అన్నల పొలిమేరల్లో అనువైన దారులు..

7 Feb, 2018 13:33 IST|Sakshi
కొమరాడ మండల కుంతేశు గ్రామం రోడ్డు

మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో పీఎంజీఎస్‌వై రహదారులు

ఐటీడీఏ పరిధిలో 318 కిలోమీటర్లకు రూ. 150కోట్లు

ఐటీడీఏ చరిత్రలో మొదటిసారిగా పీఆర్‌ రహదారులు మంజూరు

విజయనగరం, పార్వతీపురం: మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రధానమంత్రి గ్రామీణ షడక్‌ యోజన పథకంలో భాగంగా రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం తన వంతు సహకారాన్ని అందిస్తోంది. గతంలో పోలీసుశాఖ సూచించిన మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎట్టకేలకు రహదారులు నిర్మాణానికి పీఆర్‌ నుంచి రహదారులు మంజూరయ్యాయి. ఐటీడీఏ సబ్‌ప్లాన్‌ మండలాల్లో గతంలో ప్రతిపాదించిన రహదారుల్లో 21 రహదారులు మంజూరైనట్లు ఐటీడీఏకు మంగళవారం ఉత్తర్వులు వచ్చాయి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఈ రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి గ్రామీణ షడక్‌యోజన పథకంలో భాగంగా తమవంతు వాటాగా నిధులు కేటాయించడం, ఈ రహదారుల నిర్మాణం ఐటీడీఏ ఇంజినీరింగ్‌శాఖ తరఫున కాకుండా పంచాయతీరాజ్‌ శాఖ తరఫున మంజూరు చేయడం ఐటీడీఏలో ప్రప్రథమం. ఐటీడీఏ సబ్‌ప్లాన్‌ మండలాల్లో 318.06 కిలోమీటర్లమేర 21 రహదారుల నిర్మాణానికి రూ. 150.70 కోట్లు మంజూరు అయ్యాయి. 

మంజూరైన రహదారులు ఇవే...
ఐటీడీఏ పరిధిలోని గుమ్మలక్ష్మీపురం మండలంలో గుణద వయా కోసింగిభద్ర, టెంకసింగి గ్రామాల మధ్య 3.96 కిలోమీటర్లు, కొమరాడ మండలం విక్రాంపురం నుంచి కంచరపాడు వరకు 8.36 కిలోమీటర్లు, కురుపాం మండలం జి. శివడ ఆర్‌అండ్‌బీ నుంచి పెదంటిజోల వరకు 1.76 కిలోమీటర్లు, పార్వతీపురం మండలం కొత్త అడారు నుంచి జిల్లేడు వలస వరకు 2.16కిలోమీటర్లు, టేకులోవ రోడ్డు నుంచి బిత్రటొంకి వరకు 1.52 కిలోమీటర్లు, పాచిపెంట మండలం మాతుమూరు నుంచి సీల గ్రామం గుండా తాడూరు, కొత్తవలస వరకు 103.78 కిలోమీటర్లు, మక్కువ మండలం దుగ్గేరు మెండంగి రోడ్డు నుంచి బాగుజోల వరకు 1.80 కిలోమీటర్లు, దుగ్గేరు రోడ్డునుంచి తలగడవలస వరకు 0.60 కిలోమీటర్లు, దబ్బగడ్డనుంచి కొట్టంకి వరకు 4.50 కిలోమీటర్లు, పుట్టినంద రోడ్డు నుంచి బట్టివలస వరకు 1.30 కిలోమీటర్లు, కవిరిపల్లి రోడ్డు నుంచి నాయుడువలసకు 1.50 కిలోమీటర్లు, గోపాలపురం రోడ్డు నుంచి గొడేవలస వరకు 1.50 కిలోమీటర్లు, పార్వతీపురం మండలం డోకిశీల నుంచి డెప్పివలస 1.70 కి.మీ, సూడిగాం నుంచి హిందూపురం 2.80 కిలోమీటర్లు, కొరాపుట్‌ రోడ్డు నుంచి పనస భద్ర 1.58 కిలోమీటర్లు, కొరాపుట్‌ రోడ్డు నుంచి రంగాలగొగ వరకు 1.76 కి.మీ, వెలగవలస నుంచి ఎల్‌డీవలస వరకు 0.67 కిలోమీటర్లు, సంగంవలస నుంచి ఎం. గదబవలస వరకు 1.05కి.మీ, పెదబొండపల్లినుంచి సూరంపేట గదబవలస వరకు 0.56కి.మీ, గుమ్మలక్ష్మీపురం మండలం జేకేపాడు కాలనీకి 1.44 కి.మీ, సాలూరు మండలం నంద నుంచి పగుల చెన్నేరు వరకు 9.80కి.మీ మేర తారు రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి.

టెండర్లు ఖరారుకాగానే పనులకు చర్యలు
ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన పథకంలో భాగంగా ఐటీడీఏ సబ్‌ప్లాన్‌ మండలాల్లో పలు గిరిజన గ్రామాలకు పంచాయతీ రాజ్‌ శాఖద్వారా రహదారులు మంజూరు కావడం ఆనందంగా ఉంది. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో ప్రాధాన్యం ఇస్తూ రహదారులు మంజూరయ్యాయి. వీటితోపాటు ఐటీడీఏ సబ్‌ప్లాన్‌ మండలాల్లో పలు గ్రామీలతో కలుపుకొని 21 రహదారులు మంజూరయ్యాయి. వీటికి టెండర్ల ప్రక్రియ పూర్తికాగానే పనులు ప్రారంభించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తాం. -డా. జి. లక్ష్మీశా, ఐటీడీఏ పీఓ,పార్వతీపురం

250 జనాభా కంటే తక్కువ ఉన్న గ్రామాలకు రహదారులు మంజూరు..
ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన పథకంలో భాగంగా 100నుంచి 250 మధ్య ప్రజలు ఉన్న గిరిజన గ్రామాలకు రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రహదారులు మంజూరు చేస్తోంది. ఇందులో భాగంగా 181.76 కి.మీ గాను రూ. 12.477 కోట్లు మంజూరు చేసింది. ఈ పథకంలో భాగంగా గుమ్మలక్ష్మీపురం మండలం కోసంగిభద్ర, తాడంగి వలస రహదారి, కొమరాడ మండలం విక్రాంపురం– కంచరపాడు రహదారి, కురుపాం మండలం జి. శివడ–పెదండజోల రహదారి, పార్వతీపురం మండలం కొత్త అడారి– జిల్లేడు వలస రహదారి, టేకులోవ–బిత్రటొంకి రహదారులు మంజూరయ్యాయి.

మరిన్ని వార్తలు