నేలపై.. నీటిలో..

10 Feb, 2018 12:25 IST|Sakshi
భోగాపురం మండలం రెడ్డి కంచేరు తీరంలో ట్రయల్‌ రన్‌కు సిద్ధమైన హోవర్‌క్రాఫ్ట్‌లు

పర్యాటకానికి ఇక ఆకాశమే హద్దు

సిద్ధమవుతున్న హోవర్‌క్రాఫ్ట్‌లు

జోరుగా ట్రయల్‌ రన్‌..

వచ్చే నెలలో అందుబాటులోకి..

దేశంలోనే తొలిసారి..

విశాఖ సిటీ, తగరపువలస (భీమిలి): దేశంలోనే మొట్టమొదటిసారిగా విశాఖ రామకృష్ణ బీచ్‌లో వచ్చే నెల నుంచి హోవర్‌క్రాఫ్ట్‌లు పర్యాటకులను అలరించనున్నాయి. ఇప్పటికే హోవర్‌ డాక్‌ సంస్థ ప్రతినిధులు బీచ్‌లో హోవర్‌క్రాఫ్ట్‌లు తిరగడానికి అనువైన ప్రదేశాన్ని గుర్తించి ప్రభుత్వపరమైన అనుమతులు పొంది ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. రష్యా నుంచి రెండు హోవర్‌క్రాఫ్ట్‌లను దిగుమతి చేసుకున్న నిర్వాహకులు భోగాపురం మండలం రెడ్డి కంచేరు తీరంలో ఉంచి రష్యాకు చెందిన నిపుణులతోనే శుక్రవారం ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. నేలపైన, నీటిలోనూ తిరగగలిగే హోవర్‌క్రాఫ్ట్‌లు ఇప్పటి వరకు యూరప్‌ దేశాలు, అమెరికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాలలోనే అందుబాటులో ఉన్నాయి.

పర్యాటక నగరంగా దినదినాభివృద్ధి చెందుతున్న విశాఖకు ఏడాదికేడాది పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంది. ముఖ్యంగా వేసవిలో విశాఖకు ఉత్తరాది రాష్ట్రాల నుంచి విశేషంగా పర్యాటకులు వస్తుంటారు. విశాఖలో ఈ ప్రాజెక్ట్‌ విజయవంతం అయితే వీటిని అయిదు వరకు పెంచనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. అయిదుగురు ప్రయాణించగల హోవర్‌క్రాఫ్ట్‌ రూ.1.10 కోట్లు, ఏడుగురు ప్రయాణించగల వాహనాన్ని రూ.1.70 కోట్లకు నిర్వాహకులు కొనుగోలు చేశారు. ఇప్పటికే విశాఖ తీరంలో సబ్‌మెరైన్‌ మ్యూజియం, టీయూ–142 యుద్ధ విమాన మ్యూజియం, కైలాసగిరి నుంచి అప్పుఘర్‌కు రోప్‌ వే వంటివి పర్యాటకులను అలరిస్తుండగా ఇటీవల హెలీ టూరిజమ్‌ పేరుతో ఏర్పాటు చేసిన హెలికాప్టర్‌లో నగర సందర్శన పర్యాటకులను ఆకర్షించలేకపోయింది. నేలపై నుంచి నేరుగా నీటిలోకి దూసుకుపోయే హోవర్‌క్రాఫ్ట్‌లను నేవీలో వినియోగిస్తుంటారు.

విశాఖలో హోవర్‌క్రాఫ్ట్‌ తయారీ పరిశ్రమ..
నగరంలో హోవర్‌క్రాఫ్ట్‌ సేవలు పర్యాటకులను ఆకర్షించగలిగితే ఇక్కడే హోవర్‌క్రాఫ్ట్‌ల విడిభాగాలతో తయారీ పరిశ్రమ ఏర్పాటుకు నిర్వాహకులు ఆలోచిస్తున్నారు. రష్యాలోని క్రిస్టి హోవర్‌క్రాఫ్ట్‌ సంస్థతో ఒప్పందం చేసుకోనున్నారు. ఇవి కేవలం పర్యాటకులను ఆకర్షించడానికే కాకుండా తుఫానులు, వరదల సమయంలో వీటిలో బాధితులను జాగ్రత్తగా ఒడ్డుకు చేరవేయవచ్చు. మామూలు పడవలు ఎక్కువ లోతు గల నీటిలోనే ప్రయాణించగలవు.

హోవర్‌క్రాఫ్ట్‌లు నీటిమట్టంతో సంబంధం లేకుండా నేలమీద కూడా ప్రయాణించగలవు కాబట్టి వీటిని సముద్రాలలోనే కాకుండా సరస్సులపై కూడా వినియోగించవచ్చు. తుఫాను ప్రభావిత ప్రాంతాలలో ఎదురయ్యే విషసర్పాలు, తేళ్లు, మొసళ్ల బారి నుంచి కూడా హోవర్‌క్రాఫ్ట్‌లు రక్షణగా ఉపయోగపడతాయి. పర్యాటకులు సముద్రంపై దీనిలో ప్రయాణించడానికి పది నిముషాలకు రూ.300 నుంచి 500 వరకు వసూలు చేసే అవకాశాలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు