వాట్సాప్‌ మెసేజ్‌తో ఇరు వర్గాల ఘర్షణ

23 Feb, 2018 16:55 IST|Sakshi
స్థానికులతో మాట్లాడుతున్న ఎస్సై సురేష్‌

శంషాబాద్‌రూరల్‌(రాజేంద్రనగర్‌) : వాట్సాప్‌ మెసేజ్‌లో చిన్న తప్పు కారణంగా ఇద్దరు యువకుల మధ్య చెలరేగిన వివాదం తండాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. మండలంలోని మదన్‌పల్లి పాతతండాలో బుధవారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. తండాకు చెందిన బంజారా యూత్‌ సభ్యులు స్థానికంగా ఉన్న ఆలయం వద్ద బుధవారం రాత్రి సమావేశమయ్యారు. సంఘంలోని సభ్యుడు మున్నా ఈ సమావేశానికి రాకపోవడంతో మరో సభ్యుడు వినోద్‌ అతనికి ఫోన్‌లో వాట్సాప్‌ ద్వారా సందేశం పంపాడు. ఈ సందేశంలో తప్పులు ఉండడంతో అక్కడకు చేరుకున్న మున్నా.. వినోద్‌ను అడిగాడు. దీంతో ఇద్దరి మధ్య చిన్న వివాదం రేగింది. ఈ సమయంలో అక్కడే ఉన్న స్నేహితులు వీరిద్దరికీ సర్దిచెప్పే ప్రయత్నంలో వివాదం ముదిరింది. గొడవ పెద్దది కావడంతో తండావాసులు అక్కడకు రాగా.. రెండు వర్గాలుగా విడిపోయి ఘర్షణకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని సర్దిచెప్పారు. గురువారం ఉదయం మరోసారి రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. దీంతో కొంత మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఎస్సై సురేష్, స్థానిక సర్పంచ్‌ లాలీచందర్‌ తండాకు వెళ్లి ఇరు వర్గాలతో మాట్లాడారు. ఘర్షణకు దారి తీసిన వివరాలు సేకరించి, ఇరువర్గాలను శాంతింపజేశారు. ఇరువురి ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు