ఇదేం గోల బాబూ!

12 Jan, 2018 10:15 IST|Sakshi

పండగకు దూరమవుతున్న అధికారులు

భోగీ రోజునే సంక్రాంతి సంబరాలంటూ ఆదేశం

ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు

విస్తుపోతున్న అన్ని స్థాయిల అధికారులు

ఇప్పటికే సొంతూళ్లకు వెళ్లేందుకు ఏర్పాట్లు

సర్కారు నిర్ణయంతో ఆ ఏర్పాట్లు కాస్తా రద్దు

మకర సంక్రాంతి. హిందువులకు అతిపెద్ద పండగ. ఏడాదికోమారువచ్చే ఈ ఉత్సవంలో సంప్రదాయ బద్ధంగా చేసుకోవాల్సిన పూజలుంటాయి. ఇందుకోసం ఊళ్లకు వెళ్లాలి. కుటుంబ సభ్యుల తో కలసి ఆనందంగా గడపాలి. ఈ రెండు రోజులైనా... మానసిక ప్రశాంతత పొందాలి. అని భావిస్తారు. కానీ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగులకు ఆ సరదాలు దూరమైపోతున్నాయి. కుటుంబాలతో కలసి వేడుకగా గడపాల్సిన క్షణాలు మాయమైపో తున్నాయి. ఎన్నో రోజులుగా ఇందుకోసం చేసుకున్న ఏర్పాట్లు కాస్తా నీరుగారిపోతున్నాయి. భోగీరోజునే జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించాలంటూ జారీ అయిన ఉత్తర్వులతో వారిలో నిరాశా నిస్పృహలు చోటు చేసుకున్నాయి.

సాక్షిప్రతినిధి, విజయనగరం: ‘నేను మారాను... మీరు నమ్మండి... ఉద్యోగులను గతంలో మాదిరిగా ఇబ్బంది పెట్టను..’ అన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాటలు ఉత్తివేనని తేలిపోయాయి. అధికారంలోకి వచ్చి నప్పటినుంచీ నిత్యం ఏదో ఒక కార్యక్రమం పేరుతో ఉద్యోగులను కుటుంబాలతో గడపనీయకుండా చేస్తున్నారు. రకరకాల కాన్ఫరెన్సులతో కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు.అయినా అవన్నీ విధి నిర్వహణలో భాగమేనని సర్దుకుపోతున్న ఉద్యోగులను సంక్రాంతి పండుగకు కూడా కుటుంబ సభ్యులు, బంధువులతో జరుపుకోకుండా చేస్తుంటే భరించలేకపోతున్నారు. 

పండగపూటా విధులేనా...
నిత్యం విధులతో తలమునకలై ఉండే ఉద్యోగులు సొంతూరులో కుటుంబ సభ్యులు, చిన్న నాటి స్నేహితులు మధ్య సరదగా గడపాలని నిర్ణయించుకున్న సమయంలో పండగ పూట సంక్రాంతి సంబరాలు చేయాలని సీఎం బాంబు పేలుస్తూ గురువారం ఆదేశాలు జారీ చేశారు. వాస్తవానికి ఉద్యోగులు గత కొంతకాలంగా తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈ ఏడాది ఆరంభం నుంచి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఈ నెల 2వ తేదీ నుంచి జన్మభూమి కార్యక్రమం నిర్వహించడంతో ఉద్యోగులంతా గ్రామాలకు పరిమితమయ్యారు. దాదాపు 10రోజుల పాటు ఉదయం పిల్లలు లేవకమునుపే ఇంటినుంచి బయలుదేరి రాత్రి వారు నిద్రపోయిన తర్వా తే ఇంటికి చేరుతున్నారు. ఇలా కొన్ని రోజులు గా వారితో మాట్లాడే సమయం దొరక్క తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. ఏదో ఒకలా జన్మభూమి ముగియడం, శనివారం నుంచి వరుసగా సెలవులు కావడంతో సొంతూరుకు పయనమయ్యేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ట్రె యిన్, బస్సులకు రిజర్వేషన్లు చేసుకున్నారు. ఇతర మార్గాల్లో వెళ్లేవారు అందుకోసం ఏర్పా ట్లు చేసుకున్నారు. ఇంతలో 14వ తేదీన భోగి రోజున జిల్లా అంతటా సంక్రాంతి సంబరాలు నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హతాసులైన ఉద్యోగులు ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కారాలు మిరియాలు నూరుతున్నారు.

సంక్రాంతి సంబరాలు ఎందుకు?
వాస్తవానికి ప్రభుత్వం సంక్రాంతి సంబరాలు చేయాల్సిన అవసరం ఉండదు. సంక్రాంతి ప్రతి తెలుగింటి పండగే. పట్టణం, పల్లె తేడా లేకుండా జరుగుతుంది. ఈ నేపథ్యంలో సొంతూరుకు అందరూ వెళ్లేలా చూస్తే చాలు పండగ ప్రశాంతంగా, సరదగా జరిగిపోతుంది. ప్రభుత్వం పండగ నిర్వహించాలంటూ జిల్లాకు రూ.కోటి నిధులు కేటాయించింది. ఇవి వృథాగా ఖర్చవ్వడం, ఉద్యోగులకు వేదన మిగలడం తప్ప ఏమీ ప్రయోజనం ఉండదు.

అతి దారుణమైన నిర్ణయం
సంక్రాంతి సంబరాలు నిర్వహించాలని ప్రభుత్వం అకస్మాత్తుగా నిర్ణయించడం అతి దారుణమైన నిర్ణయం. ప్రభుత్వ ఉద్యోగులూ ప్రజలే. వారికి కూడా పండగ చేసుకోవాలని ఉంటుంది. విదేశాల్లో ఉన్నవారిని సంక్రాం తికి సొంతూరుకు వెళ్లమని చెబుతున్నారు. అలాంటపుడు ఇతర చోట్ల పని చేసే ఉద్యోగులు సొంతూరు వెళ్లాలని కోరుకుంటా రు. భోగీ రోజున సంబరాలు నిర్వహిస్తే ఎలా వెళతారు. రెండో శనివారం, ఆది వారం అధికారిక సెలవు. అలాంటి రోజున సంక్రాంతి సంబరాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించడం ఉద్యోగుల స్వేచ్ఛను హరించడమే. ఇలాంటి నిర్ణయాలు ప్రభుత్వానికి ఎంతమాత్రం మంచిది కాదు. దీనిపై పునరాలోచన చేయాలి. –పేడాడ జనార్దనరావు, ఏపీజేఏసీ అమరావతి జిల్లా అధ్యక్షులు, ఏపీ రెవెన్యూ సంఘం సహాధ్యక్షుడు

ఉద్యోగులను ఇబ్బంది పెట్టేందుకే...
ఉద్యోగులు నిన్నటివరకు జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ వినతులు అప్‌లోడ్‌ చేయడానికి 13వ తేదీ సాయంత్రం వరకు సరిపోతుంది. పండగ నేపథ్యంలో కుటుంబాలతో గడపడానికి రెండురోజులు మాత్రమే సమయం ఉంది. ప్రభుత్వం సంక్రాంతి సంబరాలు లేవని చెప్పింది. దీంతో సొంతూరుకు వెళ్లేందుకు ఉద్యోగులంతా సిద్ధమయ్యారు. ఇప్పటికిప్పుడు సంక్రాంతి సంబరాలు నిర్వహించడం అన్యాయం. ఇది నిజంగా ఉద్యోగులను ఇబ్బంది పెట్టేందుకే. సమయం లేకుండా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం ఉద్యోగులను ఒత్తిడిలోకి నెట్టడమే. దీనివల్ల ఉద్యోగులు అత్మస్థైర్యం కోల్పోతారు. ప్రభుత్వ కార్యక్రమం కావున ఉద్యోగులు తప్పక చేసినా స్వేచ్ఛగా చేయలేరు. ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించాలి. –బి.హెచ్‌.ఎస్‌.ప్రభూజీ, ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షులు

మరిన్ని వార్తలు