చరిత్రను తిరగరాస్తున్న మహిళ

21 Apr, 2016 01:05 IST|Sakshi
చరిత్రను తిరగరాస్తున్న మహిళ

కొత్త కోణం
సంప్రదాయాలను కాలానుగుణంగా మార్చుకోవడం ద్వారానే ఏ సమాజమైనా ముందుకు సాగగలదనేది చరిత్ర చెప్పిన సత్యం. గతంలో ఇలా చాలా సంప్రదాయాలను మనం మార్చుకున్నాం. మహిళలు, అంటరానివారు, శూద్రులు విద్యకు అర్హులు కారని ఒకప్పుడు అన్నారు. ఈ ఆధునిక యుగంలో వర్ణాశ్రమ ధర్మానికి కాలం చెల్లింది. అయినా కుల సమాజం, మహిళల పట్ల వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రాజ్యాంగం ఇలాంటి వివక్షల ప్రతిఘటనకు సామాన్యుల చేతి ఆయుధంగా మారింది.
 
స్త్రీపురుష అసమానతల దుస్సంప్రదాయాలకు చెంపపెట్టులాంటి విలక్షణ తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. తలొంచాల్సింది రాజ్యాంగానికేగాని దేవుడికి కాదని స్ఫురింపజేసే తీర్పది. వందల యేళ్ళ సనాతన సంప్రదాయాల పేరిట స్త్రీల ఆలయ ప్రవేశాన్ని నిషేధిస్తున్న పురుషాధిపత్య భావజాలాన్ని ధిక్కరించారు సమానత్వాన్ని కోరుతున్న ఆధునిక మహిళలు. పోలీసు వలయాలు, బారికేడ్లు, పురుషపుంగవుల భౌతిక దాడులు ఏవీ ఆ మహిళా శక్తి ముందు నిలవలేకపోయాయి.

ఈ పోరాటాన్ని నడిపిన మహిళా సేన పేరు భూమాత బ్రిగేడ్. దాని నాయకురాలు తృప్తి దేశాయ్, మహారాష్ట్ర, అహ్మద్‌నగర్ జిల్లాలోని శనిసింగనాపూర్ దేవాలయంలోకి గత నాలుగు వందల ఏళ్లుగా మహిళలకు ప్రవేశం లేదు. గత ఏడాది నవంబర్ 29న ఒక మహిళ శని దేవాలయ మూలవిరాట్ దగ్గరికి వెళ్ళాలని చేసిన ప్రయత్నాన్ని పూజారులు అడ్డుకున్నారు. అది తెలుసుకున్న భూమాత బ్రిగేడ్ ఆ దుస్సంప్రదాయాన్ని బద్దలుకొడుతూ డిసెంబర్ 20న ఆలయ ప్రవేశానికి ప్రయత్నించగా ఆలయ భద్రతా సిబ్బంది వారిని అడ్డగించారు. మళ్లీ వస్తాం, ఆలయప్రవేశం చేస్తామన్న భూమాత బ్రిగేడ్‌వారు... అన్నట్టే జనవరి 26న తిరిగి వచ్చారు. ఆలయ వర్గాలతో ఘర్షణ జరిగింది. ఆ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. స్త్రీల ఆలయ ప్రవేశాన్ని అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధం, అది స్త్రీల హక్కుల ఉల్లంఘన అంటూ వారు మహారాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు.
 
సనాతనవాదానికి చెంపపెట్టు

ఈనెల మొదటి వారంలో హైకోర్టు వీరికి అనుకూలంగా తీర్పునిచ్చింది. దేవాలయ ప్రవేశానికి మహిళలు, పురుషుల మధ్య వివక్ష చూపకూడదని అది తేల్చి చెప్పడం సనాతనవాదులకు చెంపపెట్టయింది. కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి మహిళలను అనుమతించాలని దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు స్పందిస్తూ సంప్రదాయం కన్నా రాజ్యాంగానికి, చట్టానికి విలువ ఇవ్వాలనీ,  పౌరులంతా చట్టం ముందు సమానులేననీ, ఏవో సాకులు చూపి ప్రాథమిక హక్కులను హరించకూడదనీ స్పష్టం చేసింది. మహారాష్ట్ర హైకోర్టు, సుప్రీం కోర్టు విడివిడిగా ఇచ్చిన ఆదేశాలు మన రాజ్యాంగ స్ఫూర్తికి అద్దం పడుతున్నాయి.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 ప్రకారం బహిరంగ ప్రదేశాలు, ఇతర ప్రజోపయోగ ఉమ్మడి స్థలాల ప్రవేశం, వినియోగంలో ఎటువంటి వివక్ష చూపరాదు. అలాంటి ప్రదేశాల్లో పిల్లలు, మహిళలు, ఎస్సీ, ఎస్టీల ప్రవేశానికి ఏవైనా ఆటంకాలు ఉంటే, వాటిని తొలగించడానికి ప్రభుత్వాలు చట్టాలు కూడా చేయవచ్చునని అదే ఆర్టికల్ స్పష్టంగా తెలిపింది. అయితే మన దేశంలో రాజ్యాంగం అమలయ్యే పరిస్థితులు వేరు. మన కులాల సమాజం మనుషులను ఒక్కటిగా గాక, గుంపులుగా విడగొట్టింది. వివిధ కులాల మధ్య సమాన సంబంధాలు లేవు. ఉన్నత, అధమ భేదాలు శాస్త్ర సమ్మతమని శాస్త్రాలు, స్మృతులు ప్రచారం చేస్తూ వచ్చాయి. ఫలితంగా మన సమాజం అనైక్యత, అసమానత, అజ్ఞానం వంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది.

బ్రిటిష్ పాలన, విదేశీ చదువులు, ఇతర సామాజిక ఉద్యమాలు ఈ పరిస్థితులలో మార్పును తేవడానికి ప్రయత్నించాయి. కానీ అవేవీ సరైన ఫలితాలను ఇవ్వలేదు. సామాజిక ఉద్యమాలు, స్వాతంత్య్రోద్యమం ప్రజల్లో నూతన చైతన్యాన్ని కలిగించాయి. ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేడ్కర్ నాయకత్వంలో సాగిన కుల వ్యతిరేక ఉద్యమం దేశ రాజకీయాలను బలంగా ప్రభావితం చేసింది. దానికి అనుగుణంగానే గత సంప్రదాయాలను పూర్తిగా పక్కన పెట్టి, ప్రజాస్వామ్య పునాదులపై  ఆధునిక రాజ్యాంగ రూపకల్పన సాగింది. కాలంచెల్లిన గత సంప్రదాయాలను తిరస్కరించి, సమానత్వ పునాదులపై సరికొత్తగా రూపుదిద్దుకున్న ప్రణాళికే మన  రాజ్యాంగం.

కాలానుగుణంగా మారితేనే పురోగతి
అందుకే అంబేడ్కర్ ప్రజలందరూ సమైక్యంగా ఆమోదించుకున్న రాజ్యాంగంగా భారత రాజ్యాంగాన్ని అభివర్ణించారు. రాజ్యాంగం పీఠికలోనే, భారత ప్రజలమైన మేము ఈ రాజ్యాంగాన్ని రూపొందించుకున్నామని ప్రకటించారు. ప్రాతినిధ్య విధానం ద్వారా భారత రాజ్యాంగ సభ నిర్మాణమైనందున దీనికి ప్రజలందరి ఆమోదం ఉన్నదనే విషయాన్ని బాబాసాహెబ్ అంబేడ్కర్ సగర్వంగా ప్రకటించారు. అందువల్ల భారత రాజ్యాంగం, సంప్రదాయం కన్నా ఉన్నతమైనదని ప్రకటించడం ద్వారా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు ఉన్న రాజ్యాంగ నిబద్ధత మరో మారు స్పష్టం అయ్యింది.

ఇదే సందర్భంలో మరో విషయాన్ని కూడా మనం మననం చేసుకోవాల్సి ఉంది. అదేమిటంటే భారత రాజ్యాంగ నిర్మాతలు న్యాయస్థానాల బాధ్యతలను కూడా చాలా స్పష్టంగా నిర్ధారించారు. రాజ్యాంగం అమలు సక్రమంగా జరుగుతున్నదా లేదా? లేకపోతే దానిని సక్రమంగా అమలు చేయడానికి కావాల్సిన మార్గదర్శకాలను సుప్రీంకోర్టు, హైకోర్టులు అందించాల్సి ఉంటుందని, అమలు పర్యవేక్షణా బాధ్యతలు కోర్టులపై ఉంటాయనే విషయాన్ని రాజ్యాంగ నిపుణులు రాజ్యాంగ సభలోనే తేల్చి చెప్పారు.

సంప్రదాయాలను కాలానుగుణంగా మార్చుకోవడం ద్వారానే ఏ  సమాజమైనా ముందుకు సాగగలదనేది చరిత్ర చెప్పిన సత్యం. అంతేకానీ, శనీశ్వర దేవాలయంలోకి మహిళలు వెళితే అత్యాచారాలు జరుగుతాయని, షిరిడీ సాయిబాబాను మొక్కడం వల్లనే మహారాష్ట్రను కరువు పీడిస్తోందని చెప్పే పీఠాధిపతుల మాటలను ఏ సమాజమూ అంగీకరించజాలదు. గతంలో అమలులో ఉన్న సంప్రదాయాలను చాలా వాటినే మనం మార్చుకున్నాం.  సముద్రం మీద ప్రయాణం చేస్తే కుల భ్రష్టులవుతారన్నారని సముద్రాలు దాటడం మానలేదు. మహిళలు, అంటరానివారు, శూద్రులు విద్యకు అర్హులు కారని ఒకప్పుడు అన్నారు. వర్ణాశ్రమ ధర్మం ప్రకారమే వృత్తులు చేయాలని శాసించారు. ఈ ఆధునిక యుగంలో వర్ణాశ్రమ ధర్మానికి కాలం చెల్లింది. అయినా కుల సమాజం, మహిళల పట్ల వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రాజ్యాంగం ఇలాంటి వివక్షల ప్రతిఘటనకు సామాన్యుల ఆయుధంగా మారింది. ‘భూమాత బ్రిగేడ్’ కు ఈ వివక్షను ఎదుర్కొనే నైతిక ధైర్యాన్ని కలిగించినది రాజ్యాంగమే.

భూమాత బ్రిగేడ్ పోరాటాన్ని హిందూయేతర శక్తుల కుట్రగా భావించడానికి వీల్లేదు. దాని నేత తృప్తి దేశాయ్ నూటికి నూరుపాళ్లు తాను హిందువునని ప్రకటించుకున్నారు. అంతేకాదు, పుణేలోని ఆమె ఇల్లు సైతం హిందూ ధర్మానికి అనుగుణంగానే ఉంది. ఆమె బాబా రాందేవ్, అన్నా హజారే నడిపిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో కార్యకర్తగా పనిచేశారు. ఒక సగటు భారత మహిళ సనాతన సంప్రదాయాలను సవాలు చేసింది, సాంప్రదాయక స్త్రీ వివక్షని ధిక్కరించింది. పరిస్థితులకు అనుగుణంగా హిందూ సంప్రదాయాలను  మార్చుకోవాల్సిన ఆవశ్యకతను ఇది గుర్తు చేస్తోంది.

మహిళా హక్కులకు ఆదిలోనే హంసపాదు
నిజానికి అంబేడ్కర్, రాజ్యాంగ రచనా సమయంలోనే మహిళలకు కుటుంబ వ్యవహారాల్లో, ఆస్తి పంపకాల్లో సమాన భాగస్వామ్యం ఉండాలనే లక్ష్యంతో హిందూ కోడ్ బిల్లును ప్రవేశపెట్టారు. తద్వారా అప్పటి వరకు వివిధ కులాలు, తెగలు అనుసరిస్తున్న ఆచారాల స్థానంలో ఒక ఉమ్మడి విధానాన్ని క్రోడీకరించాలని అంబేడ్కర్ ఆశించారు. మొదట, జవహర్‌లాల్ నెహ్రూ, ఆయన మంత్రిమండలి యావత్తూ దీనికి ఆమోదం తెలిపినప్పటికీ, సభలో దీనిని వ్యతిరేకించడంతో... మహిళల సమానత్వ హక్కుల కోసం అంబేడ్కర్ చేసిన చరిత్రాత్మక ప్రయత్నం విఫలమైంది.

ఒక్క దుర్గాభాయ్ దేశ్‌ముఖ్ తప్ప రాజ్యాంగ సభలోని మహిళా సభ్యులు సైతం దీనికి మద్దతుగా నిలవకపోవడం ఆయనను బాధ పెట్టింది. ఆయన ప్రతిపాదన ప్రకారం భార్యకు, కూతురికి ఆస్తిలో సమాన హక్కులుండాలి. భర్త హింసలు పెడుతుంటే, నిత్యం వేధిస్తుంటే విడాకులు తీసుకునే స్వేచ్ఛ భార్యకుండాలి. ఏ కులం నుంచైనా పిల్లలను దత్తత తీసుకునే అవకాశం, కులాంతర వివాహాలు చేసుకునే హక్కు ఉండాలి. విడాకుల సమయంలో పిల్లలు ఉన్నట్లయితే వారి పోషణకు భరణం వంటి తదితర అంశాలను సైతం ఆయన ప్రతిపాదించారు. 1952 ఎన్నికల్లో హిందువుల ఓట్లు రావేమోనని భయపడిన నెహ్రూ...  అంబేడ్కర్ రూపొందించిన ఆ బిల్లును సభలో ఆమోదించే సాహసం చేయలేదు. దీంతో 1951లోనే అంబేడ్కర్, నెహ్రూ మంత్రివర్గం నుంచి రాజీనామా చేశారు.
 
ఆ తర్వాత అదే హిందూ కోడ్ బిల్లులోని అంశాలను విడివిడి చట్టాలుగా ఆమోదించారు. అందులో హిందూ వివాహచట్టం, హిందూ వారసత్వ చట్టం, హిందూ పిల్లల సంరక్షణ చట్టం, హిందూ దత్తత చట్టం లాంటివి ముఖ్యమైనవి. ఆనాడు అంబేడ్కర్ నాటిన విత్తనాలే ఆ తర్వాత మహిళా ఉద్యమాలుగా, తదనంతరం అనేక రక్షణ చట్టాలుగా మనకు ఫలాలనిచ్చాయి.  అయితే ఆర్థిక సామాజిక అంతరాలతో పాటు స్త్రీపురుష అంతరాలను ఛేదించేందుకు నాడు అంబేడ్కర్ సూచించిన మార్గం హిందూ కోడ్ బిల్లు. దానిని అందుకోలేకపోయినా, అంబేడ్కర్ ఆశించిన స్త్రీల రాజకీయ హక్కును... చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లకు సైతం ఆమోద ముద్ర వేయకపోవడానికి కారణం  కొనసాగుతున్న అసమానతలు, చట్టసభల్లోని పురుషస్వామ్యమేననేది స్పష్టమే. పురుషాధిపత్య భావజాలానికి స్వస్తిపలికే భూమాత బ్రిగేడ్ ఉద్యమాల వంటి పోరాటాలు ఉప్పెనలై శాసనసభలు, చట్టసభలు, దేవాలయాలను చుట్టుముట్టాల్సిందే.

వ్యాసకర్త :మల్లెపల్లి లక్ష్మయ్య   
సామాజిక విశ్లేషకులు  మొబైల్: 97055 66213

మరిన్ని వార్తలు