విశాఖను వదలని వరుణుడు!

23 Oct, 2019 19:16 IST|Sakshi
విశాఖపట్నం

సాక్షి, విశాఖపట్నం: నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఉక్కునగరం విశాఖపట్నం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. భారీగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. రెండురోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నగరమంతా చెరువులా మారింది. దాదాపు మూడు నుంచి నాలుగు అడుగుల మేర రహదారులపై నీరు చేరడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. కూర్మన్న పాలెం నుంచి స్టీల్‌ ప్లాంట్‌కు వెళ్లే రోడ్డు పూర్తిగా నీట మునిగింది. కాగా మరో మూడురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 

‘పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకొని నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ తీరాల మీదుగా మంగళవారం ఉదయం ఏర్పడిన అల్పపీడనం తీవ్రంగా మారుతోంది. ఇది  మరింత బలపడి రాగల 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశాలున్నాయి. వాయుగుండంగా మారే క్రమంలో అల్పపీడనం కోస్తాంధ్ర తీరం వైపుగా కదులుతోంది. దీంతో కోస్తా ఆంధ్రలో  అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్ర జిల్లాలలో ఈరోజు ఒకటి రెండుచోట్ల భారీ నుండి అతిభారీవర్షాలు, గురువారం  భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది’అని వాతావరణ శాఖ వెల్లడించింది. 

మరిన్ని వార్తలు