ప్రవాస చరిత్రలో సువర్ణాధ్యాయం 'సిలికానాంధ్ర'

7 Oct, 2016 21:44 IST|Sakshi


కాలిఫోర్నియా: భారతీయ సాహితీ సాంస్కృతిక సంప్రదాయ స్ఫూర్తిని కలిగించటానికి ఆవిర్భవించిన 'యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర' ప్రవాస చరిత్రలో ఒక సువర్ణాధ్యాయానికి నాంది పలికింది. భారతీయ కళలు, కర్ణాటక సంగీతం, కూచిపూడితో పాటు మరెన్నో అంశాలపై పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అందించడానికి ఏర్పాటైన ఈ వర్సిటీ కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ నగరంలో 5.5 మిలియన్ డాలర్ లు వెచ్చించి సొంతంగా  భవనాన్ని సమకూర్చుకుంది. ప్రఖ్యాత హృద్రోగ నిపుణులు డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి 10 లక్షల డాలర్ల విరాళం అందజేశారు. ఆయన గౌరవార్ధం విశ్వవిద్యాలయ భవనానికి 'డా. లకిరెడ్డి హనిమిరెడ్డి భవనం' అని నామకరణం చేసారు.


ఎంతో వైభవంగా జరిగిన ఈ భవన ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన లకిరెడ్డి కుటుంబ సభ్యులు.. సిలికానాంధ్ర అభివృద్దికి భవిష్యత్తులోనూ తమ సహకారం అందిస్తామన్నారు. తాను సిలికానాంధ్రను పదిహేనేళ్ల నుంచి చూస్తున్నానని, చెప్పింది చేసి చూపించే సత్తా వారికుందని డా. హనిమిరెడ్డి అన్నారు. సిలికానాంధ్ర వారంతా ఒకే కుటుంబంలా పనిచేస్తుంటారని, అందుకే తమ కుటుంబం ఒక మిలియన్ డాలర్ల విరాళం అందించామని తెలిపారు. కార్యక్రమంలో ప్రఖ్యాత వయోలిన్ విద్వాంసులు శ్రీ అన్నవరపు రామస్వామి, చిత్రవీణ రవికిరణ్, డా.విక్రం లకిరెడ్డి , జయ ప్రకాశ్  రెడ్డి, మాధురి కిషోర్, స్మితా మాధవ్ వంటి కళాకారులు, సిలికానాంధ్ర కుటుంబ సభ్యులు, దాతలు హాజరై సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు.

భారతీయ సంస్కృతికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన్ని మేళవించి పీజీ, డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సులను అందించబోతున్నామని, జనవరి 2017 నుండి తరగతులు ప్రారంభమౌతాయని సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ తెలిపారు. నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాలను తలపించే విధంగా ఈ వర్సిటీని తీర్చిదిద్దుతామన్నారు. చీఫ్ అకాడెమిక్ ఆఫీసర్ రాజు చమర్తి మాట్లాడుతూ.. పదేళ్ల కిందట 150 మంది విద్యార్ధులతో ప్రారంభమైన మనబడి ద్వారా ఇంతవరకు 25,000 పైగా విద్యార్ధులకు తెలుగు నేర్పించామని, ఈ విద్యా సంవత్సరంలో  7500 మందికి పైగా విద్యార్ధులు ఇప్పటికే నమోదు చేసుకున్నారని  చెప్పారు.

ఈ భవనం కొనుగోలు చేయటానికి సహాయం చేసిన విశ్వ విద్యాలయ వ్యవస్థాపక దాతలను యూనివర్సిటీ ముఖ్య  ఆర్ధిక వ్యవహారాల అధికారి (సీఎఫ్ఓ) దీనబాబు కొండుభట్ల సభికులకు పరిచయం చేసి సత్కరించారు. ఒక లాభాపేక్షరహిత (ఎన్పీఓ) కు బ్యాంకు ద్వారా లోన్ లభించడానికి, డాక్టర్ హనిమిరెడ్డి వంటి వారి నుంచి భారీ సహాయం లభించడానికి కార్యకర్తల అంకితభావం, జవాబుదారి తనంతో పాటు  సిలికానాంధ్ర ఆర్ధిక ప్రణాళికలు పారదర్శకంగా ఉండడం ముఖ్య కారణమన్నారు. రాబోయే అయిదేళ్లలో 100 మిలియన్ డాలర్లను విరాళాలు ద్వారా సేకరించి అత్యాధునిక విశ్వ విద్యాలయ ప్రాంగణాన్ని నిర్మించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.విశ్వవిద్యాలయానికి సహకరించ దలచిన దాతలు + 1 408 205 5527 కి ఫోన్ చేయవలసిందిగా అభ్యర్ధించారు.   

ఈ కార్యక్రమంలో వైస్ చైర్మెన్ దిలీప్ కొండిపర్తి, అజయ్ గంటి ,రవి కుచిభోట్ల ,సంజీవ్ తనుగుల, శాంతి కూచిభొట్ల, శ్రీరాం కోట్ని, ప్రభా మాలెంపాటి, సాయి కందుల, రవి చివుకుల, ఫణీ మాధవ్ కస్తూరి, వంశి నాదెళ్ల , శాంతి అయ్యగారి , గోపిరెడ్డి శరత్ వేట , భాస్కర్ రాయవరం, డాంజి తోటపల్లి, యం.జె. తాటిపామల, తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు