జాతరకు ముందే రూ. కోటి ఆదాయం

31 Jan, 2018 16:07 IST|Sakshi

2,490 బస్సులు, లక్ష మందికి పైగా భక్తుల రాకపోకలు

భూపాలపల్లి: జాతరకు ముందే ఆర్టీసీకి భారీగా ఆదాయం వచ్చింది. జాతర బుధవారం నుంచి జరుగనుండగా మంగళవారం భారీ సంఖ్యలో భక్తులు సమ్మక్క–సారలమ్మను దర్శించుకునేందుకు మేడారం వచ్చారు. 52 పాయింట్ల నుంచి వచ్చిన 2,490 బస్సుల్లో 1,04,000 మంది భక్తులు మేడారం చేరుకున్నారు. భక్తులు భారీ సంఖ్యలో రావడంతో ఆర్టీసీకి ఒక్కరోజే సుమారు రూ.కోటి ఆదాయం లభించింది. కాగా, 48 వేల మంది భక్తులు మంగళవారం తిరుగు ప్రయాణమయ్యారు. సుమారు 60 వేల మంది భక్తులు జాతరలోనే ఉన్నారు. బుధవారం సారలమ్మ తల్లి గద్దెలకు రానున్న నేపథ్యంలో భక్తుల రాక మరింత పెరిగే అవకాశం ఉంది. ఇందుకోసం ప్రస్తుతం నడిపిస్తున్న సుమారు 2,500 బస్సులతోపాటు అదనంగా మరో 2 వేల బస్సులను నడిపించనున్నట్లు ఆర్టీసీ వరంగల్‌ ఆర్‌ఎం సూర్యకిరణ్‌ తెలిపారు.

అందుబాటులో అద్దె బండ్లు..
ఎస్‌ఎస్‌ తాడ్వాయి: జాతరకు వచ్చిన భక్తులను వివిధ ప్రాంతాలకు తరలించేందుకు ఎడ్ల బండ్లు మేడారానికి చేరుకుంటున్నాయి. భక్తుల రద్దీ పెరగడంతో ఆర్టీసీ బస్సులో మేడారం వచ్చే భక్తులను బస్టాండ్‌ వద్ద దింపుతున్నారు. ఇక ముల్లెమూటలతో వచ్చిన భక్తులు అద్దె బండ్లను ఆశ్రయిస్తున్నారు. ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి జంపన్నవాగు వరకు, అక్కడి నుంచి గద్దెల వరకు భక్తులను తరలించి వారి నుంచి రూ.200 తీసుకుంటున్నారు. అద్దె బండ్లను తీసుకున్న భక్తులు వాటిపై హైహై నాయక అంటూ ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు.  

( ఎడ్లబండ్లలో జంపన్నవాగుకు వెళ్తున్న భక్తులు  )

మరిన్ని వార్తలు