ఆత్మ విశ్వాసంతో ఆరో అడుగు

12 Mar, 2016 00:19 IST|Sakshi
ఆత్మ విశ్వాసంతో ఆరో అడుగు

సందర్భం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి ఐదేళ్లు గడిచి, ఆరో సంవత్సరంలోకి ప్రవేశించింది. ఈ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొని ఉన్న పరిస్థితులు ప్రత్యేకమైనవి. కేవలం 5 లక్షల ఓట్ల తేడాతోనే వైఎస్సార్‌సీపీ అసెంబ్లీలో ప్రతిపక్షంగా ప్రవేశించింది. పదేళ్లు ముఖ్యమంత్రిగా, పదేళ్లు ప్రతిపక్ష నేతగా పదవులు చేపట్టిన చంద్రబాబు నేడు రాజకీయంగా, నైతికంగా పతనావస్థలో కనిపించడం విశేషం. ఆయనకు ప్రతిపక్షం అంటే అసహనం. వైఎస్సార్‌సీపీ జెండాతో నెగ్గిన నంద్యాల, అరకు ఎంపీలను ప్రమాణ స్వీకారానికి ముందే తెలుగుదేశంలో చేర్చుకున్నారు. కర్నూలు, కడప, ప్రకాశం జిల్లాలలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను అక్రమ పద్ధతిలో, పోలీసుల సహకారంతో పార్టీలో చేర్చుకోవడం వంటి చర్యలకు సైతం చంద్రబాబు పాల్పడ్డారు. టీడీపీ పాలన మీద పెద్ద ఎత్తున ప్రజావ్యతిరేకత చోటుచేసుకుంది. దీని నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఆయన ఈ వికృత విధానాలను ఆశ్రయిస్తున్నారు. కాకినాడలో జరిగిన యువభేరి, కాపు గర్జన విజయవంతం కావ డంతో సహనం కోల్పోయి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను ప్రలో భాలకు గురిచేసి తెలుగుదేశంలో చేర్చుకున్నారు.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో చావు దెబ్బ తిన్న తరువాత చంద్రబాబు వైఖరి మరింత పతనమైంది. ప్రతిపక్షం లేకుండా చేయడమే ధ్యేయంగా, ఈ రెండేళ్ల అక్రమ సంపాదనతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి, పార్టీలో చేర్చుకున్నారు. ఈ తీరుతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని నైతికంగా దెబ్బ తీయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పోరాట  సంప్రదాయానికి కేంద్రమైన వైఎస్‌ఆర్ కుటుంబం నుంచి వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి రాజధాని నిర్మాణం పేరుతో చంద్రబాబు కనుసన్నలలో జరిగిన భూదందా, భూ దోపిడీలను కనీవినీ ఎరుగని రీతిలో ఎండగట్టడం జరిగింది. రాజధాని మాటున జరుగుతున్న అక్రమాలూ, అవినీతిపై సీబీఐ విచారణకు ప్రతిపక్ష నేత అసెంబ్లీలో డిమాండ్ చేశారు. అధికార పార్టీ అక్రమాలను, అవినీతిని ప్రశ్నిస్తే రాజధానిని వ్యతిరేకిస్తున్నారనే అసత్య ప్రచారానికి ఒడిగడుతున్నారు. రాజధాని చుట్టూ అభివృద్ధి, కేంద్రీకరణ అంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు చంద్రబాబు బాటలు వేశారు.

రాజధాని తాగునీటి అవసరాలకీ పరిశ్రమల కోసం పట్టిసీమ ప్రాజెక్టు చేపట్టి, రాయలసీమ కరువు తీర్చడానికంటూ అబద్ధాలు చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టును అటకెక్కించారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీ కోసం, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం, విశాఖపట్నం రైల్వేజోన్ కోసం, విభజన చట్టంలో పేర్కొన్నట్టు రాష్ట్ర బడ్జెట్ లోటు భర్తీకి ఇచ్చిన హామీల అమలుకు చంద్రబాబు కృషి చేయడం లేదు. గుంటూరు జిల్లాలో రాజధానిని ఏర్పాటు చేయాలనుకున్నప్పుడే, మిగిలిన జిల్లాల కోసం అనేక పథకాలను ప్రకటించారు. వాటిని ఆచరణలో పెట్టే ప్రయత్నం కూడా లేదు. అంటే అభివృద్ధినంతా రాజధాని చుట్టూనే కేంద్రీకరిస్తున్నారు. రాయలసీమ సేద్యపు నీటి ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. తన అనుచరులు వేల కోట్ల రూపాయలకు పడగలెత్తే విధంగా విధానాలు చేపడుతున్నారు.

ప్రజాస్వామిక విలువలకు తిలోదకాలిచ్చిన అధికార పక్షం కారణంగా ప్రతిపక్షం, జగన్‌మోహన్‌రెడ్డి అనేక ఇక్కట్లు ఎదు ర్కొంటున్నారు. అపనిందలను, అపవాదులను, అవినీతి ఆరో పణలను, కుట్రలను, కేసులను ఎదుర్కొంటూ కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎదుగుతోంది. గడిచిన రెండేళ్లలో జగన్ రైతు సమస్యల మీద, ప్రాజెక్టుల ఆవశ్యకత మీద, ప్రత్యేక హోదా సాధన కోసం అనేక సభలు, సమావేశాలు జరిపారు. రైతుల ఆత్మహత్యలకు వ్యతిరేకంగా భరోసా యాత్ర చేపట్టి విసృ్తతంగా  పర్యటించారు. అసెంబ్లీలో కానీ, బయట కానీ ప్రజాసమస్యలపై నిరంతరం జగన్ గళం విప్పుతూనే ఉన్నారు. వైఎస్సార్‌సీపీని రెండేళ్లలోనే సమరశీల పార్టీగా, ప్రతిపక్ష పార్టీగానే కాకుండా ప్రజాపక్షం వహించే స్థాయిని కల్పించారు.  నేడు రాష్ట్రంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రబల రాజకీయశక్తులు. ప్రజల ఆశాజ్యోతులు.

నిరుద్యోగ యువతకు భరోసా, రైతులకు ఒక చేయూత, మహిళలకు ఒక విశ్వాసం. అందుకే అధికార పక్షం కుట్రలను,  సవాళ్లను అధిగమించి వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోగలుగుతున్నది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరంభించిన పోరాట పంథాను వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ఆదర్శంగా తీసుకోవాలి. తెలుగుదేశం విసురుతున్న సవాళ్లను దీటుగా ఎదు ర్కొనడానికి సమాయత్తం కావాలి. రాష్ట్రంలో రాజకీయ పరిణా మాలు ఒక కీలక దశకు చేరుకుంటున్నాయి. ఈ పరిస్థితులను జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధిగమించడానికి ప్రజలు అండదండలు చేకూర్చాలి. ప్రజలకు వైఎస్ జగన్ ఒక అండ. ప్రజలే జగన్‌కు అండా దండ.
http://img.sakshi.net/images/cms/2015-10/41444968138_Unknown.jpg
వ్యాసకర్త ‘కదలిక’ సంపాదకులు ఇమామ్

మొబైల్ :9989904389
 

మరిన్ని వార్తలు