సీఎం వస్తే.. జేబులకు చిల్లే!

27 Jan, 2018 09:52 IST|Sakshi

మంజూరుకాని బిల్లులు

తలలు పట్టుకుంటున్న ఆర్‌అండ్‌బీ అధికారులు

నర్సీపట్నం: ముఖ్యమంత్రి పర్యటనకు వస్తే ఎంతో కొంత అదనపు ప్రయోజనం ఒనగూరుతుందని ఇటు ప్రజలు, పాలకులు ఆశగా ఎదురుచూస్తుంటారు. అదే సీఎం తమ జిల్లాకు వస్తున్నారంటే జిల్లా స్థాయి నుంచి కిందిస్థాయి అధికారుల్లో ఒకటే అలజడి చోటుచేసుకుంటోంది. ఒక పక్క తక్కువ సమయంలో సకాలంలో హడావుడిగా పూర్తిచేయాల్సిన పనులు..మరో పక్క చేపట్టే పనులకు సంబంధించి నిధుల భారం తమపై ఎంత పడుతుందోనని ఆందోళన. ముఖ్యమంత్రి మాత్రం హాయిగా నాలుగు మాటలు చెప్పి టాటా అంటూ చేతులు ఊపి ప్రత్యేక హెలికాప్టర్‌ ఎక్కి వెళ్లిపోతారు. పర్యటనకు అయిన నిధుల భారం ఏళ్ల తరబడి అధికారులను వేధిస్తూనే ఉంటోంది. రోడ్లు, భవనాలశాఖలో ఈ సమస్య ఎక్కువగా ఉంటోంది.

నిధులు కేటాయించని ప్రభుత్వం..
వీటికి ప్రభుత్వం నుంచి ఏమైనా ప్రత్యేక నిధులు మంజూరు చేశారంటే అదీ లేదు. కాంట్రాక్టర్ల చేత పనులు చేయిద్దామంటే ఈ నిధులు ఎప్పటికి మంజూరవుతాయో తెలియని పరిస్థితి. ఇక చేసేదేమీ లేక యుద్ధప్రాతిపదికన పనులు చేయాల్సి రావడంతో జిల్లా స్థాయి నుంచి కిందిస్థాయి అధికారులంతా కలిసి తమ జేబుల నుంచి ఈ మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టి కార్యక్రమాన్ని పూర్తిచేశారు. ఇదేకాకుండా గతంలో సీఎం చంద్రబాబునాయుడు ఎస్‌.రాయవరం పర్యటనకు వచ్చినపుడు ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ తదితర వ్యయానికి సంబంధించిన బిల్లులు ఇంకా మంజూరు కాలేదు.మంత్రి అయ్యన్నపాత్రుడు నిర్వహించేది రోడ్లు, భవనాలశాఖ అయినా ఈ ఖర్చు చేసిన బిల్లుల మంజూరులో ఎందుకు వివక్ష చూపిస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఈ విషయమై డీఈ వేణుగోపాల్‌ను వివరణ కోరగా ఈ అంశంపై మాట్లాడేందుకు నిరాకరించారు.

మంజూరు కాని హెలిప్యాడ్‌ బిల్లులు
జన్మభూమి–మా ఊరు కార్యక్రమంలో భాగంగా సీఎం  చంద్రబాబునాయుడు ఈ నెల 5న నర్సీపట్నం నియోజకవర్గంలోని ధర్మసాగరం గ్రామాన్ని సందర్శించారు. కేవలం రెండు రోజుల ముందే  కార్యక్రమం ఖరారు కావడంతో అధికారుల్లో ఒకటే హడావుడి. ప్రధానంగా జన్మభూమి కార్యక్రమమైనా ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటుతో అన్ని శాఖల అధికారులకు పని భారం పడింది. హెలికాప్టర్‌పై కార్యక్రమానికి రానుండటంతో హెలిప్యాడ్‌తో పాటు సభా వేదిక వద్దకు రహదారిని ప్రత్యేకంగా తీర్చిదిద్దడం అర్‌అండ్‌బీ అధికారులకు తలకు మించిన భారమైంది.  ఒక పక్క హెలిప్యాడ్‌ నిర్మాణం..మరో పక్క రహదారి మరమ్మతు పనులు..ఇవన్నీ కేవలం 48 గంటల్లో పూర్తి కావాల్సి ఉన్నందున ఎక్కువ మంది కూలీలను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. రాత్రి పగలు పనులు చేయాల్సి రావడంతో అదనంగా చెల్లించాల్సి వచ్చింది. ఈ విధంగా సీఎం పర్యటనకు ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ ఒక్కదానికే సుమారు రూ.3 లక్షల వరకు ఖర్చు చేయాల్సి వచ్చింది.

మరిన్ని వార్తలు