హతవిధి.. సొంత మంత్రి పోర్ట్‌పోలియో తెల్వదా?

23 Jun, 2019 14:11 IST|Sakshi

సాక్షి, వరంగల్ : ఓ ఎమ్మెల్యే అవగాహన రాహిత్యాన్ని చూసి నెటిజన్లు నవ్వుకుంటుంటే..... సాక్షాత్తు ఆ జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి ఎమ్మెల్యే లెటర్లో తన పోర్ట్ పోలియో చూసి నివ్వెరపోయారు. ఈ ఘటన వరంగల్‌ జిల్లాలో చోటుచేసుకోగా.. ఆ ఎమ్మెల్యే లెటర్‌ హెడ్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. 3 రోజుల క్రితం వరంగల్ జిల్లా హనుమకొండలో 9నెలల పసిపాపపై ప్రవీణ్ అనే కామాంధుడు అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర వ్యాప్తంగా నిందితుడు పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళనలు జరుగుతున్నా.. ప్రతి విషయానికి స్పందించే స్థానిక ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ మాత్రం ఈ ఘటనపై నోరుమెదపలేదు. దీంతో ఆయనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు అయితే ఏకంగా వినయ్‌ భాస్కర్‌ను ముఖాముఖిగా చిన్నారి హత్యపై నిలదీశారు. 

దీంతో ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌ ఈ ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హోంమంత్రి మహమ్మద్‌ అలీకి లేఖ రాశారు. ఈ హృదయవిచారక ఘటన తనను ఎంతగానో కలచివేసిందని, వ్యవసాయ శాఖ మంత్రి దయాకర్ రావు తో కలిసి బాధిత కుటుంబాన్ని కలిశానని లేఖలో పేర్కొన్నారు. అయితే ఇక్కడే ఎమ్మెల్యే పప్పులో కాలేశారు. పంచాయితీ రాజ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ మంత్రిగా పనిచేస్తున్న ఎర్రబెల్లి దయాకర్‌ రావును పొరపాటుగా వ్యవసాయశాఖ మంత్రిగా పేర్కొన్నారు. ఈ తప్పును గ్రహించిన నెటిజన్లు ఎమ్మెల్యేను సోషల్‌ మీడియా వేదికగా ఓ ఆట ఆడుకుంటున్నారు. ‘హతవిధి.. సొంత జిల్లా మంత్రి పోర్ట్‌ పోలియో కూడా తెల్వదా?’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు.  

స్పందించిన ప్రభుత్వం..
చిన్నారి హత్యపై ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది. చిన్నారి శ్రీహిత తల్లిదండ్రులతో హోంమంత్రి మహమ్మద్‌ అలీ ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. తొందరగా న్యాయం జరిగి నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కలుస్తారని తెలిపారు. ఇటువంటి సంఘటన ఏ తల్లిదండ్రులకు జరగకూడదని, ఇలా చేయాలన్న ఆలోచన ఎవరికి రానంతగా నిందితుడిని కఠినంగా శిక్షించాలని చిన్నారి తల్లిదండ్రులు హోం మంత్రిని కోరారు.

Read latest Warangal-rural News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా