భారమైపోయిన అమ్మ!

9 Feb, 2018 10:53 IST|Sakshi
వృద్ధురాలిని ఆశ్రమానికి అప్పగిస్తున్న ఎస్‌ఐ బాబు, నడిరోడ్డుపై అప్పలనరసయ్యమ్మ

వాహనంలో తీసుకువచ్చి

వృద్ధురాలిని నడిరోడ్డుపై

విడిచిపెట్టిన కన్నబిడ్డలు

విశాఖ సిటీ ,పెందుర్తి: తన రక్తమాంసాలతో ఆయువు పోసి..నవమాసాలు మోసి, కనీ.. రెక్కలు ముక్కలు చేసుకుని పెంచిపోషించి పిల్లలను ప్రయోజకులుగా చేసింది ఆ తల్లి. కానీ ఆ కర్కోటకులు తల్లిని రోడ్డుపాలు చేశారు. అమ్మను భారంగా భావించి నడిరోడ్డుపై అర్ధరాత్రి వేళ ఎముకలు కొరికే చలిలో అనాథగా వదిలి వెళ్లిపోయారు. అయితే ఆమెను పెందుర్తి పోలీసులు ఆదరించారు. సపర్యలు చేసి ఓ గూడు కల్పించి మానవత్వం చాటారు. స్థానికులు, పోలీసుల కథన ప్రకారం.. బుధవారం అర్ధరాత్రి పెందుర్తి కూడలి వద్దకు ఓ వాహనం వచ్చింది. అందులో నుంచి ఓ వృద్ధురాలిని బలవంతంగా దించేసిన వ్యక్తులు వాహనం సహా అక్కడి నుంచి పరారయ్యారు. వృద్ధురాలు అరుస్తున్నా గాని పట్టించుకోకుండే ఉడాయించారు.

అదే సమయంలో నైట్‌ బీట్‌ రౌండ్స్‌లో భాగంగా అటుగా వచ్చిన పోలీస్‌ వాహనం డ్రైవర్‌ శంకర్‌ వృద్ధురాలు నడిరోడ్డుపై ఉండడాన్ని గమనించి వాహనంలో ఉన్న క్రైం బ్రాంచ్‌ ఎస్‌ఐ జి.డి.బాబుకు చెప్పాడు. దీంతో వారిద్దరూ వృద్ధురాలి వద్దకు వెళ్లి ఆమెకు సపర్యలు చేశారు. ఆహారం అందించారు. వివరాలు ఆరా తీశారు. అయితే ఆమె చెప్పలేకపోతోంది. దీంతో తమ వాహనంలో స్థానిక లయోలా వృద్ధాశ్రమంలోకి తీసుకువెళ్లి నిర్వాహకుడు డి.ప్రకాశరావుకు అప్పగించారు. తన పేరు తిర్రి అప్పలనర్సయ్యమ్మ అని చెబుతున్న వృద్ధురాలు.. తన కుమారుడి పేరు నేతలరాజు అని చెప్పింది. మరే వివరాలు చెప్పలేకపోతోంది. ఆమె కుటుంబ సభ్యుల వివరాల కోసం ఆరా తీస్తున్నట్లు ఎస్‌ఐ బాబు తెలిపారు.

మరిన్ని వార్తలు