ఏం.. వేషాలేస్తున్నావా

18 Jul, 2018 12:06 IST|Sakshi

ఏం పిచ్చి వేషాలేస్తున్నావా..  సెలవు పెట్టి దొబ్బేయ్‌.. యూస్‌ లెస్‌ ఫెలో..  ఇంకా పత్రికల్లో రాయలేని నానా రకాల దుర్భాషలు.. ఇవన్నీ ఎవరో సామాన్యుడు వాడిన పదజాలం కాదు.  గౌరవ మంత్రి గంటా శ్రీనివాసరావు నోటి నుంచి జాలువారిన మాటల ముత్యాలు..!
ఇన్ని తిట్లు.. ఏ పనివాళ్లనో.. అనుచరులనో.. ఏ మాటన్నా పడుండే వాళ్లనో ఉద్దేశించి ప్రయోగించలేదు. మండల ఎగ్జిక్యూటివ్‌ మెజిస్ట్రేట్‌ అయిన ఓ తహసీల్దార్‌పైనే నోరుపారేసుకున్నారు..
ఎందుకింతలా నోరుపారేసుకున్నారు.. ఆయన చేసిన తప్పేంటయ్యా అంటే.. మంత్రిగారికి చెప్పకుండా ఆయనగారి ఇలాకా అయిన భీమిలి నియోజకవర్గంలోని ఆనందపురం మండలంలో 18 ఎకరాల భూములను టిడ్కోకు కేటాయించడమే.. పోనీ ఆ టిడ్కో ఏమీ ప్రైవేటు సంస్థ కాదు.. రాష్ట్ర ప్రభుత్వానికే చెందిన ఆంధ్రప్రదేశ్‌ టౌన్‌షిప్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్టర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌.
సహజంగా గంటాది తొందరపడి నోరు జారే మనస్తత్వం కాదనే అంటుంటారు. మిన్ను విరిగి మీద పడుతున్నా నవ్వుతూ తప్పించుకునే ధోరణినే ఆయన అనుసరిస్తుంటారు.
భూకుంభకోణం మొదలు ఎన్నెన్నో ఆరోపణలు, విపక్ష పార్టీలతో పాటు సొంత పార్టీకి చెందిన నేతలు, సహచర మంత్రులే నేరుగా తననే టార్గెట్‌ చేసి విమర్శలు చేసినా ఇప్పటి వరకు గంటా పెద్దగా చలించలేదనే చెప్పాలి.
కానీ ఇటీవలి కాలంలో ఆయన తీరు మారుతోందనే వాదనలకు మంగళవారం ఆనందపురం తహసీల్దార్‌ ఈశ్వరరావును ఇంటికి పిలిచి అందరి ముందు ఆడిపోసుకున్న ఘటన బలం చేకూర్చింది.
మంత్రి అసహనం మాటేమోగానీ.. తిట్ల దండకంపై స్వయంగా జిల్లా ఉన్నతాధికారులు సీఎంవోకు ఫిర్యాదు చేయడం ఇప్పుడు అధికారవర్గాలు.. ప్రధానంగా రెవెన్యూ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.
– సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం ఆనందపురం తహసీల్దార్‌ కె.వి.ఈశ్వరరావును నగరంలోని తన ఇంటికి పిలిపించుకుని మరీ తిట్టిపోసిన వైనం కలకలం రేపింది.    తన సహజ స్వభావానికి భిన్నంగా ఓ రెవెన్యూ అధికారిని తూలనాడటం ఆ శాఖ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అధికారవర్గాల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం.. ఆనందపురం మండలం తర్లువాడ పంచాయతీ పరిధిలోని తర్లువాడ, నగరప్పాలెం, ప్రకృతివానిపాలెం గ్రామాల్లోని సుమారు వంద ఎకరాల ప్రభుత్వ భూములను సర్కారు ఆదేశాల మేరకు వివిధ సంస్థలకు, పరిశ్రమలకు ఇటీవల కేటాయించారు. నగరప్పాలెం, ప్రకృతివానిపాలెం గ్రామాల పరిధిలో 162, 166, 190, 191 సర్వేననెంబర్లలోని సుమారు 74 ఎకరాలను ఏపీఐఐసీకి అప్పగించారు. అదేవిధంగా తర్లువాడలో 3/1, 3/2, 3/3, 7/1, 7/2 సర్వే నెంబర్లలోని సుమారు 18 ఎకరాలను ఆంధ్రప్రదేశ్‌ టిడ్కోకు అప్పగించారు.

పరిహారం రానివ్వలేదని అనుచరులే ఎగదోశారు
ఆయా భూముల పక్కనే స్థానిక ఎంపీటీసీ, మండల టీడీపీ అధ్యక్షుడు బి.ఆర్‌.బి.నాయుడుతో పాటు మరికొంత మంది టీడీపీ నేతలు ఆక్రమించిన భూములున్నాయి. వాటిపై  ఎటువంటి హక్కులు లేకపోయినా ప్రభుత్వం నుంచి పరిహారం కొట్టేయడానికి పథకం రచించారు. ఆ మేరకు తహసీల్దార్‌ ఈశ్వరరావుపై ఒత్తిడి తెచ్చారు. హక్కులు లేని వారికి పరిహారం ఇవ్వలేమని ఆయన  తేల్చి చెప్పారు. దీంతో సదరు నేతలు తహసీల్దార్‌పై మంత్రి గంటాకు ఫిర్యాదు చేశారు. ఇదే కాకుండా కుసులువాడ పంచాయతీ రేగానిగూడెంలో టీడీపీ కార్యకర్తలకు కేటాయించిన ఎన్టీఆర్‌ గృహాలను కూడా తహసీల్దార్‌ అడ్డుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. వాస్తవానికి సొంత స్థలాల్లో ఎన్టీఆర్‌ గృహాలు నిర్మించుకోవాల్సి ఉండగా.. నిబంధనలకు విరుద్ధంగా కొందరు ప్రభుత్వ భూముల్లో కట్టుకుంటున్నారు. దీనిపై తహసీల్దార్‌ స్పందించి రెవెన్యూ సిబ్బంది చేత కూలదోయించారు. టీడీపీ కార్యకర్తలు దీన్ని తప్పు పడుతూ మంత్రి గంటాకు నూరిపోశారు.


సీఎంవోకు ఫిర్యాదు చేసిన ఉన్నతాధికారులు
తీవ్ర అవమానానికి గురూన తహసీల్దార్‌ అక్కడి నుంచి నేరుగా కలెక్టరేట్‌కు వెళ్లి ఉన్నతాధికారులకు గోడు వెళ్ళబోసుకున్నట్టు తెలిసింది. 30 ఏళ్ల సర్వీసులో తనను ఎవరూ ఇంత దారుణంగా తిట్టలేదని, తహసీల్దార్‌ ఈశ్వరరావు ఉన్నతాధికారుల వద్ద భోరున విలపించారు. వాస్తవానికి తాను పాయకరావుపేట నుంచి ఆనందపురం వచ్చి ఏడాది దాటుతోందని, ఎప్పుడూ మంత్రి తనతో ఇలా మాట్లాడలేదని, ఈ మధ్యకాలంలోనే ఆయన తీరులో మార్పు వచ్చిందని ఈశ్వరరావు ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. వెంటనే స్పందించిన ఉన్నతాధికారులు సీఎం కార్యాలయ ముఖ్య అధికారి సతీష్‌చంద్రకు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేసినట్టు  సమాచారం. మీరు కూడా ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లాలని, ఇలాగైతే అధికారులు ఇక్కడ పనిచేయడం చాలా కష్టమని తెగేసి చెప్పినట్టు తెలుస్తోంది.

తప్పయిపోయిందన్నా తిట్ల దండకం ఆగలేదట!
ఆగ్రహం చెందిన గంటా మంగళవారం ఉదయం తహసీల్దార్‌ను ఇంటికి పిలిపించి.. అందరి ముందే దూషణలకు దిగారు. ‘నాకు తెలియకుండానే అన్నీ చేసేస్తావా..  టీడీపీ కార్యకర్తలు ఇళ్లు కట్టుకుంటే అడ్డుకుంటావా’... అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సర్‌.. మీకు చెప్పకుండా నేను ఏమీ చేయలేదు.. వాళ్లు నిబంధనలకు విరుద్ధంగా ఇళ్లు కడుతుంటే రెవెన్యూ సిబ్బంది కూల్చేశారు.. ఇకపై వాటి జోలికిపోను.. మీరెలా చెబితే అలానే’... అని బతిమాలుకున్నా.. గంటా వినిపించుకోకుండా సీరియస్‌ అయినట్టు తెలిసింది. ఓ దశలో సెలవుపై దొబ్బేయ్‌.. అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు  చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు