మెజారిటీ భారతీయులను విస్మరించిన మీడియా

11 Sep, 2016 02:23 IST|Sakshi
మెజారిటీ భారతీయులను విస్మరించిన మీడియా

 
 అవలోకనం


మన పాత్రికేయ వృత్తిలో, మన సినిమాల్లో ఒక ఏకత్వం ఉంది. ఇవి ఉద్దేశపూర్వకంగానే జనాభాలో అధిక భాగాన్ని పక్కనబెడుతున్నాయి. మెజారిటీ జనాభాకు చెందిన కథనాలను, సినిమాలను రాయడానికి, చిత్రించడానికి తగిన ఆసక్తి లేక కాదు. భారతీయ నగర, ఉన్నత కుల-వర్గ పాఠక లోకం, వీక్షకులు అలాంటి విషయాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. సగటు మనిషి సమస్యలను వార్తా పత్రికల యజమానులు, ప్రకటనల విభాగపు డెరైక్టర్లు ‘చవకబారు’ వ్యవహారాలుగా పరిగణిస్తున్నారు. మన సామాజిక క్రూరత్వానికి ఇది గీటురాయి.
 
ఈ కాలమ్‌ని చాలా కాలం నుంచి చదువుతున్న పాఠకులకు, 20 సంవత్సరాల క్రితం దినపత్రికల్లో నిత్యం కనిపిస్తూవచ్చిన వరకట్న హత్యా కథనాలు గుర్తుండే ఉంటారు. ప్రతి రోజు లేదా రోజుమార్చి రోజు దినపత్రికల తొలి పేజీల్లో వర కట్న హత్యలకు సంబంధించిన ఒకే విధమైన వార్తలు కనిపించేవి. అత్తామామలు తమ కోడలిని తగులబెట్టి, వంటగదిలో స్టౌ పేలిపోవడమే దీనికి కారణమనే వారు. తర్వాత అత్తమామలు, భర్తను కూడా పోలీసులు అరెస్టు చేసేవారు.

ఇలాంటి కథనాలు ఇప్పుడు మన పత్రికల్లో ప్రత్యేకించి ఇంగ్లిష్ దినపత్రికల్లో కనిపించవు. టీవీ చానళ్లలో అయితే అస్సలు కనిపించవు. ఎందుకు? ఒక కారణం ఏమిటంటే... వరకట్న హత్యా ఘటనల కేసుల్లో ఆధారాలను చూపించవలసిన బాధ్యత అత్తామామల మీదే పెడుతూ కొన్ని చట్టాలను ఈ కాలంలో ఆమోదిం చారు. కుటుంబంలో ఏ మహిళ అరుునా కాలిన గాయాలతో మరణిస్తే వీరిపై వెను వెంటనే హత్యానేరం మోపేవారు. బహుశా ఇంతటి కఠిన చట్టాల కారణంగానే వరకట్న హత్యల కథనాలను ఇకపై మనం చూడబోము.

మరొక కారణం కూడా ఉంది. వరకట్న హత్యలు తగ్గుముఖం పట్టలేదు. గడిచిన అన్ని సంవత్సరాల్లో ఇలాంటి ఘటనలు చాలా ఎక్కువగానే చోటు చేసుకున్నాయి. 2015లో 7,634 వరకట్న హత్యలు జరగగా, 2014లో 8,455 హత్యలు.. దానికి మునుపటి రెండు సంవత్సరాలలో వరుసగా 8,083, 8,233 వరకట్న హత్యలు జరిగాయి. భారత్‌లో ఇప్పుడు ప్రతిరోజూ ఇలాంటి హత్య కేసులు 20 కంటే ఎక్కువగానే నమోదవుతున్నాయి. 20 ఏళ్ల క్రితం నేను ప్రస్తావిం చిన దాని కంటే ఎక్కువ సంఖ్యలోనే ఈ వరకట్న హత్యలు జరుగుతుండవచ్చు.

కానీ వీటి గురించి మనం ఇప్పుడు ఎందుకు వినడం లేదంటే.. మన మీడియా, ప్రత్యేకించి జాతీయ మీడియా, ఇంకా చెప్పాలంటే ఇంగ్లిష్ మీడియా ఇలాంటి వార్తా కథనాలను ఇప్పుడు నివేదించడం లేదు. సంపన్నవర్గాలు పట్టించు కోని ఇలాంటి నేర లేదా మానవీయ కథనాలపై దీనికి ఎలాంటి ఆసక్తీ లేదు. దేశ జనాభాలో అతిపెద్ద విభాగాన్ని మీడియా ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తోంది.

 కారణం ఏంటంటే ఇలాంటి కథనాలు, వాటికి ఆధారమైన ప్రజలను వార్తా పత్రికల యజమానులు, ప్రకటనల విభాగపు డెరైక్టర్లు ‘చవకబారు’ వ్యవహారా లుగా పరిగణిస్తున్నారు. సంపన్నులకు అనుకూలంగా ఉండే వార్తా కథనాలపై మోజు ప్రదర్శిస్తున్న ఇంగ్లిష్ పాఠకులు అలాంటి చవకబారు వార్తలపై ఎలాంటి ఆసక్తీ చూపటం లేదన్నది ఒక సమర్థన. అంటే సంపన్నులు, మరింత ప్రముఖు లకు సంబంధించిన కథనాలనే వీరు పట్టించుకుంటున్నారని దీనర్థం.

1995 ప్రాంతంలో మొదలైన ఇలాంటి ధోరణిని సంపాదకులు, పాత్రి కేయులు ప్రారంభంలో కొంతమేరకు ప్రతిఘటించారు. అరుుతే వరకట్న హత్యా కథనాల విషయంలో మనం చూసినట్లుగా, పాత్రికేయులు క్రమంగా లోబడి పోయారు. వీరు కథనానికి ఉన్న ప్రాముఖ్యత ప్రాతిపదికన కాకుండా సంబంధిత ఘటనల్లో పాలుపంచుకున్న వారెవరన్న ప్రాతిపదికనే వార్తలను నివేదించేవారు.

 కొంతమంది ప్రత్యేక వ్యక్తులపై కథనాలకు మాత్రమే ప్రాముఖ్యతనిచ్చే ఇలాంటి తరహా జర్నలిజం (ఆ రోజుల్లో ఇలాంటి వాటిని 3వ పేజీ వార్తలనేవారు) ముంబైలో ప్రారంభమైనప్పుడు, భౌగోళికత తనవంతు పాత్ర పోషించేది. నగరం లోని కొన్ని ప్రాంతాలకు చెందిన అంటే.. మధ్యతరగతి, నిరుపేదలకు సంబంధిం చిన వార్తలను ప్రచురించడం వార్తాపత్రికలు నిలిపివేశారుు. సంపన్నులు, ప్రము ఖులు నివసిస్తున్న ప్రాంతాలపైనే పత్రికలు దృష్టి సారించాయి.

ఇంగ్లిషేతర పత్రికలను కూడా ఇది కొంతమేరకు ప్రభావితం చేసింది. దశాబ్దం క్రితం అహమ్మదాబాద్‌లో ఒక గుజరాతీ పత్రికకు నేను సంపాదకత్వం వహించినప్పుడు ఈ ధోరణి ప్రస్ఫుటంగా కనిపించేది. నగరంలోని కొన్ని ప్రాంతా లకు చెందిన వార్తలను కావాలనే నిర్లక్ష్యం చేసేవారు. ఎందుకంటే, ఆ పత్రికను చదివే ప్రధాన పాఠకులు నివసించే ప్రాంతాలు కావవి.

భారతీయ సినీ పరిశ్రమలోకూడా ఇలాగే జరిగేది. నిరుపేద మూలాలు కలిగిన బాలీవుడ్ హీరో మూడు దశాబ్దాల క్రితం హిందీ సినిమాల్లో సర్వ సాధార ణంగా కనిపించేవాడు. తన దారిద్య్రం పట్ల అతడు ఎన్నడూ సిగ్గుపడేవాడు కాదు. 1983లో అమితాబ్ బచ్చన్ ‘కూలీ’ అనే హిట్ సినిమాలో నటించారు. కానీ, ఈ రోజుల్లో ‘అలగా జనం’ పాత్రలో హీరో కనిపించడం ఊహకై నా సాధ్యం కాదు.
 
1996లో ‘దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే’ తదితర సినిమాలను బాలీవుడ్ విడుదల చేసింది. ఇవి భారత్‌ను పట్టి పీడిస్తున్న మౌలిక సమస్యలను పట్టించుకునే చిత్రాలు కావు. పైగా, ఇవి సంపన్న కుటుంబాలకు చెందిన అతిచిన్న సామాజిక సమస్యలను చిత్రించేవి. ఎక్కడయితే ఆ సినిమాలను నిర్మిస్తున్నారో ఆ సమాజా నికి చెందిన జీవన వాస్తవాన్ని ఇవి పూర్తిగా విస్మరించేశారుు. అదే సమయంలో షాపింగ్ మాల్స్‌లో మల్టీప్లెక్స్ సినిమాలు మొదలయ్యాయి. వీటిలో టికెట్ల ధరలు సాధారణ థియేటర్లతో పోలిస్తే రెండు లేదా మూడు రెట్లు అధికం. అంత ఖర్చు పెట్టలేని మెజారిటీ భారతీయులను ఇవి పూర్తిగా పక్కన పెట్టేవి.

అన్యాయం, హింస వంటి కథాంశాలతో ధర్మేంద్ర, మిథున్ చక్రవర్తి వంటి నటులు నటించిన, బి గ్రేడ్ సినిమాలుగా పేర్కొంటున్న చిత్రాలు బాలీవుడ్‌లో అప్పుడు వచ్చేవి. కానీ వీటిని ఒకే ఒక తెర ఉన్న హాళ్లలో,  చిన్న పట్టణాలలో తప్ప మల్టీప్లెక్స్ థియేటర్లలో ప్రదర్శించేవారు కారు. ఈ రోజుల్లో అయితే ఇలాంటి సిని మాలను కూడా ఎవరూ నిర్మించటం లేదు.

మన పాత్రికేయ వృత్తిలో, మన సినిమాల్లో ఒక ఏకత్వం ఉంది. ఇవి ఉద్దేశ పూర్వకంగానే జనాభాలో అధిక భాగాన్ని పక్కనబెడుతున్నాయి. మెజారిటీ జనాభాకు చెందిన కథనాలను, సినిమాలను రాయడానికి, చిత్రించడానికి తగిన ఆసక్తి లేనందున కాదు. భారతీయ నగర, ఉన్నత కుల-వర్గ పాఠకలోకం, వీక్షకులు అలాంటి విషయాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు మరి. మన సమాజాన్ని ఇప్పుడు అలాంటి అవధుల్లేని క్రూరత్వమే ఆవరించి ఉంది.

వ్యాసకర్త: ఆకార్ పటేల్
కాలమిస్టు, రచయిత  
aakar.patel@icloud.com

మరిన్ని వార్తలు