మళ్లీ వార్తల్లో మాల్యా!

19 Apr, 2017 00:42 IST|Sakshi
మళ్లీ వార్తల్లో మాల్యా!

భారీ మొత్తంలో బ్యాంకుల్ని ముంచి నిరుడు గుట్టు చప్పుడు కాకుండా లండన్‌కు ఉడాయించిన వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా చాన్నాళ్ల తర్వాత మంగళవారం మళ్లీ కాసేపు మీడియాలో మార్మోగాడు. ఆయన అరెస్టయ్యాడంటూ సామాజిక మాధ్యమాల్లో, చానెళ్లలో వార్తలు వెలువడటం... అంతలోనే బెయిల్‌పై బయటి కొచ్చినట్టు వెల్లడికావడం ఆ సంచలనానికి కారణం. కోట్లాదిమంది ఖాతాదార్లు పొదుపు చేసుకున్న సొమ్ముతో తాము వ్యాపారం చేస్తున్నామన్న స్పృహను కోల్పోయిన బ్యాంకులు ఆయన అడిగినప్పుడల్లా, అడిగినంతా ఇచ్చాయి. చాలా ఆలస్యంగా... చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ఆయన బకాయిలు వడ్డీతో కలిపి రూ. 9,081 కోట్లకు చేరుకున్నాక మేల్కొని మాల్యా కాళ్లా వేళ్లా పడ్డాయి.

అంతక్రితం మాల్యా సంస్థలు సంక్షోభంలో పడినా, జీతాలివ్వడంలేదని ఉద్యో గులు గగ్గోలు పెడుతున్నా బ్యాంకులు పట్టనట్టు ప్రవర్తించాయి. కింగ్‌ఫిషర్‌ నష్టాల్లో కూరుకు పోతున్నదని, ఆయనకు చెందిన ఇతర సంస్థలు కూడా ఆ దారిలోనే ఉన్నాయని, మాల్యా దగ్గర సెక్యూరిటీగా చూపేందుకు కొత్తగా ఆస్తులు మిగల్లేదని తెలిసినా కేవలం వ్యక్తిగత హామీతో ఆయనకు అప్పులిచ్చిన సంద ర్భాలున్నాయి. తమకు బకాయి పడ్డ రూ. 900 కోట్ల రూపాయల విషయంలో ఆయనపై కేసు పెట్టిన తొలి బ్యాంకు ఐడీబీఐ. మిగిలిన బ్యాంకులు ఆ పని చేయడానికి అనేక నెలల వ్యవధి తీసుకున్నాయి. రైతులు, సామాన్యులు బకా యిపడితే వాటి వసూలు కోసం ఇళ్ల తలుపులు ఎత్తుకుపోవడం, తాళిబొట్లు తీసుకెళ్లడం మొదలుకొని అడ్డమైన పనులూ చేసే బ్యాంకులు మాల్యా ముందు మోకరిల్లాయి. ఆయనకు రాజకీయ పలుకుబడి లేకపోతే ఇదంతా సాధ్యమ య్యేదేనా?
 
నిజానికి బ్యాంకులకు ఈ మాదిరి టోపీ వేసిన వారిలో మాల్యా మొదటి వాడూ కాదు. బహుశా చివరివాడూ కాకపోవచ్చు. గత పదిహేనేళ్లలో బ్యాంకులకు ఉద్దేశ పూర్వకంగా బకాయిల్ని ఎగ్గొడుతున్న సంస్థల సంఖ్య పెరుగుతూ పోతు న్నదని ఆమధ్య ఒక సర్వే తెలిపింది. రిజర్వ్‌బ్యాంక్‌ గవర్నర్‌గా పనిచేసినప్పుడు రఘురాంరాజన్‌ ఇలాంటి బకాయిదార్ల నుంచి రాబట్టాల్సిన సొమ్ము దాదాపు 13 లక్షల కోట్ల రూపాయలని ప్రకటించారు. సుప్రీంకోర్టు ముందు దాఖలు చేసిన అఫిడవిట్‌లో రాని బాకీలు రూ. 6,30,000 కోట్లని అదే బ్యాంకు అంతక్రితం తెలిపింది. ఇలాంటివారందరినీ ఉద్దేశపూర్వక ఎగవేతదారులుగా పరిగణించి వారి పేర్లను ప్రకటించడంతో సహా వివిధ రకాల చర్యలు ప్రారంభిస్తే ఫలితం ఉంటుం దని సిబ్బంది సంఘాలు ఎప్పటినుంచో చెబుతూ వచ్చాయి. తామే రూ. 40,528 కోట్ల మేర ఎగ్గొట్టిన 50 సంస్థల పేర్లను వెల్లడించాయి.

అయినా కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్‌ బ్యాంకు సిగ్గుపడి తాము సైతం వివరాలు బట్టబయలు చేయడానికి ముందుకు రాలేకపోయాయి. ప్రభుత్వాలనుంచి, రాజకీయ నాయకుల నుంచి వచ్చే ఒత్తిళ్ల కారణంగా బ్యాంకులు చడీచప్పుడూ లేకుండా అలాంటివారి రుణాలు మాఫీ చేస్తున్నాయి. యూపీఏ హయాంలో 2013–15 మధ్య వివిధ బ్యాంకులు రూ. 1.14 లక్షల కోట్లను మొండి బాకీలుగా ఖర్చు రాసుకున్నాయని ఒక ఆంగ్ల దినపత్రిక వెలువరించిన కథనాన్ని నిరుడు పరిగణనలోకి తీసుకున్న సుప్రీం కోర్టు... రూ. 500 కోట్ల రూపాయలకు మించి ఎగ్గొట్టిన కంపెనీల జాబితా తమ ముందుంచాలని రిజర్వ్‌బ్యాంకును ఆదేశించింది. నిజానికి ఇలా ఎగవేతదార్లను రక్షిస్తున్నవి ప్రభుత్వ రంగ బ్యాంకులు కనుక సరిపోయింది. అవి ప్రైవేటు బ్యాంకు లైతే ఎప్పుడో దివాలా తీసేవి. దేశంలో పెను సంక్షోభం తలెత్తేది.

విజయ్‌ మాల్యా విషయంలో ఇప్పుడు జరిగిన పరిణామం వల్ల పెద్దగా ఒరిగే దేమీ లేదన్నది న్యాయ నిపుణుల భావన. మనకు బ్రిటన్‌తో నేరస్తుల మార్పిడి ఒప్పందం ఉండొచ్చుగానీ అందుకు సంబంధించిన ప్రక్రియ ఎంతో సుదీర్ఘమైనది. అందులో ఎన్నో సంక్లిష్టతలు, చిక్కుముడులు ఉంటాయి. వాటన్నిటినీ జాగ్రత్తగా పరిశీలిస్తే మాల్యా ఈ దేశానికి రావడం ఇప్పట్లో సాధ్యమేనా అన్న అనుమానాలు తలెత్తుతాయి. ప్రతి దశలోనూ తీసుకునే నిర్ణయాన్ని సవాలు చేయడానికి ఆయ నకు అనేక అవకాశాలుంటాయి. నిరుడు మార్చిలో విజయ్‌ మాల్యా పరారయ్యాక ఆ మరుసటి నెలలో కేంద్ర ప్రభుత్వం ఆయన్ను అప్పగించాలంటూ బ్రిటన్‌ ప్రభు త్వాన్ని లాంఛనంగా కోరింది. కేవలం అరెస్టు చేసి బెయిల్‌ ఇవ్వడానికి ఇన్నాళ్ల  కాలం పట్టింది.

అక్కడున్న నిబంధనల ప్రకారం తగిన వీసా పత్రాలున్నవారిని, వారి పాస్‌పోర్టులు రద్దయినా వెనక్కు పంపడం సులభంకాదు. పైగా బ్యాంకులకు మాల్యా ఎగ్గొట్టిన సొమ్ము ఆయన వ్యక్తిగతం హోదాలో తీసుకున్నది కాదు. కంపెనీ అధిపతులైనా సంస్థ తాలూకు అప్పులకు నేరుగా బాధ్యులుగా మారరు. మాల్యా వ్యక్తిగత హామీతో కొన్ని రుణాలు తీసుకున్న మాట వాస్తవమైనా వాటిని చూపి మాల్యాను అప్పగించమనడం కుదరదు. ఆయన నేరస్తుల అప్పగింత ఒప్పందం పరిధిలోకొచ్చే అపరాధం చేశాడని మన విదేశాంగ శాఖ తరఫున వినిపించిన వాదనలకు సంతృప్తిచెంది బ్రిటన్‌ కోర్టు ప్రస్తుత అరెస్టు వారెంట్‌ జారీ చేసి, తన ముందు హాజరుపరిచాక బెయిల్‌ మంజూరు చేసింది.

విచారణ సమయంలో ఆయన లేవనెత్తే విధానపరమైన అనేక అభ్యంతరాలు గడిచి అంతా సవ్యంగా పూర్తయితే, ఆ తర్వాత మానవ హక్కుల ఉల్లంఘన అంశం తెరపైకి వస్తుంది. కింది కోర్టు అప్పగించాల్సిందేనని ఆదేశాలిచ్చినా హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో అప్పీల్‌ చేసుకోవచ్చు. ఈ అవరోధాలు దాటుకుని మాల్యాను రప్పిం చడానికి చాలా సమయం పడుతుంది. అయినా ఇదంతా చేయక తప్పదు. అయితే దీన్నుంచి గుణ పాఠం తీసుకోవడం తేలిక. మాల్యా మాదిరే బ్యాంకులకు కోట్లాది రూపాయలు బకాయిపడి, పెద్ద మనుషుల్లా చలామణి అవుతున్నవారు చాలా మంది ఉన్నారు. వారి సంగతి తేల్చాలి. వారికి నిర్దిష్టమైన గడువు ఇచ్చి ఆ తర్వాత సివిల్, క్రిమినల్‌ చర్యలకు ఉపక్రమించాలి. వారు దేశం విడిచిపోకుండా చూడటం అన్నిటికన్నా ముఖ్యం. అప్పుడు మాత్రమే బ్యాంకుల నుంచి మాయమైన సొమ్ము భద్రంగా వెనక్కు వస్తుంది.

మరిన్ని వార్తలు