కేంద్రాస్పత్రికి వస్తే కేజీహెచ్‌కే...

29 Jan, 2018 10:04 IST|Sakshi
కేంద్రాస్పత్రిలో రోగికి డయాలసిస్‌ చేస్తున్న దృశ్యం

కిడ్నీ రోగులకు అందని వైద్యం

అత్యవసర పరిస్థితుల్లో రోగుల అవస్థలు

అమలు కాని ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఆదేశాలు  

గంట్యాడ మండలానికి చెందిన కె.రమణమ్మ నాలుగు రోజులు కిందట కిడ్నీ సంబంధిత వ్యాధితో కేంద్రాస్పత్రిలో చేరింది. చేరిన పది గంటల్లోనే ఆమెను కిడ్నీ సంబంధిత వైద్యులు లేరని అక్కడి వైద్యులు కేజీహెచ్‌కు రిఫర్‌ చేసేశారు. ఇది ఒక్క రమణమ్మ పరిస్థితే కాదు.  కేంద్రాస్పత్రికి వచ్చే రోగులకు నిత్యం ఎదురువుతున్న పరిస్థితి ఇది.

విజయనగరం ఫోర్ట్‌: జిల్లాలో అతి పెద్ద ప్రభుత్వ ఆస్పత్రి కావడంతో జిల్లా నలుమూలలు నుంచి రోగులు కేంద్రాస్పత్రికి వస్తారు. పెద్దాస్పత్రిలోనే వైద్యం అందకపోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. కేంద్రాస్పత్రిలో డయాలసిస్‌ సెంటర్‌ ఉన్నా ఒకసారి డయాలసిస్‌ చేసిన రోగులకు మాత్రమే కేంద్రాస్పత్రిలో చేస్తున్నారు. డయాలసిస్‌ అవసరం రోగికి  నేరుగా డయాలిసిస్‌ చేసే సౌకర్యం( ఎ.వి.ఫిస్టులా) లేదు.  ఈ సౌకర్యం లేకపోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. డయాలసిస్‌ సెంటర్‌ రోగులకు పూర్తి స్థాయిలో ఉపయోగపడడం  లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ఒకసారి కేజీహెచ్‌లోగాని ప్రైవేటు ఆస్పత్రుల్లోగాని డయాలసిస్‌ చేసుకుంటే తప్ప డయాలసిస్‌ చేయని పరిస్థితి.  అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి డయాలసిస్‌ చేయడం లేదు. దీంతో ప్రాణాలు కాపాడుకోవడానికి రోగులు విశాఖపట్నం కేజీహెచ్‌కుగాని కార్పొరేట్‌ ఆస్పత్రికిగాని వెళ్లాల్సిన పరిస్థితి. ప్రైవేటు ఆస్పత్రుల్లో డయాలసిస్‌ చేయించుకోవాలంటే రూ.వేలల్లో  ఖర్చువుతుంది. డబ్బులు లేని నిరుపేదలు వైద్యం చేయించుకోలేక ఇబ్బంది పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా డయాలసిస్‌ చేయాలి. ఎ.వి. ఫిస్టులా సౌకర్యం  లేకపోవడం వల్ల డయాలసిస్‌ జరగడం లేదు.

అమలు కాని ఆదేశాలు
రెండు నెలలు కిందట వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య కేంద్రాస్పత్రిని పరిశీలించారు. ఆ సమయంలో కేంద్రాస్పత్రిలో కిడ్నీ రోగులకు ఎ.వి. ఫిస్టులా సౌకర్యం అందలేదని గుర్తించి  నెల రోజుల్లో  ఎ.వి. ఫిస్టులా సౌకర్యం కేంద్రాస్పత్రిలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. రెండు నెలలవుతున్నా ఇంతవరకు  కేంద్రాస్పత్రిలో కిడ్నీ రోగులకు వైద్యం అందని పరిస్థితి నెలకొంది.

త్వరలో ఏర్పాటు చేస్తాం...
కిడ్నీ రోగులకు నేరుగా డయాలసిస్‌ సౌకర్యం కేంద్రాస్పత్రిలో ప్రస్తుతానికి లేదు. త్వరలో ఏర్పాటు  చేసేందుకు చర్యలు తీసుకుంటాం. –కె. సీతారామరాజు,కేంద్రాస్పత్రి సూపరింటెండెంట్‌

Read latest Vizianagaram News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా