కలెక్టర్‌ కాదు.. ఎమ్మెల్యే చెప్పాలి..

8 Feb, 2018 13:16 IST|Sakshi
కలెక్టర్‌ జారీచేసిన ఆర్డర్‌ కాపీ

జిల్లా అధికారి ఆదేశాలు పటించుకోని మండల అధికారులు

నెలరోజుల కిందట ఆదేశాలు వచ్చినా ఫీల్డ్‌ అసిస్టెంట్‌ను చేర్చుకోని వైనం

విజయనగరం పూల్‌బాగ్‌: విధుల నుంచి తొలగింపునకు గురైన ఒక ఉద్యోగినిని తిరిగి చేర్చుకోవాలని కలెక్టర్‌ నెల రోజుల కిందట ఆదేశాలు జారీ చేసినా కింది స్థాయి ఉద్యోగులు పెడచెవిన పెట్టడంతో ఆ ఉద్యోగిని విధుల్లోకి చేరక ఇబ్బందులు పడుతోంది. జామి మండలం లొట్లపల్లి గ్రామ పంచాయతీకి చెందిన జన్నెల వాణీశ్రీ ఉపాధిహామీ పథకంలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహించేది. అదే మండల ఉపాధి హామీ పథకం ఏపీఓ కామేశ్వరరావు లైంగిక వేధింపులకు గురి చేస్తూ ఆమెను విధులను తొలగించారు.

దీంతో ఆమె తొమ్మిది నెలలు పాటు ఉద్యోగానికి దూరం ఉంది. ఎట్టకేలకు సాక్షిని ఆశ్రయించింది. సాక్షిపత్రికలో వెలువడిన కథనానికి స్పందించిన కలెక్టరు వాణీశ్రీని విధుల్లోకి తీసుకోవాలని జనవరి 3న ఆదేశాలు జారీచేశారు. అయితే అప్పటినుంచి నేటివరకూ విజయనగరం డ్వామా కార్యాలయం, జామి ఎంపీడీఓ కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉంది. అయినా ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకున్న పాపానపోలేదు. దీంతో ఆమెకు దిక్కు తోచని పరిస్థితి నెలకొంది. ఏం చేయాలో? ఎవరిని కలవాలో? అర్థంకాని పరిస్థితి. కలెక్టర్‌ ఆదేశాలే పట్టించుకోని అధికారులు ఎవరి మాట పట్టించుకుంటారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది.

ఏం జరిగిందో మాకు తెలియదు..
కలెక్టరు ఆదేశాల ప్రకారం జాయినింగ్‌ ఆర్డర్‌ ఇచ్చేశాము. అక్కడ ఏం జరిగిందో మాకు తెలియదు. ఎంపీడీఓ జాయిన్‌ చేసుకోవాలి. ఎందుకు జాయిన్‌ చేసుకోలేదో ఆయనకే తెలియాలి. ఇక్కడైతే ఏ సమస్యాలేదు. బొడ్డేపల్లి రాజగోపాల్, పీడీ, డ్వామా, విజయనగరం

ఎమ్మెల్యే చెబితేనే...
ఎమ్మెల్యేని కలిసి ఆయనతో నాకుచెప్పిస్తేనే జాయినింగ్‌ చేసుకుంటాము. లేకపోతే కుదరదు. ఇప్పటికే అదేమాట చాలా సార్లు చెప్పాను. ఇప్పుడు అదే చెబుతున్నాను. –ఎంపీడీఓ, జామి మండలం

మరిన్ని వార్తలు