గుర్తింపు సమరం

20 May, 2019 12:17 IST|Sakshi

జీవీఎంసీలో గుర్తింపు యూనియన్‌ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఈ ఎన్నికల్లో స్వతంత్ర సంఘంగా బరిలోకి దిగిన వీఎంసీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌పై ఏఐటీయూసీ అనుబంధ సంస్థ గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ విజయం సాధించి గుర్తింపు యూనియన్‌గా అవతరించింది. దీని కాలపరిమితి ఈ నెల 9వ తేదీతో ముగిసింది. దీంతో ఎన్నికలు నిర్వహించాలంటూ వివిధ సంఘాలు కోరుతున్నాయి.
తొలిసారిగా బరిలో వైఎస్సార్‌ టీయూసీ
ఈసారి ఎన్నికల్లో తొలిసారిగా వైఎస్సార్‌ ట్రేడ్‌ యూనియన్‌ బరిలోకి దిగుతోంది. జీవీఎంసీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ వైఎస్సార్‌టీయూసీ అనుబంధ సంస్థగా పోటీలో నిలుస్తోంది. వైఎస్సార్‌టీయూసీతో పాటు జీవీఎంసీ పరిధిలో ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, సీఐటీయూ, హెచ్‌ఎంఎస్‌ ఉన్నాయి. ఏఐటీయూసీతో విబేధాలు రావడంతో ప్రస్తుత గుర్తింపు యూనియన్‌ గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ కూడా ఈసారి ఒంటరిగా పోటీ చేయాలని భావిస్తోంది. 
శాశ్వత ఉద్యోగులకు మాత్రమే
ఓటు హక్కు 
కార్పొరేషన్‌ పరిధిలో సుమారు 11 వేల మంది కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, పర్మినెంట్, ఇతర శాఖల నుంచి వచ్చిన ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే జీవీఎంసీకి సంబంధించిన పర్మినెంట్‌ ఉద్యోగులకు మాత్రమే ఈ ఎన్నికల్లో ఓటు హక్కు ఉంటుంది. జీవీఎంసీలోని శానిటరీ వర్కర్‌ నుంచి అసిస్టెంట్‌ కమిషనర్‌ వరకూ వివిధ కేడర్లలో ఉన్న శాశ్వత ఉద్యోగులు మాత్రమే ఈ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఉంది. 2017లో జరిగిన ఎన్నికల్లో 3,238 మంది ఓటర్లుండగా ఈసారి ఎన్నికలు నెలాఖరులోగా జరిగితే 3,400 మంది ఓటర్లుంటారు. ఒక నెల ఆలస్యమైతే ఓటర్ల సంఖ్య తగ్గనుంది. జూన్‌ నెలలో 120 మందికి పైగా ఉద్యోగులు రిటైర్‌ కానున్నారు.
ఏ కార్పొరేషన్‌లో లేని విధంగా..
రాష్ట్రంలో ఉన్న ఏ మున్సిపాలిటీ, కార్పొరేషన్‌లోనూ గుర్తింపు యూనియన్‌ అంటూ ప్రత్యేకంగా ఉండదు. కేవలం జీవీఎంసీలో మాత్రమే ఈ తరహా ఎన్నికలు జరుగుతున్నాయి. 2002లో తొలిసారిగా ఈ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఐఎన్‌టీయూసీ విజయం సాధించింది. 2004లో టీఎన్‌టీయూసీ, 2007లో ఏఐటీయూసీ, 2010లో స్వతంత్ర యూనియన్‌ వీఎంసీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్, 2012లో ఏఐటీయూసీ, 2014లో వీఎంసీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్, 2017లో ఏఐటీయూసీ గెలుపొందాయి. ఈ ఏడాది వైఎస్సార్‌టీయూసీ విజయం సాధిస్తుందన్న ధీమా యూనియన్‌ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. 
తొమ్మిది బూత్‌లు ఏర్పాటు
మొత్తంగా ఈ నెలాఖరులోగానీ, జూన్‌ మొదటి వారంలో గానీ జరగనున్న ఈ ఎన్నికల కోసం తొమ్మిది బూత్‌లు ఏర్పాటు చేయనున్నారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆరు బూత్‌లు, గాజువాక, మధురవాడ, అనకాపల్లిలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం తొమ్మిది బూత్‌లు ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే ఎన్నికలు నిర్వహించాలని కమిషనర్‌కు వైఎస్సార్‌టీయూసీ అనుబంధ సంస్థ ప్రతినిధులు కమిషనర్‌కు వినతిపత్రం అందించారు. కమిషనర్‌ సైతం కార్మిక శాఖతో మాట్లాడి ఎన్నికలు నిర్వహించేందుకు సమాయత్తమవుతాయని ప్రకటించడంతో ఈ నెలాఖరులోగానీ, జూన్‌ మొదటి వారంలో గానీ గుర్తింపు యూనియన్‌ ఎన్నికలు జరుగుతాయని ఆయా సంఘాలు భావిస్తున్నాయి. 

వైఎస్సార్‌ సీపీ జెండా రెపరెపలు
తొలిసారిగా కార్పొరేషన్‌ యూనియన్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌ ట్రేడ్‌ యూనియన్‌ పోటీ చేస్తోంది. అనుబంధ సంస్థ జీవీఎంసీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఇప్పటికే రెండు సార్లు విజయం సాధించింది. ఈసారి జరగనున్న ఎన్నికల్లో గుర్తింపు యూనియన్‌గా అవతరించి కార్పొరేషన్‌ పై వైఎస్సార్‌సీపీ జెండా రెపరెపలాడిస్తాం. కాలపరిమితి ముగియడంతో ఎన్నికలు నిర్వహించాలని కమిషనర్‌ను కోరగా సుముఖత వ్యక్తం చేశారు. మరోవైపు యూనియన్‌ బలోపేతానికి ఇప్పటికే పావులు కదుపుతున్నాం.
– వీవీ వామనరావు, వైఎస్సార్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 

మరిన్ని వార్తలు