ఇదేం చర్య?!

19 Sep, 2017 00:51 IST|Sakshi
ఇదేం చర్య?!

న్యాయస్థానాల హితబోధలు, మందలింపుల మాటెలా ఉన్నా దేశంలో స్పీకర్ల వ్యవస్థ పెద్దగా మారిందేమీ లేదని మరోసారి రుజువైంది. తమిళనాడులో టీటీవీ దినకరన్‌కు చెందిన అన్నా డీఎంకే వర్గం ఎమ్మెల్యేలు 18మందిని  అనర్హులుగా ప్రకటిస్తూ స్పీకర్‌ ధన్‌పాల్‌ సోమవారం తీసుకున్న నిర్ణయం అత్యంత వివాదా స్పదమైనది. విచారకరమైనది. పళనిస్వామి ప్రభుత్వం బల పరీక్షకు రాష్ట్ర హైకోర్టు విధించిన గడువుకు రెండు రోజుల ముందు తీసుకున్న ఈ చర్యలోని అంతరా ర్ధమేమిటో సుస్పష్టమే. దినకరన్‌ వర్గం ఎమ్మెల్యేల వేరు కుంపటి కారణంగా పళని స్వామి ప్రభుత్వం మైనారిటీలో పడింది. దాన్ని కాపాడటం కోసమే స్పీకర్‌ ఈ చర్యకు ఉపక్రమించారు.

నిజానికి ఇలాంటి ప్రమాదాన్ని ఊహించబట్టే తక్షణం బల పరీక్షకు ఆదేశించాలని రాష్ట్ర గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగరరావును దినకరన్‌ వర్గం ఎమ్మెల్యేలు కోరారు. ఆయన ఈ విషయమై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తుండటాన్ని గమనించి మద్రాస్‌ హైకోర్టును సైతం ఆశ్రయించారు. ఈ నెల 20 వరకూ ఎలాంటి బలపరీక్ష జరపరాదని కోర్టు  స్టే విధించింది. ఈ ఆదేశం వల్ల దినకరన్‌ వర్గానికి ఒరిగిందేమీ లేకపోగా స్పీకర్‌కు తగినంత సమయం చిక్కింది. దాన్ని వినియోగించుకుని ఆయన పళనిస్వామి ప్రభుత్వాన్ని కాపాడారు.

ఎన్నికల్లో ప్రజల మద్దతు కూడగట్టుకుని తగినంత సంఖ్యాబలాన్ని సాధించు కున్న పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సర్వసాధారణం. అనుకోని పరిణా మాలు సంభవించి ఆ పార్టీ సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు దాని బలాబలాలు తేలాల్సింది చట్టసభలోనే. అక్కడ ఎవరికీ తగినంత బలం లేదని తేలిన పక్షంలో అసెంబ్లీని రద్దు చేసి తిరిగి ఎన్నికలు నిర్వహించడమే సబబు. ఎస్‌ఆర్‌ బొమ్మై కేసులో చరిత్రాత్మకమైన తీర్పునిస్తూ ప్రభుత్వాల బలాబలాలు తేలాల్సింది చట్ట సభల్లో తప్ప రాజ్‌భవన్‌లలో కాదని సుప్రీంకోర్టు ఎన్నడో స్పష్టం చేసింది.

అయినా అడపా దడపా ఏదో రకమైన సాకుతో ప్రభుత్వాలను పడగొట్టడం ఆగలేదు. అలాంటి సందర్భాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకుని సరిదిద్దుతూనే ఉన్నాయి. ఈ దుస్సంప్రదాయాన్ని ప్రారంభించిందీ, యథేచ్ఛగా కొనసాగించిందీ కాంగ్రెసే అయినా... ఆ తర్వాత వచ్చిన ఇతర పార్టీలు కూడా అవకాశం దొరికినప్పుడల్లా దాన్ని ఉపయోగిస్తూనే వచ్చాయి.

తమిళనాడులో ఇప్పుడు నెలకొన్న పరిస్థితి విచిత్రమైనది. నిరుడు మే నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత నేతృత్వంలోని అన్నా డీఎంకే ఘన విజయం సాధించి వరసగా రెండోసారి అధికారంలోకొచ్చింది. కానీ మూడు నెలలు గడవ కుండానే జయ అనారోగ్యం బారినపడ్డారు. గత డిసెంబర్‌ 5న కన్నుమూశారు. ఆ తర్వాత నుంచి తమిళనాడు రాజకీయ సంక్షోభంలో చిక్కుకుంది. ఆమె తర్వాత వచ్చిన పన్నీర్‌సెల్వం చాలా త్వరలోనే రాజీనామా చేయడం, శాసనసభా పక్ష నేతగా శశికళ పేరు ప్రతిపాదించడం, ఆ తర్వాత తిరుగుబాటు చేయడం చకచకా జరిగిపోయాయి.

సీఎంగా ప్రమాణస్వీకారం చేయాల్సిన శశికళ అవినీతి కేసులో జైలుపాలు కావడంతో ఆమె ఆశీస్సులతో పళనిస్వామి సీఎం పదవి చేపట్టారు. శశికళ మేనల్లుడు దినకరన్‌ రంగ ప్రవేశం చేశాక పళనిస్వామి కూడా ఆమెకు దూరమయ్యారు. అప్పటినుంచి పళనిస్వామి ప్రభుత్వాన్ని పడగొట్టాలని దినకరన్‌ ప్రయత్నిస్తున్నారు. ఆయన శిబిరంలో 19మంది ఎమ్మెల్యేలున్నారు. పన్నీర్‌సెల్వం పళనిస్వామి వర్గాలు చేతులు కలిపాక వారి బలం 111. 234మంది సభ్యులున్న అసెంబ్లీలో ప్రభుత్వానికి కావలసిన కనీస సంఖ్యాబలం 117. విపక్షాల బలం 98. వీరితో దినకరన్‌ వర్గం జతగూడితే పళనిస్వామి ప్రభుత్వం కుప్పకూలుతుంది. పరి స్థితి ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు బలపరీక్షలో జాప్యం ఎందుకు జరగాలి? ఒకపక్క దినకరన్‌ బలవంతంగా ఎమ్మెల్యేలను తన శిబిరంలో ఉంచుకున్నారని పళనిస్వామి ఆరోపిస్తున్నారు.

అలాంటపుడు ఓటింగ్‌కు ఆయన ఎందుకు సిద్ధపడలేకపోయారు? ఆయన తప్పించుకు తిరుగుతున్నారు సరే... దానికి గవర్నర్‌ సహకరించ డంలోని అంతరార్ధం ఏమిటి? కనీసం ఈ వ్యవహారం తన ముందుకొచ్చినప్పుడు మద్రాస్‌ హైకోర్టయినా వెనువెంటనే బలపరీక్షకు ఆదేశించి ఈ నాటకానికి తెరదిం చాల్సింది. లేదా బలపరీక్ష లోపు ఈ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయరాదన్న తాత్కాలిక ఆదేశాలైనా ఇవ్వాల్సింది. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు పోను అసెం బ్లీలో ఇప్పుడున్న సభ్యుల సంఖ్య 215. పర్యవసానంగా ప్రభుత్వానికి కావలసిన కనీస మెజారిటీ 108 అయింది. కనుక పళనిస్వామి ప్రభుత్వం గట్టెక్కడం పెద్ద కష్టం కాదు. కానీ ఇది ఆరోగ్యకరమైన పోకడేనా?

అనర్హత వేటు చట్టబద్ధతను ఇప్పుడు ఎటూ దినకరన్‌ వర్గం న్యాయస్థానంలో సవాల్‌ చేస్తుంది. కానీ సంక్షోభం ఏర్పడినప్పుడు దానికి సాధ్యమైనంత త్వరగా ముగింపు పలకాలన్న ఆత్రుత ఎవరిలోనూ లేకపోవడం విచారకరం. ఆమధ్య పళనిస్వామి, పన్నీర్‌సెల్వం మధ్య పోటీ ఏర్పడినప్పుడు రోజుల తరబడి రెండు వర్గాలూ శిబిరాలు నడిపాయి. మళ్లీ ఇప్పుడు దినకరన్‌ వర్గం ఆ పనే చేసింది. ఇందువల్ల చట్టసభలపై, మొత్తంగా ప్రజాస్వామ్యంపై ప్రజల్లో చులకన భావం ఏర్పడుతుంది. పాలన కుంటుబడుతుంది.

అధికారం ఎవరికుంటుంది, ఎవరికి పోతుందన్నది ప్రధానం కాకూడదు. ఏర్పరుచుకున్న నిబంధనలు అమ లయ్యేలా చూడటం, వ్యవస్థలు నవ్వులపాలు కాకుండా చూడటం ప్రధానం. తమిళనాడులో జరుగుతున్న పరిణామాలతో తమకు సంబంధం లేదని కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న బీజేపీ చెబుతోంది. అది  నిజమే కావొచ్చు. ఎందుకంటే ఆ పార్టీకి అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేదు. కానీ రాష్ట్రంలో పాలన కుంటుబడినప్పుడు, సంక్షోభం ఎడతెగకుండా సాగుతున్నప్పుడు దాన్ని చక్క దిద్దాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా? ఇప్పటికైనా తమిళనాట సంక్షోభానికి అర్ధవంతమైన ముగింపు పలకాలి. పళనిస్వామి సర్కారు మనుగడ కన్నా అక్కడ ప్రజాస్వామ్యం పదిలంగా ఉండటం అవసరమన్న స్పృహ అందరిలోనూ ఏర్పడాలి.

మరిన్ని వార్తలు