కోడి x వెలగపూఢీ

9 Jan, 2018 12:47 IST|Sakshi

వలస నేత ఇలాకాలో బరులు రెడీ

ఉత్తరాంధ్ర సంప్రదాయానికి భిన్నంగా కోడిపందాల విష సంస్కృతి

కొన్నేళ్లుగా దీన్ని ప్రోత్సహిస్తున్న తూర్పు ఎమ్మెల్యే

హైకోర్టు ఉత్తర్వులనూ    లెక్కచేయని టీడీపీ నేతలు

పందెంరాయుళ్లకు అండగా సకల సౌకర్యాలు

రెండేళ్లుగా జీవీఎంసీ స్థలంలోనే.. అధికారుల ద్వారానే ఏర్పాట్లు

సంప్రదాయాల ముసగులో విషసంస్కృతికి బీజం వేస్తున్న కోడి పందాలకు అడ్డుకట్ట వేయాలని హైకోర్టు ఆదేశాలు.. తమ ఆదేశాలను పాటించకపోతే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరికలు..

అయినా.. ఆ పందాలకు నిలయాలైన ఉభయగోదావరి జిల్లాలతోపాటు.. తాజాగా విశాఖ జిల్లాలోనూ పందెంరాయుళ్లు ‘బరులు’ సిద్ధం చేస్తున్నారు.

కోళ్లకు కత్తులు కట్టి.. వాటిని ఉసిగొల్పి రక్తమోడేలా అవి కొట్టుకుంటుంటే(చచ్చిపోతుంటే).. వాటిపై డబ్బులు సంపాదించే రాక్షస క్రీడకు మొదటి నుంచి ఉత్తరాంధ్ర ప్రజానీకం దూరమే.
ఎక్కడో ఏమో కానీ అటువంటి సంస్కృతి మన జిల్లాలో లేదనేది నిర్వివాదాంశం. కానీ పొట్టచేత పట్టుకుని వలసవచ్చి ఇక్కడి ఆదాయవనరులపై ‘పడి’ నడమంత్రపు సిరితో రెచ్చిపోతున్న కొందరు టీడీపీ నేతలు గత కొన్నేళ్లుగా ఆ విషసంస్కృతికి ఇక్కడా బీజం వేస్తున్నారు.

ఆ క్రమంలోనే విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు కొన్నేళ్లుగా ఇక్కడా కోడిపందాలు నిర్వహిస్తూ వచ్చారు.  ఎప్పుడూ చూసీచూడనట్టు వదిలేసే పోలీసులు ఈసారి మాత్రం యాక్షన్‌లోకి దిగారు.

సోమవారం ముడసర్లోవలో బరులు సిద్ధం చేస్తున్న ఎమ్మెల్యే వెలగపూడి యువసేన అధ్యక్షుడు సందీప్‌ను అరెస్టు చేశారు. ఇదే యాక్షన్‌ను సంక్రాంతి అయ్యే వరకు కొనసాగిస్తారా.. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి ఒగ్గేస్తారా.. చూడాలి..


సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: టీడీపీ వలస నేతల పుణ్యమాని కత్తులు కట్టి ఆడించే కోడిపందాల విష సంస్కృతి ఇక్కడా వేళ్లూనుకుంటోంది. సంక్రాంతి పండుగ రోజుల్లో డిగ్గీ కోడి (కత్తులు కట్టకుండా ఆడించే) పందాలకు గోదావరి జిల్లాలు అనాది నుంచి పెట్టింది పేరు. తర్వాతికాలంలో కోళ్లకు కత్తులు కట్టి రూ.కోట్లలో పందాలు కాయడం, రాత్రిపగలూ తేడా లేకుండా పందాల బరుల వద్దే  శిబిరాల్లో పేకాట, గుండాటలు యధేచ్ఛగా నిర్వహించడం ఆనవాయితీగా మారింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విష సంస్కృతి పెచ్చుమీరిపోయింది. దీంతో గత మూడేళ్లుగా వరుసగా హైకోర్టు జోక్యం చేసుకోవడం.. చివరికి కోర్టు ఉత్తర్వులను కూడా ఖాతరు చేయకుండా పండుగ మూడురోజులు పందాలు నిర్వహించడం రివాజుగా వస్తోంది. గోదావరి జిల్లాల్లో ఎలా ఉన్నా.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో కోడిపందాల సంస్కృతి ఎన్నడూ లేదు. ఎక్కడైనా ఒకటి రెండుచోట్ల పందాలు నడిచినా బరులు గీసి రూ.కోట్లలో పందాలు కాసే పరిస్థితి ఎప్పుడూ లేదు.

అధికారుల నీడలోనే..
కానీ గత కొన్నేళ్లుగా వివాదాస్పద వలసనేతగా ముద్రపడ్డ విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మాత్రం తన ఇలాకాలో విచ్చలవిడిగా కోడిపందాలు నిర్వహిస్తూ వస్తున్నారు. గత రెండేళ్లుగా ఆరిలోవ సమీపంలోని ముడసర్లోవ ప్రాంతంలో (రామకృష్ణా పురం వెనుక) సుమారు పది ఎకరాల జీవీఎంసీ ఖాళీ స్థలంలో భారీగా పందాలు నిర్వహిస్తున్నారు. గత ఏడాది స్వయంగా ఆయనే పందాలను ప్రారంభించారు. పందెంరాయుళ్లు రూ.కోట్లలో పందాలు కాశారు. వాటితో పాటు పేకాట, మద్యం విక్రయాలు విచ్చలవిడిగా జరిగాయి. గత ఏడాది ఎమ్మెల్యే వెలగపూడి ఆదేశాలతో జీవీఎంసీ అధికారులు దగ్గరుండి మరీ బరి కోసం నిర్దేశించిన స్థలాన్ని చదును చేయగా.. నీటిసరఫరా విభాగం అధికారులు ప్రతి రోజు నీళ్లు చల్లారు. పండుగ మూడు రోజులు పందాలకు పోలీసులే కాపలా కాశారు.

 ఈ ఏడాది కూడా మళ్లీ అదే రీతిలో నిర్వహించేందుకు వెలగపూడి అనుచరులు ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఏడాది నిర్వహించిన స్థలాన్నే మళ్లీ చదును చేసి బరిని సిద్ధం చేస్తున్నారు. గత ఏడాది కంటే ఎక్కువ మొత్తంలో పందాలు జరిగేలా సన్నాహాలు చేస్తున్నారు. అయితే వైఎస్సార్‌సీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుమేరకు పోలీసులు వెంటనే స్పందించి సోమవారం బరులు సిద్ధం చేస్తున్న వెలగపూడి యువసేన అధ్యక్షుడు, ఎన్నో వివాదాస్పద కేసుల్లో ఉన్న  కంచర్ల సందీప్‌ సహా 12మందిని అరెస్టు చేశారు. ఇదే రీతిన సంక్రాంతి అయ్యే వరకు ఖాకీలు కోడిపందాలపై పోలీసులు గెలుస్తారా?.. అధికార బలంలో ఒత్తిడి పెంచి పందాలు నిర్వహించడంలో టీడీపీ నేతలు గెలుస్తారా??.. అన్నదే ఇప్పుడు చర్చనీయాంశం.

కోడిపందాలు నిర్వహిస్తే చర్యలు తప్పవు..
దీనిపై తహసీల్దారు బాస్కరరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు నిర్వహించవద్దని హైకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. దాని ప్రకారం ఎక్కడ వీటిని నిర్వహించినా నేరమవుతుందన్నారు. నిర్వహించినవారు ఎలాంటి వారైనా చర్యలు తప్పవని హెచ్చరించారు.

వెలగపూడి యువసేన అధ్యక్షుడు సందీప్‌ అరెస్టు
ఆరిలోవ(విశాఖ తూర్పు): ముడసర్లోవ రిజర్వాయరు వెనుక రామకృష్ణాపురం సమీపంలో జీవీఎంసీ ఖాళీ స్థలంలో కోడి పందాలు నిర్వహించడానికి తూర్పు నియోజక వర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అనుచరులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా కొద్ది రోజులగా ఇక్కడ స్థలాన్ని శుభ్రం చేయిస్తున్నారు. సోమవారం ఇక్కడ తుప్పలు కొడుతూ పందాల బరి కోసం మార్కింగ్‌ వేస్తుండగా ఆరిలోవ పోలీసులు అక్కడకు చేరుకొని 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిని ఆరిలోవ పోలీసులు రూరల్‌ తహసీల్దారు భాస్కరరెడ్డి ముందు హాజరుపరిచారు.

ఈ 12 మందిపైనా తహసీల్దారు బైండోవర్‌ కేసులు నమోదు చేశారు. వారిలో గత రెండేళ్లు ఇక్కడ కోడి పందాలు నిర్వహించిన వెలగపూడి యువసేన అధ్యక్షుడు కంచర్ల సందీప్‌(దీనదయాల్‌పురం), ఎం.రమేష్‌(పీఎం పాలెం), బి.వెంకటరెడ్డి, సీహెచ్‌.చక్రపాణి(పైనాపిల్‌కాలనీ), కొప్పుల అర్జున్‌(శ్రీకృష్ణాపురం), మారిక సన్యాసి(శ్రీకృష్ణాపురం), మారిక మహేష్‌(శ్రీకృష్ణాపురం), కొప్పల కుమార్‌(శ్రీకృష్ణాపురం), యామలపల్లి అప్పలరాజు(శ్రీకృష్ణాపురం),  యామలపల్లి కృష్ణ(శ్రీకృష్ణాపురం), మారిక కుమారరాజు(శ్రీకృష్ణాపురం), మారిక నూకరాజు(శ్రీకృష్ణాపురం) ఉన్నారు. అయితే అక్కడ స్థలం తమ గిరిజనులదేనని, వ్యవసాయం చేయడానికి పనులు చేస్తుంటే ఆరిలోవ పోలీసులు తీసుకొచ్చి బైండోవర్‌ కేసులు పెట్టించారని వీరంతా తహసీల్దారుకు చెప్పడం విశేషం.

మరిన్ని వార్తలు