పారిశ్రామిక నైపుణ్యతకు నిట్‌తో సీఐఐ ఎంఓయు

9 Jan, 2018 19:34 IST|Sakshi

కాజీపేట అర్బన్‌ : కాజీపేటలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(నిట్‌)తో కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండ్రస్ట్రీ(సీఐఐ) ఎంఓయూ కుదుర్చుకుంది. నిట్‌ డైరెక్టర్‌ ఎన్‌.వి.రమణారావు, సీఐఐ తెలంగాణ చైర్మన్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ ఉపాధ్యక్షుడు వి.రాజన్‌లు మంగళవారం ఒప్పంద పత్రాలను పరస్పరం అందజేసుకున్నారు. ఈ సందర్భంగా నిట్‌ డైరెక్టర్‌ సమావేశ మందిరంలో రమణారావు మాట్లాడుతూ పారిశ్రామిక నైపుణ్యతను అందించేందుకు, నూతన పరిశోధనలకు కేంద్రంగా నిలుస్తున్న నిట్‌లోని విద్యార్థులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఈ ఒప్పందం తోడ్పడనున్నట్లు తెలిపారు. సీఐఐ ద్వారా ఫ్యాకల్టీ, విద్యార్థులకు పారిశ్రామిక నైపుణ్యతను అందించడం ద్వారా నూతన పరిశ్రమల ఏర్పాటుకు నాంది పలకవచ్చన్నారు. నగరాన్ని ఇండస్ట్రియల్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని రాజన్న అన్నారు. పరిశ్రమల ఏర్పాటులో నైపుణ్యత, వర్క్‌షాపులు, పరిశ్రమలతో అనుసంధానం చేస్తూ నిట్‌ అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్ధులకు బోధించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో రిజస్ట్రార్‌ లక్ష్మారెడ్డి, డీన్‌లు రాంగోపాల్‌రెడ్డి, జయకుమార్, రామచంద్రయ్య, పీఆర్‌ఓ రవీందర్‌రెడ్డి, సీఐఐ బాధ్యులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు