విందుకు వేళాయె.!

15 Jan, 2018 09:00 IST|Sakshi

4 లక్షల కిలోల చికెన్‌ సిద్ధం

సరిపడా మద్యం సిద్ధం చేసిన వ్యాపారులు

పెదవాల్తేరు(విశాఖతూర్పు): సంక్రాంతి సీజన్‌ వచ్చిందంటే చాలు చికెన్, మటన్‌కు ఉండే డిమాండ్‌ అంతా ఇంతా కాదు. ముఖ్యం గా కనుమ రోజున మాంసాహారానికి ప్రాధాన్యమిస్తారు. ప్రస్తుతం కిలో మటన్‌ ధర రూ.600గా ఉంది. ఇక చికెన్‌ స్కిన్‌తో కిలో రూ.160గానూ, స్కిన్‌ లెస్‌ అయితే రూ.170 గా ఉంది. జీవీఎంసీ పరిధిలో దాదాపుగా 1300 వరకు చికెన్‌ దుకాణాలు ఉన్నాయి. ఈ దుకాణాల ద్వారా రోజుకు దాదాపుగా 10 వేల కిలోల వరకు చికెన్‌ అమ్మకాలు జరుగుతున్నాయి. ఫలితంగా చికెన్‌ వ్యాపారులకు రోజుకు రూ.18 లక్షల వరకు ఆదాయం వస్తోంది. జీవీఎంసీ పరిధిలో నమోదైన 750 వరకు మటన్‌ దుకాణాలు ఉన్నాయి. ఈ దుకాణాల రోజూ 5 వేల కిలోల వరకు మటన్‌ విక్రయిస్తున్నారు. మరో 250 దుకాణాల ద్వారా వెయ్యి కిలోల మటన్‌ విక్రయమవుతోంది. ఇక విశాఖ నగరం, జిల్లాలోను కలిపితే రోజూ లక్ష నుంచి 1.25 లక్షల కిలోల చికెన్‌ విక్రయాలు జరుగుతున్నాయి. కాగా, కనుమ సీజన్‌ కావడంతో ఈ వినియోగం నాలుగు లక్షల కిలోలకు పెరుగుతుందని అంచనా. మంగళవారం జరిగే కనుమ పండగను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని కోళ్ల ఫారాల్లో సుమారుగా మూడు లక్షల ఫారం కోళ్లను సిద్ధం చేశారని సమాచారం. దీంతో నాలుగు లక్షల కిలోల చికెన్‌ అందుబాటులో ఉంటుంది. 

మందుబాదుడు
పండగ సీజన్‌లో మద్యం ఏరులై పారుతుంది. మద్యం సిండికేట్‌ యాజమాన్యం భోగి రోజునే క్వార్టర్‌కు రూ.15 వంతున వడ్డించిందని మందుబాబులు ఆందోళన వ్యక్తం చేశారు. భోగికే బాదుడు ఇలా ఉంటే, సంక్రాంతి, కనుమ రోజు ఇంకెలా ఉంటుందోనని మందుబాబులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఎంఆర్‌పీ కట్టుదిట్టంగా అమలు చేస్తామన్న ఎక్సైజ్‌శాఖ అధికారులు పట్టించుకోనందునే మద్యం వ్యాపారుల ఆటలు సాగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మద్యం అమ్మకాల ద్వారా నగరంలో రోజూ రూ.1.50 కోట్లు, జిల్లాలో రూ.2 కోట్ల ఆదాయం వస్తోంది. పెద్ద పండగ దృష్ట్యా బార్లు, మద్యం దుకాణాల నిర్వాహకులు రెండు రోజులకు సరిపడా స్టాకును ముందే సిద్ధం చేసుకున్నారు. నగరంలో 154 మద్యం దుకాణాలు, 114 బార్లు ఉన్నాయి. సాధారణ రోజుల్లో దాదాపుగా 3 వేల మద్యం కేస్‌లు, 1500 కేస్‌ల బీర్లు విక్రయిస్తున్నారు. డిసెంబర్‌ 30, 31 తేదీల్లో నగరవ్యాప్తంగా రూ.10 కోట్ల మేరకు మద్యం విక్రయించారు. ఇక జిల్లాలో రూ.15 కోట్ల మేరకు ఆదాయం వచ్చింది. సంక్రాంతి సీజన్‌లో నగరంలో రూ.15 కోట్లు, జిల్లాలో రూ.20 కోట్ల మేరకు మద్యం వ్యాపారం జరుగుతుందని అంచనా.

మరిన్ని వార్తలు