నజీబ్‌ జంగ్‌ (లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌) రాయని డైరీ

24 Dec, 2016 23:47 IST|Sakshi
నజీబ్‌ జంగ్‌ (లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌) రాయని డైరీ

మాధవ్‌ శింగరాజు

మోదీజీని నేనెప్పుడూ అలా చూడలేదు. మోదీజీని అలా చూస్తున్నప్పుడు నేనెలా ఉన్నానో చూసుకునే అవకాశం కూడా నాకు లేదు. నేనున్నది ‘రాజ్‌ నివాస్‌’లో కాదు. ప్రధాని నివాసంలో! ఏ సమయంలోనైనా మోదీజీ ఒక్కరే అక్కడ స్వేచ్ఛగా అద్దం చూసుకోగలరు. కానీ ఆయనకు అద్దం చూసుకునే అవసరం ఉంటుందని నేను అనుకోను. తన ముఖం ఎప్పుడు ఎలా ఉండాలో మోదీజీకి క్లారిటీ ఉంటుంది. అద్దంలో చూసుకుని క్లారిటీ తెచ్చుకోవలసిన ముఖం కాదు మోదీజీది. అద్దానికే క్లారిటీ ఇవ్వగల ముఖం.

‘‘చెప్పండి నజీబ్‌ జీ. నేను హిందువు, మీరు ముస్లిం. అదేనా మీ ప్రాబ్లం?’’ అని అడిగారు మోదీజీ తన కళ్లలోని ఆర్ద్రత స్థాయిని ఏమాత్రం తగ్గనివ్వకుండా.
‘‘మోదీజీ.. అలా మాట్లాడకండి. నా మనసు చివుక్కుమంటుంది. మీరు హిందువులకు హిందువు, ముస్లింలకు ముస్లిం’’ అన్నాను.
‘‘మరేంటి చెప్పండి నజీబ్  జీ. నేను ఎన్‌.డి.ఎ., మీరు యు.పి.ఎ. అదేనా మీ ప్రాబ్లం?’’ అని అడిగారు మోదీజీ అదే స్థాయి ఆర్ద్రతను కంటిన్యూ చేస్తూ!
‘‘అయ్యో మోదీజీ.. మీరలా అనకండి. నేను యు.పి.ఎ.మనిషినని మీరు అనుకుని ఉంటే.. ప్రధానిగా మీ ప్రమాణ స్వీకారం రోజే, లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌గా నా పదవీభ్రష్టత కూడా జరిగి ఉండేదని నాకు తెలుసు’’ అన్నాను.
‘‘ఇంకేంటి నజీబ్‌ జీ.. మీ ప్రాబ్లం! ఎందుకిలా చేశారు? పాత నోట్లేమైనా మీ దగ్గర మిగిలిపోయాయా.. ‘యా అల్లా.. డిసెంబర్‌ 31 దగ్గరపడుతోంది ఎలా..’ అని మీరు దిగులు చెందడానికి? చెప్పండి నజీబ్‌ జీ! మన కుర్రాళ్లు ఉన్నారు. క్యాష్‌ చేసి పెడతారు’’ అన్నారు మోదీజీ.
‘‘అయ్యో! అలాంటిదేమీ లేదు మోదీజీ. రిజర్వు బ్యాంకు గవర్నరే డబ్బుల్లేక ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టుకుని తిరుగుతుంటే, ఈ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ ఎంత మోదీజీ’’ అన్నాను. ‘‘అయినా నాకు అంత డబ్బు అవసరం లేదు మోదీజీ. ఢిల్లీ గవర్నరుకు ఖర్చేముంటుంది చెప్పండి’’ అన్నాను.
‘‘మాణింగ్‌ బ్రేక్‌ఫాస్ట్‌కైనా డబ్బులు కావాలి కదా నజీబ్‌ జీ’’ అన్నారు మోదీజీ!
నవ్వాను.

‘‘నేనెంత తింటాను మోదీజీ.. ఒక పరోటా, లైట్‌గా ఆలూ కర్రీ’’ అన్నాను.
మోదీజీ నావైపు పరిశీలనగా చూశారు. ‘‘మరి.. పూరీ, సబ్జి?’’ అని అడిగారు! ఆ వెంటనే, ‘‘కేజ్రీవాల్‌కు ఇష్టమైన బ్రేక్‌ఫాస్ట్‌ అదే కదా నజీబ్‌ జీ’’ అని అన్నారు!!
నాకు అర్థమైంది! మోదీజీలోని ఆ ఆర్ద్రత.. సడన్‌గా నేను రిజైన్‌ చేసి వచ్చేసినందుకు కాదన్నమాట!
‘‘కానీ మోదీజీ.. కేజ్రీవాల్‌ తన బ్రేక్‌ఫాస్ట్‌ తనే తెచ్చుకుని నాతో కలసి బ్రేక్‌ఫాస్ట్‌ చేసినట్లు చెప్పుకుంటున్నారు’’ అన్నాను.  ఆయన వినలేదు. ఆయన ఆర్ద్రతలోనూ మార్పు లేదు!

మరిన్ని వార్తలు