మీ పని మీరు చేసుకోండి

19 Jul, 2018 09:09 IST|Sakshi
ఆనందపురం తహసీల్దార్‌ ఈశ్వరరావు, మంత్రి గంటా

ఆనందపురం తహసీల్దార్‌కు కలెక్టర్, జేసీ భరోసా

కలకలం రేపిన ‘ఏం వేషాలేస్తున్నావా’ కథనం

సహచరుడికి రెవెన్యూ సంఘాల నైతిక మద్దతు

అదే సమయంలో గంటాను పల్లెత్తు మాట అనని నేతలు

ఆయన అలా అనరు.. మరి ఎందుకు అన్నారోనని కలెక్టర్‌ ముక్తాయింపు

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: మంత్రి గంటా శ్రీనివాసరావు ఆనందపురం తహసీల్దార్‌ ఈశ్వరరావును ఇంటికి పిలిపించుకుని తిట్టిన వ్యవహారంలో జిల్లా ఉన్నతాధికారులు, రెవెన్యూ సంఘాల నేతలు తహసీల్దార్‌కు బాసటగా నిలిచారు. అదే సందర్భంలో అసలేం జరిగిందో తెలుసుకుని అప్పుడే మంత్రిపై స్పందిస్తామని వ్యాఖ్యానించారు.  తనకు మాటమాత్రం చెప్పకుండా మండలంలోని 18 ఎకరాల భూములను టిట్కోకు  కట్టబెట్టిన విషయమై మంత్రి గంటా తహసీల్దార్‌ను దూషించిన వైనంపై  ‘ఏం వేషాలేస్తున్నావా’ అనే శీర్షికన బుధవారం సాక్షిలో వచ్చిన కథనం రెవెన్యూ వర్గాల్లో మనోస్థైరాన్ని నింపింది.

జిల్లావ్యాప్తంగా అధికారవర్గాలతో పాటు కలెక్టరేట్‌ వర్గాల్లో కలకలం రేపిన ఈ కథనంపై జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్, జాయింట్‌ కలెక్టర్‌ సృజనలు స్పందించారు. తమను బుధవారం ఉదయం కలిసిన తహసీల్దార్‌ ఈశ్వరరావుతో మాట్లాడుతూ ‘మీ పని మీరు చూసుకోండి.. సెలవుపై వెళ్లొద్దు’.. అని భరోసా ఇచ్చారు. ఒకవేళ మీకు ఇబ్బందిగా, ఒత్తిడిగా అనిపిస్తే ఒకటి, రెండు రోజులు క్యాజువల్‌ లీవ్‌ తీసుకోవాలని సూచించారు. అయితే రెవెన్యూ సంఘాల నేతలు మాత్రం లీవుపై వెళ్తే వేరే సంకేతాలు వస్తాయి.. అందువల్ల యధావిధిగా ఉద్యోగం చేసుకోనివ్వండి .. అని సూచించడంతో ఈశ్వరరావు బుధవారం మధ్యాహ్నం నుంచి యధావిధిగా ఆనందపురం వెళ్లి ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు.

సహజంగా గంటా అలా అనరు: జిల్లా కలెక్టర్‌
తహసీల్దార్‌కు నైతిక మద్దతు ఇచ్చిన అధికారులు, రెవెన్యూ సంఘాల నేతలు.. అదే సందర్భంలో మంత్రి గంటా శ్రీనివాసరావును మాత్రం పల్లెత్తు మాట అనేందుకు సాహసించలేదు. సహజంగా మంత్రి అలా అనరు.. మరి ఈశ్వరరావును ఏ సందర్భంలో ఎందుకన్నారోనని జిల్లా కలెక్టర్‌ వ్యాఖ్యానించారు. ఇక ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్‌ నాగేశ్వరరెడ్డి కూడా తహసీల్దార్‌కు నైతిక మద్దతు ఇస్తూనే మంత్రి గంటాను వెనకేసుకొచ్చారు.

ఇంతవరకూ ఆయన అధికారులను తిట్టిన దాఖలాల్లేవు.. ఇది ఎందుకు జరిగిందో తెలియదు.. అందుకే బుధవారం అత్యవసర సమావేశం నిర్వహించాం.. ఉద్యోగ సంఘాల నేతలందరూ వచ్చారు. సీరియస్‌గా చర్చించాం... మంత్రి గంటాతో, జిల్లా కలెక్టర్‌తో ముఖాముఖి చర్చలు జరిపాక నిర్ణయం తీసుకుంటామని నాగేశ్వరరెడ్డి బుధవారం సాక్షి ప్రతినిధితో మాట్లాడుతూ చెప్పారు. ఏపీ ఎన్జీవో అసోసియేషన్‌ జిల్లా అ«ధ్యక్షుడు ఈశ్వరరావు ఇదే విషయమై స్పందిస్తూ.. వాస్తవానికి గంటా అలా అనరు.. అలా అంటే ఖండిస్తాం... అని వ్యాఖ్యానించారు.
 

మరిన్ని వార్తలు