వారు ఆంధ్రులను మోసగించారు

12 Jun, 2016 15:26 IST|Sakshi
వారు ఆంధ్రులను మోసగించారు

కాంగ్రెస్ నేత, రాష్ట్ర విభజనలో కీలక పాత్ర పోషించిన జైరామ్ రమేశ్ రచన ‘ఓల్డ్ హిస్టరీ, న్యూ జాగ్రఫీ’ ఈ నెల 15న విడుదల కాబోతోంది. అందులోని విభజన అంశం గురించి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో జైరామ్ వివరించారు. ముఖ్యాంశాలు...

 ప్ర: త్వరలో విడుదలవుతున్న మీ పుస్తకం ‘ఓల్డ్ హిస్టరీ, న్యూ జాగ్రఫీ’ (పాత చరిత్ర, కొత్త భూగోళ శాస్త్రం)లో ఆంధ్రప్రదేశ్ విభజనకు దారితీసిన చారిత్రక కారణాలు చర్చించారా?

 జ: ఔను. 1950 నుంచి, వైఎస్‌ఆర్‌గారు మరణించేవరకు ఉన్న సుదీర్ఘ చరిత్ర గురించి ఇందులో చర్చించాను. విభజన ఒక చారిత్రక నేపథ్యంలో జరిగింది. దానిని చాలామంది విభజన వ్యతిరేకులు సౌకర్యంగా మరచిపోతున్నారు. 1960లలో జై తెలంగాణ ఉద్యమం జరిగినట్టే, 1970లలో జై ఆంధ్ర ఉద్యమం జరిగిందన్న సంగతిని కూడా విస్మరిస్తున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన నిర్ణయం సరైనదేనని భావిస్తున్నారా? అది అనివార్యమేనా?

 ఆ నిర్ణయం తప్పో ఒప్పో నేను చెప్పలేను గానీ, విభజన అనివార్యమనే నేనను కుంటున్నాను. ఒక్క సీపీఎం మినహా అన్ని రాజకీయ పార్టీలు విభజన కోసం గట్టిగానే అడిగాయి. టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ  లిఖితపూర్వకంగా కూడా కోరాయి. వాస్తవానికి టీడీపీ రెండుసార్లు కోరింది. కాలం గడిచే కొద్దీ విభజన ఫలితాలు అనుభవానికి వస్తాయని నా భావన. హైదరాబాద్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ నగర చరిత్ర, సంస్కృతి, అక్కడ సాధిం చిన విజయాలు, దానికి ఉన్న బలం అన్నీ నాకు ఎంతో ఇష్టం. జరిగిందేమిటంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ కేంద్రంగా అభివృద్ధి సాగింది.


మీకు ఇంకొంత సమయం ఇచ్చి ఉంటే 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లును మరింత మెరుగ్గా తయారు చేయ గలిగి ఉండేవారన్న వాదనతో ఏకీభవిస్తారా?

 2014 బిల్లు ప్రాథమికంగా తీవ్రమైన లోపాలు ఉన్నదేమీ కాదని నా అభిప్రాయం. సున్నితమైన సమతౌల్య ప్రక్రియ ఫలితం ఈ బిల్లు. దీనితో తెలంగాణ ఏర్పాటు కావడమే కాకుండా, మిగిలిన సీమాంధ్ర ప్రయోజనాలను కూడా దృష్టిలో ఉంచుకుని రూపొందిం చినది. ఈ చట్టం రాజీతో జరిగిన కూర్పు. ఇందుకు నేను క్షమాపణలేమీ కోరడం లేదు. ఆ బిల్లులో ఎన్నో కొత్త అంశాలు చేరాయి. ఇవన్నీ నా పుస్తకంలో విస్తృతంగా చర్చించాను.


 ఎన్నికలకు ముందు విభజన విషయంలో సోనియాగాంధీ అడ్డదిడ్డమైన సల హాలు తీసుకుని నిరాశా పూరితమైన నిర్ణయం తీసుకున్నారా? ఆ నిర్ణయమే పార్టీ ఘోర వైఫల్యానికి దారి తీసిందని కూడా రుజువైంది.

 తెలంగాణ ఏర్పాటు విషయంలో జరిగిన రాజకీయ చర్చల గురించి నాకు తెలియదు. నా ప్రమేయం ఎక్కడి నుంచి అంటే, అక్టోబర్ 8, 2013న సాధారణ అవగాహన ఒప్పం దంలో నేను సభ్యుడినైన తరువాత నుంచి మాత్రమే. ఇది కచ్చితంగా రాజకీయ నిర్ణ యమే. కానీ చరిత్రతో సహా, చాలా అంశాలను దృష్టిలో ఉంచుకుని చేసిన నిర్ణయం.
 
విభజన ప్రక్రియకు అడ్డంకులు సృష్టించేందుకు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని దుర్విని యోగం చేయడానికి అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానవర్గం ఎందుకు అనుమతించింది?  అదొక వ్యూహమా? అదే కదా వికటించింది!

 ఈ విషయం కూడా ప్రస్తావించాను. సోనియాగాంధీనీ, మన్మోహన్‌సింగ్‌నూ కూడా అలక్ష్యం చేసినప్పటికీ, పార్టీనీ, కేంద్ర ప్రభుత్వాన్నీ కూడా ఖాతరు చేయక పోయి నప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డిని ఎందుకు కొనసాగిస్తున్నారోనని నేను ఆశ్చర్య పోయిన సంగతిని కూడా అందులో వివరించాను. అయితే అప్పుడు అంతకు మించి ప్రత్యామ్నాయం లేదని తరువాత ఒక సీనియర్ నేత నాతో అన్నారు. పార్టీ రాష్ట్రాన్ని విభ జించాలనే నిర్ణయం తీసుకున్నాక, దానిని అమలు చేయడానికి ముఖ్యమంత్రి నిరాకరిం చినప్పుడు ఆయనను మార్చి ఉండవలసిందని నేను స్పష్టంగా భావించాను.

 నాయకురాలిని గందరగోళ పరుస్తూ దిగ్విజయ్‌సింగ్ వంటి నాయకులు విశ్వసించడానికి వీలులేని రీతిలో పోషించిన పాత్రను గురించి ఏమంటారు? వారికి ఇష్టం లేని, వారు వ్యతి రేకించే విధానాన్ని అర్థమనస్కంగా అమలు చేయడానికి ప్రయత్నించినట్టు కనిపిస్తుంది.
 విశ్వసించదగని పాత్ర అంటూ ఎవరైనా పోషించారని నేను అనుకోను. ప్రతివారు తమకు పార్టీ లేదా ప్రభుత్వం అప్పగించిన బాధ్యతను నిర్వర్తించారు. ఛత్తీస్‌గఢ్‌ను మధ్య ప్రదేశ్ నుంచి విభజించినప్పుడు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా దిగ్విజయ్‌సింగ్ ఉన్నారన్న సంగతిని విస్మరించరాదు. మీరు దిగ్విజయ్‌సింగ్ నిర్వహించిన బాధ్యతను విశ్వసించదగి నది కాదు అనడం అన్యాయమని నేను అనుకుంటున్నాను కూడా.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న సమస్త సమస్యలకు మూలం విభజన చట్టమేనని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన ఆరోపణ న్యాయమైనదేనా?

 ఎంతమాత్రం కాదు. చంద్రబాబునాయుడు తన వ్యక్తిగత వైఫల్యాలను, ముఖ్యంగా ప్రధాని మోదీ చేత విభజన చట్టాన్ని సంపూర్ణంగా అమలు చేయించుకోవడంలో విఫలమై వాటిని కప్పిపుచ్చుకోవడానికే విభజన చట్టాన్ని తప్పుపడుతున్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ ప్రత్యేక ప్రతిపత్తి హోదాను ఐదేళ్లు ఇస్తామని అంటే, ఫిబ్రవరి 20, 2014న రాజ్యసభలో బీజేపీ నాయకుడు వెంకయ్య నాయుడు తమ ప్రభుత్వం వస్తే పదేళ్లు ఇస్తామని ప్రకటించారు. ఆ హామీ ఇంతవరకు ఎందుకు అమలు కాలేదు? వెంకయ్య ఇచ్చిన హామీని మోదీ చేత చంద్రబాబు ఇంతవరకు ఎందుకు అమలు చేయించుకోలేక పోయారు? ఇప్పుడు ఏపీలో ఏర్పాటు చేస్తున్న వ్యవస్థలన్నీ విభజన చట్టం మేరకు ఏర్పాటు చేస్తున్నవే.
 విభజన విషయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం విపక్షాల అభిప్రాయాలను కూడా పరిగణ నలోనికి తీసుకుని ఉంటే మరింత సున్నితంగా సాగి ఉండేదని మీరు భావిస్తున్నారా?
 ప్రతివారి అభిప్రాయాన్ని పరిగణనలోనికి తీసుకున్నాం. పదేళ్ల పాటు చర్చలు జరి గాయి. సమస్య అంతా హైదరాబాద్ గురించే. దానితోనే విభేదాలు పెరిగాయి. జీహెచ్ ఎంసీని తెలంగాణకు ఇచ్చినప్పటికీ పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఎందుకు ఉంచడం జరిగిందో కూడా పుస్తకంలో వివరించాను.

ప్రత్యేక హోదా అంశం విభజన బిల్లులో ఎందుకు చోటు చేసుకోలేదు?

 2000 సంవత్సరంలో ఉత్తరాఖండ్‌ను చట్టబద్ధంగా విభజించారు. అదే విధంగా తెలంగాణను కూడా విభజించడం జరిగింది. 2002లో ఆ రాష్ట్రానికి నాటి వాజ్‌పేయి ప్రభుత్వం ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించింది. అప్పుడు కేంద్రమంత్రి మండలిలో తెలుగుదేశం భాగస్వామి కూడా. ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా మేం సరిగ్గా అదే బాటలో వెళ్లాం. ఈ అంశం కూడా నా పుస్తకంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోదీ, వెంకయ్యనాయుడు దగా చేశారు.
 

మరిన్ని వార్తలు