‘కొండా’ గ్రామానికి భారీగా నిధులు

13 Jan, 2018 11:33 IST|Sakshi

కేటాయించిన సీఎం కేసీఆర్‌ 

నేడు రూ.9.50కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు

హాజరు కానున్న మంత్రి హరీశ్‌రావు

ఆత్మకూరు(పరకాల): గీసుకొండ మండలంలోని కొండా దంపతుల స్వగ్రామం వంచనగిరికి మహర్దశ పట్టనుంది. సీఎం కేసీఆర్‌ గ్రామ అభివృద్ధి కోసం ఇటీవల రూ.9.50 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నిధులతో పాటు ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సుమారు రూ.70 లక్షలు మంజూరు చేశారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో గంగదేవిపల్లి తర్వాత ఇంత పెద్ద  మొత్తంలో నిధులు మంజూరైన గ్రామాలు లేవు. వీటితో గ్రామంలోని ప్రతీ వీధిలో సీసీ రోడ్లు, సైడ్‌ కాల్వల నిర్మాణం చేపట్టనున్నారు.

రెండు ఫంక్షన్‌ హాళ్లు, కమ్యూనిటీ హాల్‌ నిర్మించనున్నారు. ఇప్పటికే వంచనగిరి విద్యా, ఆధ్యాత్మిక కేంద్రంగా గుర్తింపు పొందింది. కొండా దంపతులు స్థలాన్ని విరాళంగా ఇవ్వడంతో కస్తూరిబా విద్యాలయం, మోడల్‌ స్కూల్‌ భవనాలను నిర్మించి ఇక్కడే వాటిని నిర్వహిస్తున్నారు. కోటగండి వద్ద కోటమైసమ్మ తల్లి, కొండగిరి సాయినాథ ఆలయాలు భక్తి కేంద్రాలుగా మారాయి. గ్రామంలోని ఎర్రమట్టి గుట్టపై త్వరలో శివాలయం నిర్మిస్తామని కొండా మురళీ ఇటీవలే ప్రకటించారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు శనివారం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొంటారని వివరించారు.  

మరిన్ని వార్తలు