ఉలిక్కిపడిన ఏయూ విద్యార్థులు

8 Feb, 2018 09:28 IST|Sakshi
మెయిన్‌గేట్‌ వద్ద ధర్నా చేస్తున్న విద్యార్థులు , సాంబారులో దర్శనమిచ్చిన బల్లి

సాంబారులో దర్శనమిచ్చిన బల్లి

వర్సిటీ మెయిన్‌ గేట్‌ వద్ద ధర్నా

ఏయూక్యాంపస్‌(విశాఖ తూర్పు): ఆంధ్రవిశ్వవిద్యాలయం సైన్స్‌ కళాశాల మెస్‌–1లో సాంబరులో బల్లి పడడంతో కలకలం రేగింది. బుధవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో భోజనానికి సిద్ధమైన విద్యార్థులు సాంబారు బకెట్‌లో బల్లిని చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అప్పటికే కొద్దిమంది తమ భోజనం ముగించారు. దీంతో వారంతా తమకు ఏమవుతుందోనని ఆందోళన చెందారు. మిగతా విద్యార్థులు భోజనం చేయకుండానే బయటకు వచ్చేశారు. హాస్టల్‌ మెస్‌ నుంచి బల్లి దర్శనమిచ్చిన సాంబారు బకెట్‌ను పట్టుకుని ర్యాలీగా ఏయూ మెయిన్‌గేట్‌ వద్దకు చేరుకున్నారు. తమ అవస్థలను ఏకరువు పెట్టారు. గేటు మూసివేసి ధర్నాకు దిగారు.

తరచూ ఇదే తంతు: ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ హాస్టల్‌లో పనిచేసే సిబ్బందికి నిర్లక్ష వైఖరి ఎక్కువైందని ఆరోపించారు. వండిన ఆహార పదార్థాలపై ఎటువంటి మూతలు పెట్టడడం లేదన్నారు. దీని కారణంగానే ప్రస్తుతం సాంబారులో బల్లి పడి ఉంటుందని చెప్పారు. ఇటువంటి సంఘటనలు కారణంగా విద్యార్థులు అస్వస్తతకు గురైతే ఎవరి బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. తమను ప్రశ్నించేవారు లేరనే ధీమాతో హాస్టల్‌ సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

నాణ్యత దేవుడెరుగు: హాస్టల్‌లో ఆహార పదార్థాల నాణ్యత నానాటికీ తీసికట్టుగా మారిపోతోందని విద్యార్థులు వాపోయారు. ఆహారం రుచిగా ఉండడం లేదని అడిగితే ఛీదరించుకుంటున్నారన్నారు. వర్సిటీ అధికారులు సైతం తమ సమస్యలను వినడం లేదన్నారు. సాంబారుకు, రసానికి తేడా ఉండడం లేదన్నారు. అధికారులు తమ గోడు వినాలని, తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఏయూ మెయిన్‌గేట్‌ మూసివేసి ఆందోళనకు దిగారు. వర్సిటీ ఉన్నతాధికారులు వచ్చి తమ సమస్యను పరిష్కరించాలని నినదించారు. హాస్టల్‌ మెస్‌లను ప్రక్షాళన చేయాలని, నాణ్యత ప్రమాణాలు పాటించాలని కోరారు. విద్యార్థులకు అండగా ఎస్‌ఎఫ్‌ఐ, వైఎస్‌ఆర్‌ఎస్‌యూ విద్యార్థి సంఘాల నాయకులు అక్కడికి చేరుకున్నారు. సంఘీభావం తెలిపి బాసటగా నిలిచారు.

ప్రిన్సిపాల్‌ హామీతో శాంతించిన విద్యార్థులు
సైన్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య టి.వినోదరావు, వార్డెన్‌ రమేష్‌బాబు విద్యార్థుల వద్దకు వచ్చి వారి సమస్యను విన్నారు. సాయంత్రం మెస్‌లో సమావేశం ఏర్పాటు చేస్తామని, అవసరమైన చర్యలు తీసుకుంటా మని హామీ ఇవ్వడంతో విద్యార్థులు శాంతించారు. ఆందోళన విరమించి తరగతులకు వెళ్లారు.

>
మరిన్ని వార్తలు