వేతన సంబురం 

10 Feb, 2018 18:42 IST|Sakshi

అమల్లోకి వచ్చిన వేతన పెంపు

ఆనందం వ్యక్తం చేసిన హోంగార్డులు

మరింత ఆత్మవిశ్వాసంతో పనిచేస్తామని స్పష్టీకరణ

పరిగి : హోంగార్డుల్లో హర్షాతిరేకాలు.. వేతనం పెంచుతూ ప్రభుత్వం గత డిసెంబర్‌లో తీసుకున్న నిర్ణయం అమల్లోకి వచ్చింది. పెంచిన ప్రకారం నెలకు రూ. 20 వేల వేతనం గురువారం వారి ఖాతాల్లో జమ అయ్యాయి. ఈ ఆనందభరితమైన క్షణాలు వారు తోటి సిబ్బంది, పోలీసు అధికారులతో పంచుకున్నారు. మొదటి సారి రూ. 20 వేల వేతనం డ్రా చేసుకున్న వారు  స్వీట్లు తీసుకువచ్చి అందరికీ పంచారు. ప్రభుత్వం పెంచుతున్నట్లు ప్రకటించిన రోజు కంటే తమ ఖాతాల్లో జజ అయిన క్షణాల్లో తమ ఆనందం రెట్టింపుయ్యిందని వారు తెలిపారు. పరిగి ఎస్‌ఐలు కృష్ణ, ఓబుల్‌రెడ్డి వారికి స్వీట్లు తినిపించారు.

తమ పనికి తగిన గౌరవం లభించినట్లయ్యిందని  సంతోషం వ్యక్తం చేశారు. ఇక ముందు మరింత ఆత్మ విశ్వాసంతో పనిచేస్తామని తెలిపారు. క్రమబద్ధీకరిస్తే బాగుండేదని  మరికొందరు హోంగార్డులు అభిప్రాయం వ్యక్తం చేశారు.  గడిచిన సంవత్సర కాలంలో రెండు సార్లు వేతనాలు పెంచటంతో పాటు హోంగార్డులకు ఆరోగ్యపరమైన, గృహాలు నిర్మించి ఇచ్చే విషయంలో ప్రభుత్వం వరాల జల్లు  కురిపించిన విషయం తెలిసిందే.  నెలకు రూ. 9 వేలుగా ఉన్న హోంగార్డుల వేతనాలు గత మార్చిలో రూ. 12 వేలకు పెంచగా ప్రస్తుతం రూ. 20 వేలకు పెంచింది.  

ఎంతో మంచి నిర్ణయం
ఇప్పటి వరకు హోంగార్డులుగా అనేక సేవలు అందిస్తూ వచ్చాం. చాలిచాలని వేతనాలతో ఎన్నో  ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇప్పుడు సీఎం కేసీఆర్‌ హోంగార్డులకు వేతనాలు పెంచటంతో పాటు తగిన గుర్తింపు ఇచ్చారు. సంక్షేమంపై  తీసుకున్న నిర్ణయంతో హోంగార్డుల కుటుంబాలకు ఎంతో మేలు జరగనుంది.    

 – బిచ్చయ్య, హోంగార్డు, పరిగి.

సమస్యలు తీరుతాయి
సీఎం కేసీఆర్‌ తమకు వేతనాలు పెంచడంతో పాటు డబుల్‌ బెడ్రూమ్‌ ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పటంతో చాలా సంతోషం. తమకు చాలా వరకు సమస్యలు తీరుతాయి.  ఇదే సమయంలో కానిస్టేబుల్‌ నియామకాల్లో రిజర్వేషన్లు పెంచటం కూడా మంచి నిర్ణయమే. మరింత ఉత్సాహంతో పనిచేస్తాం.    

 – యాదలక్ష్మి, హోంగార్డు, పరిగి  

మరిన్ని వార్తలు