయ సూత్రాలకు, నియమనిబంధనలకు విరుద్ధంగా రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారు నిర్ణయాలు తీసుకున్న అనేక సందర్భాలలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. రాజ్యాంగంలోని పదో షెడ్యూలు ప్రకారం స్పీకర్ తీసుకునే నిర్ణయాలు న్యాయస్థానాల పరిధిలోకి రాకపోయినా స్పీకర్ చర్యల్లో జోక్యం చేసుకోకుండా సుప్రీంకోర్టును నిరోధించజాలవనే విషయం మీకూ తెలిసిందే. అందుకు తాజా ఉదాహరణను ఇక్కడ పొందు పరుస్తున్నాను. బాల్‌చంద్ర ఎల్ జార్కిహోలి అండ్ అదర్స్ వర్సెస్ బి.ఎస్. యడ్యూరప్ప అండ్ అదర్స్ (కర్నాటక) కేసులో  రాజ్యాంగంలోని పదో షెడ్యూలు కింద 13 మంది ఎమ్మెల్యేలను కర్నాటక స్పీకర్ అనర్హులుగా ప్రకటించిన నిర్ణయం చెల్లదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ సభ్యులను అనర్హులుగా ప్రకటించడం ‘సభ్యుల అనర్హత నిబంధనలు 6(5)(బి), 7(3)-1986’ను అతిక్రమిస్తూ తీసుకున్న నిర్ణయమని, పైగా సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా జరిగిందని సుప్రీంకోర్టు ఈ కేసులో పేర్కొన్నది.

 

>
మరిన్ని వార్తలు