నాలుగు రోజులు.. మొక్కుల పరవళ్లు

5 Feb, 2018 13:01 IST|Sakshi
మేడారం జాతరలో తల్లులను దర్శించుకుంటున్న భక్తులు(ఫైల్‌)

కోటి మందికిపైగా వచ్చిన భక్తులు 

జాతర ముగిసినా కొనసాగుతున్న దర్శనాలు

సెలవు రోజుల్లో పెరుగుతున్న రద్దీ

ఎస్‌ఎస్‌ తాడ్వాయి: మేడారం.. ఓ అద్భుతం.. సమ్మక్క–సారలమ్మ జాతర పేరుకే నాలుగు రోజుల పండుగ.. కానీ, ఈ మహా ఘట్టం నడక మాత్రం దాదాపు నెల రోజులకుపైగా సాగింది. జనవరి నెలలో సంక్రాంతి సెలవులతో ఊపందుకున్న భక్తుల రాకపోకలు తల్లుల వన ప్రవేశం ముగిసినా.. ఇంకా కొనసాగుతోంది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు మహా జాతర ఎంతో కనుల పండువగా సాగింది. సంక్రాంతి పండుగ తర్వాత రోజుకు లక్ష నుంచి 2 లక్షల మంది భక్తులు జాతరకు ముందస్తుగా తరలివచ్చి మొక్కులు చెల్లించారు. గుడిమెలిగె, మండమెలిగె పండుగతో ప్రారంభమైన జాతర సమ్మక్క–సారలమ్మలు గద్దెలపైకి వచ్చేంత వరకు భక్తులు తండోపతండాలుగా మేడారానికి తరలివచ్చారు. ఆనాటి నుంచి జాతర నాలుగు రోజుల్లో కోటి మంది భక్తులు తరలివచ్చి దేవతలను దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. జనవరి 31న సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల ఆగమనంతో  భక్తుల తాకిడి గణనీయంగా పెరిగింది. ఫిబ్రవరి 1న వరాల తల్లి సమ్మక్క చిలకలగుట్ట నుంచి గద్దెకు చేరడంతో భక్తులతో మేడారం పోటెత్తింది. 2న సర్వత్ర మొక్కులు చెల్లించి మనసార అమ్మలను దర్శించుకున్నారు. 3న సమ్మక్క చిలకలగుట్టకు, సారలమ్మ కన్నెపెల్లికి వనమెళ్లగా,  పగిడిద్దరాజు, గోవిందరాజులు స్వస్థలాలకు వెళ్లారు. అయినప్పటికీ  ఆదివారం రోజు కూడా లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చిన మొక్కులు చెల్లించారు. 

ఇబ్బందు పడిన భక్తులు...
జాతర ప్రారంభానికి ముందుగా భక్తులకు అందుబాటులోకి వచ్చిన మరుగుదొడ్లు భక్తుల రద్దీ పెరగడంతో కులాయి వద్ద నీళ్లు లేకపోవడంతో భక్తులు మలమూత్ర విసర్జన కోసం ఇబ్బందులు పడ్డారు. జాతరకు వారం రోజుల ముందే మేడారానికి తరలిచ్చిన భక్తులకు తాగునీటి సమస్య వెంటాడింది. అధికారులు మేల్గొనప్పటికీ అంతంతా మాత్రంగానే తాగునీటిని సరఫరా చేశారు. రెడ్డిగూడెం రోడ్లన్నీ కూడా బురదగా మారడంతో రోడ్లపై నడిచేందుకు భక్తులు ఇబ్బందులు పడ్డారు. ప్రతి బుధ, ఆదివారాల్లో సైతం భక్తులు దూర ప్రాంతాల నుంచి వచ్చి విడిది చేసి అమ్మలకు మొక్కులు చెల్లించి నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకుంటున్నారు. సెలవు రోజుల వచ్చిదంటే ఆ రోజు మేడారం అంత భక్తులతో కిటకిటలాడుతోంది. 

మాయమైన మహా నగరం...
తల్లుల దర్శనానికి వచ్చిన భక్తులతో కుగ్రామంగా ఉన్న మేడారం మహా నగరంగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు జాతర ప్రాంతంలో గుడారులు వేసుకుని అమ్మల రాక కోసం ఎదురుచూశారు. గద్దెలపై కొలువుదీరిన వనదేవతలకు మొక్కులు చెల్లించారు. దేవతల వనప్రవేశంతోనే భక్తులు సైతం తమ గ్రామాలకు తిరుగు పయనమయ్యారు. దీంతో మహా నగరం ఒక్కసారి గా మాయమైనట్లుగా కనిపిస్తోంది.   

మరిన్ని వార్తలు