ఔరా..! ఇదేం చోద్యం...!

31 Jan, 2018 12:30 IST|Sakshi

ఎంపీపీ చెప్పారని...

ఒకరికి బదులు వేరొకరు విధుల నిర్వహణ

పెదపెంకి రెండవ నంబరు పాఠశాలలో విచిత్రం  

బలిజిపేట: పెదపెంకి రెండవ నంబరు పాఠశాలలో అనారోగ్యంతో తరచూ పాఠశాలకు హాజరుకాని ఓ ఉపాధ్యాయిని బదులుగా ఒక డమ్మీ ఉపాధ్యాయురాలిని పెట్టి తరగతులు నిర్వహిస్తూ, ఆమె వచ్చినపుడు ఉపాధ్యాయ రిజిస్టరులో సంతకాలు చేయిస్తున్న వైనంపై ఆ గ్రామస్తులు సత్యం, సింహాచలం, ఆనందరావు, సింహాలు తదితరులు పెదవి విప్పారు. ఇదేమిటని ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడు అన్నంనాయుడును ప్రశ్నించగా ఎంపీపీ పార్వతి సూచనలతోనే ఇలా చేస్తున్నట్టు చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసింది. దీనికి సంబంధించి గ్రామస్తులు తెలిపిన వివరాలు... పెదపెంకి రెండవ నెంబరు పాఠశాలలో 83మంది విద్యార్థులు ఉండగా 60నుంచి 70మంది వరకు హాజరవుతుంటారు. ఇక్కడ ఐదుగురు ఉపాధ్యాయులు ఉన్నారు.

వీరిలో మహిళా ఉపాధ్యాయురాలు రోజారమణి రెండు నెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ పాఠశాలకు సక్రమంగా రావడం లేదు.  ఈ విషయం ఎంపీపీ పెంకి పార్వతి దృష్టిలో ఉపాధ్యాయులు ఉంచగా ఆమెకు వెసులుబాటు కల్పిస్తూ గ్రామానికి చెందిన లావణ్య అనే మహిళను రోజారమణికి బదులుగా పంపిస్తూ తరగతులు నిర్వహించమని సూచించారు. దీంతో డమ్మీ ఉపాధ్యాయురాలితో తరగతులు నిర్వహిస్తున్నారు.  రోజారమణి పాఠశాలకు వచ్చేటపుడు ఆమె చేత రిజిస్టరులో సంతకాలు చేయిస్తున్నట్టు గ్రామస్తులు తెలిపారు.  రెండు నెలల నుంచి ఇదే తంతు జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం విశేషం. మంగళవారం పాఠశాలలో రోజారమణితో పాటు డమ్మీ ఉపాధ్యాయురాలు పని చేయడం కొసమెరుపు.

ఎంపీపీ అనుమతితోనే...
ఇదే విషయమై పాఠశాల ఇన్‌చార్జి హెచ్‌ఎం అన్నంనాయుడు వద్ద ప్రస్తావించగా ఎంపీపీ పార్వతీ అనుమతితోనే ఇలా చేశామని చెప్పడం గమనార్హం. రోజారమణి వచ్చినపుడు రిజిస్టరులో సంతకాలు చేయిస్తున్నామని చెప్పడం విశేషం. 

మానవతా దృక్పథంతోనే...
ఉపాధ్యాయురాలు అనారోగ్యంతో ఉండడంతో తరగతుల నిర్వహణకు ఆటంకం కలగకుండా ఉండేందుకు ఆమెకు బదులుగా వేరొకరిని పంపేందుకు నిర్ణయించామని ఎంపీపీ పార్వతీ చెప్పారు.  ఉపాధ్యాయురాలు వచ్చినపుడు ఆమె చేత సంతకాలు చేయిస్తున్న విషయమై తనకు తెలియదని పరిశీలిస్తానని ఎంపీపీ చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసింది. 

పరిశీలిస్తా...
ఈ విషయమై ఎంఈఓ శ్రీనివాసరావు స్పందిస్తూ ఈ సమస్య తన దృష్టికి వచ్చిందని, అనధికారికంగా ఎవరినీ నియమించరాదని చెప్పానని తెలిపారు. సెలవు పెట్టినట్టు రికార్డుల్లో నమోదు చేయాలని సూచించానని పేర్కొన్నారు. పాఠశాలను పరిశీలిస్తానని చెప్పారు. 

మరిన్ని వార్తలు