ఎలా ఖాళీ చేయిస్తారో చూస్తాం..

21 Jan, 2018 08:12 IST|Sakshi

ఆక్రమణదారులను ఖాళీ చేయించేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులు

అధికారులను అడ్డుకున్న జెడ్పీటీసీ

అన్ని ఆక్రమణలను ఖాళీ చేయించగలరా అని నిలదీత

చీపురుపల్లి: చీపురుపల్లి పట్టణ శివారున శ్రీకాకుళానికి వెళ్లే రహదారిలో సర్వే నంబర్‌ 65లో గెడ్డవాగు ఉంది. కొందరు వ్యక్తులు ఆ వాగును పూడ్చేసి ఆక్రమించుకుని, చిన్న షెడ్డులు వేసేసి వ్యాపారాలు చేసుకుంటున్నారు. దీనిపై ఫిర్యాదులు అందడంతో రెవెన్యూ అధికారులు వారికి ఆరేడు నోటీసులు జారీ చేశారు. వారు స్పందించకపోవడంతో ఖాళీ చేయించేందుకు శనివారం అక్కడికి అధికారులు చేరుకున్నారు. వెంటనే ఖాళీ చేయాలని, లేకుంటే కఠిన చర్యలు ఉంటాయని నానా హడావుడి చేశారు.

జెడ్పీటీసీ రంగ ప్రవేశంతో..
విషయం తెలుసుకున్న చీపురుపల్లి జెడ్పీటీసీ, అధికార పార్టీ నేత మీసాల వరహాలనాయుడు అక్కడికి చేరుకున్నారు. మండల వ్యాప్తంగా అన్ని చోట్ల ఆక్రమణలు జరిగాయి. వాటిని వదిలేసి ఇక్కడ పేదలు వేసుకున్న చిన్న వర్క్‌షాపులను తొలగించేందుకు వచ్చారా..? అవి మీకు కనిపించడం లేదా..? అని అధికారులను నిలదీశారు. ఒక దశలో మీరెలా ఖాళీ చేయిస్తారో చూస్తాం అంటూ హెచ్చరికలు జారీ చేశారు. పేదలకు సాయపడని అధికారులు ఎందుకు అని హుకుం జారీ చేశారు. అంతే అప్పటివరకు నానా హడావుడి చేసిన అధికారులు చప్పగా మారిపోయారు. చేతులు కట్టుకుని జెడ్పీటీసీ చెప్పినదానికి తలలు ఊపారు.

అధికార పార్టీ నేత కావడంతో..
వరహాల నాయుడు అధికార పార్టీ నేత కావడంతో మళ్లీ ఎమ్మెల్యే, మంత్రి దృష్టికి తీసుకెళితే ఇబ్బందులు వస్తాయని తలచిన అధికారులు కిమ్మనకుండా ఉండిపోయారు. తహసీల్దార్‌ ముక్తేశ్వరరావు ఆదేశాలతో ఖాళీ చేయించేందుకు స్థానిక వీఆర్‌ఓ, ఆర్‌ఐ వసంత, ఇరిగేషన్‌ ఏఈ పవన్‌కుమార్, డీటీ కెఎస్‌ఎన్‌.మూర్తి తదితరులు వెళ్లారు. వారు చర్యలు ప్రారంభిస్తుండగా జెడ్పీటీసీ అక్కడి చేరుకుని సోమవారం వరకు సమయం కావాలని లేకుంటే ఖాళీ చేయమని బదులిచ్చారు. ఒకానొక సమయంలో రెవెన్యూ అధికారులు, విలేకర్లపై అసహనం వ్యక్తం చేశారు. అయితే డీటీ మూర్తి మూర్తి మాట్లాడుతూ సాయంత్రం వరకు సమయం ఇస్తున్నామని అప్పటికే ఖాళీ చేయాలని, తన చేతిలో ఏమీ లేదని స్పష్టం చేశారు. తర్వాత అధికారులు జెడ్పీటీసీ వేర్వేరుగా మాట్లాడుకుని, సాయంత్రానికి ఆక్రమణదారులే స్వచ్ఛందంగా ఖాళీ చేస్తారని హామీ ఇవ్వడంతో అధికారులు వెనుతిరిగారు.

మరిన్ని వార్తలు