నాన్నను చూసే లాఠీ పట్టా...

8 Jan, 2018 13:00 IST|Sakshi

తండ్రి కోరికపై ఆంధ్రాకొచ్చిన ‘ఐపీఎస్‌’

గ్రేహౌండ్స్‌ కమాండంట్‌గా తొలి అడుగు

మరో ఐపీఎస్‌తో ప్రేమ వివాహం

తాజాగా పార్వతీపురంలో పోస్టింగ్‌

ఏఎస్పీ దీపిక ఎం.పాటిల్‌తో 'సాక్షి' ఇంటర్వ్యూ

సాక్షి ప్రతినిధి, విజయనగరం :  వారిది పోలీస్‌ కుటుంబం... తండ్రి ఉన్నతాధికారి కావడంతో చిరు ప్రాయం నుంచి ఖాకీ దుస్తుల మధ్య పెరిగారు... లాఠీలతో ఆడుకున్నారు... పెరిగి పెద్దయ్యాక ఇటు సోదరుడు... అటు భర్త కూడా అదే శాఖలో ఉన్నత స్థానాల్లో ఉండటంతో సమాజంలో ఆ విభాగానికి ఉన్న గుర్తింపు ఏమిటో తెలుసుకున్నారు. దాని ద్వారా ప్రజలకు నేరుగా సేవ చేయగలమని గుర్తించారు. అదే ఆమెలో పోలీస్‌ అధికారి కావాలన్న కోరికకు ప్రేరణగా నిలిచాయి. తొలి ప్రయత్నంలోనే ఐపీఎస్‌ సాధించారు. అసాధారణమైన గ్రేహౌండ్స్‌ కమాండంట్‌గా రాటుదేలారు. ఇప్పుడు పార్వతీపురం ఏఎస్పీగా కొత్త బాధ్యతలు చేపట్టారు. ఆమే దీపికా ఎం పాటిల్‌. ఆంధ్రాలో పుట్టి ఝార్ఖండ్‌లో స్థిరపడిన తెలుగు పోలీస్‌ కుటుంబానికి చెందిన ఆమెతో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ

సాక్షి: దీపిక ఎం పాటిల్‌. మీ పేరులోనే వైవిధ్యం కనిపిస్తోంది?
దీపిక: మా నాన్న మండవ విష్ణు వర్ధన్‌.. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా సమీపంలోని కృష్ణా జి ల్లా ఆమదాలలంక గ్రామంలో పుట్టారు. నాన్నవాళ్లది వ్యవసాయ కుటుంబం. ప్రభుత్వం ఇచ్చే స్కాలర్‌షిప్‌ల మీదే ఆధారపడి చదువుకుని ఐపీఎస్‌ సాధించారు. నా భర్త విక్రాంత్‌ పాటిల్‌ 2012 తమిళనాడు కేడర్‌ ఐపీఎస్‌ అధికారి. ప్రస్తుతం విజయనగరం ఓఎస్‌డీగా పనిచేస్తున్నారు. మాది ప్రేమ వివాహం. నాన్న ఇచ్చిన ఇంటిపేరును అలానేఉంచేసి దాని పక్కన నా భర్త ఇంటిపేరుని చేర్చుకున్నాను. అందుకే దీపిక ఎం పాటిల్‌గా స్థిరపడ్డాను.

సాక్షి: బాల్యం, విద్య, కుటుంబ విశేషాలు?
దీపిక: మాది పోలీసు కుటుంబం. నాన్న ఆంధ్రాలో పుట్టినప్పటికీ వృత్తిరీత్యా ఝార్ఖండ్‌లో స్థిరపడటంతో అక్కడే నా బాల్యం ప్రారంభమయ్యింది. నాన్నకు ఏటా బదిలీ అవుతుండటంతో తరచూ మేము కూడా ఆయనతో పాటు అనేక ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. ఝార్ఖండ్‌లో ప్రారంభమైన విద్యాభ్యాసం నాన్న బదిలీ ప్రాంతాల్లో కొనసాగింది. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్‌ వరకు 13 స్కూళ్లు మారాల్సివచ్చింది. రాజస్థాన్‌లోని బిట్స్‌ పిలానీలో ఇంజినీరింగ్‌ పూర్తి చేశాను.

సాక్షి: ఆంధ్రాలో గ్రేహౌండ్స్‌ కమాండర్‌గా ఎలా మారారు?
దీపిక: మా అమ్మానాన్న నన్ను ఎంతో క్రమ శిక్షణతో పెంచారు. నాన్న ఉద్యోగ విధుల్లో తీరిక లేకుండా ఉన్నప్పటికీ అమ్మ పోస్టు గ్రాడ్యూయేట్‌ కావడంతో నన్ను బాగా చదివించేది. ఆడపిల్లలంటే కేవలం పెళ్లి వస్తువుగా నేటి సమాజం చూస్తోంది. పెళ్లి చేసేస్తే బాధ్యత తీరిపోతుందని భావించేవాళ్లే ఎక్కువ. కానీ మా ఇంట్లో ఆ పరిస్థితి లేదు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలనే భావనతో నా తల్లిదండ్రులు నన్ను ప్రోత్సహించారు. 2013లో సివిల్స్‌ రాశాను. మొదటి ప్రయత్నంలోనే 2014లో ఐపీఎస్‌గా ఎంపికయ్యాను. గ్రేçహౌండ్స్‌ కమాండర్‌గా మొదటి సారిగా పనిచేసే అవకాశం లభిం చింది. నాన్న, అన్నయ్య, భర్త ఐపీఎస్‌లే కాబట్టి పోలీసుల విధులు ఏ విధంగా ఉంటాయి, సమస్యలను ఏ రకంగా పరిష్కరిస్తారో దగ్గరగా చూసేదాన్ని కాబట్టి గ్రేహౌండ్స్‌ కమాండర్‌గా పెద్ద కష్టమేమీ అనిపించలేదు. నాన్న ఆంధ్రాలో జన్మించారు కాబట్టి ఆంధ్రాలో పనిచేయాలనుకునేవారు. ఆయన కోరిక నా ద్వారా తీరింది.

సాక్షి: చిన్న వయసులోనే పెద్ద బాధ్యతలు చేపట్టారు?
దీపిక: నేటి యువత శక్తివంతమైనది. యువత సాధించలేనిది ఏదీ లేదు. క్షణికావేశంలో తప్పటడుగులు వేస్తూ తప్పుడు నిర్ణయాలతో తమ జీవితాలను పాడుచేసుకుంటున్నారే తప్ప భావిభారతావనికి అవసరమైన పౌరులుగా తయారు కావడం లేదు. దేశం మనకేమిచ్చింది అనే కంటే దేశం కోసం మనం ఏం చేశామని ఆలోచించే వారు చాలా తక్కువ. దేశం గర్వించదగ్గ పౌరులుగా యువత తయారు కావాలి.

సాక్షి: ఐపీఎస్‌ను ఏరికోరి పెళ్లిచేసుకోవడానికి కారణం?
దీపిక: అన్నయ్య హర్షవర్ధన్, విక్రాంత్‌ పాటిల్‌ మంచి స్నేహితులు. తరచూ అన్నయ్యతో కలసి ఆయన రావడంతో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. ఇరువురి ఇష్టాన్ని  తెలుసుకున్న తల్లిదండ్రులు మా వివాహం జరిపించారు. సమాజంలో పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ప్రజలకు సేవచేసే భాగ్యంతో పాటు వ్యవస్థను అదుపులో ఉంచే అధికారం కూడా మనకు ఉంటుందని నాన్న తరచూ చెబుతుండేవారు. నాన్న చెప్పిన మంచి మాటలు, ప్రజలకు పోలీసు వ్యవస్థ ద్వారా ఆయన చేస్తున్న సేవలు చూసి ఐపీఎస్‌ అంటే ఇష్టం ఏర్పడింది.

సాక్షి: సరదాలు, సంతోషాలు?
దీపిక: చిన్నప్పుడు అమ్మా, నాన్న ఆట విడుపుకోసం గుర్రపు స్వారీకి నన్ను తీసుకెళ్లేవారు. అది అలవాటుగా మారింది. గుర్రపు స్వారీ చేయడం ఎంతో ఇష్టం. స్విమ్మింగ్, టెన్నిస్‌ ఆడడం కూడా ఇష్టం. అలాగే పెయింటింగ్స్‌ వేయడం, మంచి పుస్తకాలను చదవడం అలవాటు. జంక్‌ఫుడ్స్, పిజ్జా, బర్గర్, ఐస్‌క్రీం వంటివి ఎక్కువగా తింటుంటాను. చాక్‌లైట్‌ ఫ్లేవర్‌ ఐస్‌క్రీమ్‌ అంటే ఇష్టం. పింక్‌ కలర్‌ ఇష్టం. ఆ రంగు దుస్తులు మహిళలకు ఎక్కువ అందాన్నిస్తాయి. చిన్నతనంలో సినిమాలు చూసేదాన్ని, కానీ సినిమాల్లో ప్రజలకు ఉపయోగకరమైన అంశాలకంటే అనవసరమైనవే ఎక్కువగా ఉంటున్నాయి. వాటిని చూసి యువత చెడిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడొస్తున్న సినిమాల్లో ఒకటి , రెండు తప్ప మిగతా సినిమాలన్నీ కామెడీ, ద్వంద్వ అర్థాలతో ఉన్న సినిమాలే కాబట్టి చూడాలనిపించడం లేదు.

మరిన్ని వార్తలు