మారని రైల్వే... 

26 Jan, 2018 16:51 IST|Sakshi

మహాజాతర సమీపిస్తున్నా ఉలుకే లేని శాఖ

ఒక్క ప్రత్యేక రైలునూ ప్రకటించని అధికారులు

ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరపై మీనమేషాలు

ఎంపీ రాపోలు ఆనందభాస్కర్‌ విన్నపం బుట్టదాఖలు

ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై చిన్నచూపు

ఆందోళనలో పలు జిల్లాల భక్తులు

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: కుంభమేళాను తలపించే మేడారం జాతరకు రైళ్లను ప్రకటించడంలో రైల్వేశాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా పెరిగే రద్దీకి అనుగుణంగా ఇప్పటివరకు ఒక్క ప్రత్యేక రైలునూ ప్రకటించలేదు. మరోవైపు రాష్ట్రంలో ఉన్న ఆర్టీసీ బస్సుల్లో సగం మేడారం బాటపట్టనున్నాయి. ఈ మేరకు ఇతర మార్గాల్లో ప్రత్యామ్నాయంగా రైళ్లను నడిపించాలి. జాతర తేదీలు సమీపిస్తున్నా  రైల్వేశాఖ నుంచి ఉలుకుపలుకు లేదు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ఎస్‌ఎస్‌ తాడ్వాయి మండలం మేడారంలో 2018 జనవరి 31, ఫిబ్రవరి 1, 2, 3వ తేదీల్లో జరిగే సమ్మక్క–సారలమ్మ జాతరకు కోటి మంది భక్తులు హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇంత పెద్ద ఉత్సవానికి ప్రత్యేక రైళ్లు నడిపించడంలో రైల్వేశాఖ మీనమేషాలు లెక్కిస్తోంది. సంక్రాంతి, దసరా పండగల సందర్భంగా రైల్వేశాఖ నెల రోజుల ముందుగానే ప్రత్యేక రైళ్లను ప్రకటిస్తుంది. ఇందులో 90 శాతం రైళ్లు సికింద్రాబాద్‌ నుంచి తిరుపతి, కాకినాడ, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరుకు వెళ్తాయి.

కానీ.. ఆసియాలో అతిపెద్దదైన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు ప్రత్యేక రైళ్లు ప్రకటించే విషయంలో ప్రతిసారి తాత్సారం జరుగుతోంది. జాతరకు వారం రోజుల ముందు వరకు ప్రత్యేక రైళ్లు ఉంటాయా.. లేదా.. అనేది ప్రశ్నార్థకంగా మారుతోంది. రోడ్డుమార్గంలో సరిపడా బస్సులు లేని వారు రైలుమార్గం ద్వారా కాజీపేట, వరంగల్‌ రైల్వే స్టేషన్లకు చేరుకోవాలి. అక్కడి నుంచి రోడ్డుమార్గం ద్వారా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేడారం చేరుకోవచ్చు. కాజీపేట రైల్వేజంక్షన్‌ ఉత్తర–దక్షిణ–పశ్చిమ ప్రాంతాలకు మధ్య వారధిగా ఉంది. ఈ మార్గం గుండా నిత్యం వందలాది రైళ్లు కిక్కిరిన ప్రయాణికులతో వెళ్తుంటాయి. జాతర సందర్భంగా లక్షల సంఖ్యలో వచ్చే అదనపు భక్తులకు ప్రస్తుతం నడుస్తున్న రైళ్లు సరిపోవు. ముఖ్యంగా ఖమ్మం–డోర్నకల్‌–కాజీపేట–బల్లార్షా, సికింద్రాబాద్‌–బల్లార్ష మార్గంలో రద్దీకి అనుగుణంగా రైళ్లను నడిపించాల్సి ఉంది. ఈ దిశగా రైల్వేశాఖ ఎటువంటి ప్రయత్నాలు చేయకపోవడంపై భక్తుల నుంచి విమర్శలు వస్తున్నాయి. మేడారం రద్దీకి అనుగుణంగా రైళ్ల సంఖ్యను పెంచాలని ఎంపీలు రాపోలు ఆనందభాస్కర్‌ రైల్వేశాఖకు లేఖ రాసినా.. ఇప్పటివరకూ స్పందించకపోవడం గమనార్హం. 

బస్సులకేదీ ప్రత్యామ్నాయం..
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పరిధిలో 95 డిపోలు ఉండగా.. సుమారు 10,479 బస్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో సిటీ బస్సులు, ఆర్టీసీ బస్సులను మినహాయిస్తే పూర్తిస్థాయి కండిషన్‌లో 8,000 బస్సుల వరకు ఉన్నాయి. 2018 జాతర సందర్భంగా వీటిలో దాదాపు 4,000 బస్సులను మేడారం జాతరకు నడిపించేందుకు సిద్ధమని ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రకటించారు. ఈ బస్సులు జనవరి 28 నుంచి నుంచి ఫిబ్రవరి 4 వరకు జాతర కోసం కేటాయించనున్నారు. ఈ నేపథ్యంలో వారం రోజుల పాటు ఉమ్మడి పది జిల్లాల పరిధిలో నిత్యం తిరిగే బస్సుల సంఖ్య తగ్గిపోనుంది. ఇందుకనుగుణంగా ప్రయాణికులకు ప్రత్యామ్నాయ రవాణా మార్గంగా రైళ్ల సంఖ్యను పెంచాల్సి ఉంది. కాజీపేట–సికింద్రాబాద్‌–నిజామాబాద్,  సికింద్రాబాద్‌–కాజీపేట–బల్లార్షా, కరీంనగర్‌–సిర్పూర్‌ కాగజ్‌నగర్, భద్రాచలం రోడ్డు–డోర్నకల్‌–కాజీపేట, మహబూబ్‌నగర్‌–కాచిగూడ–కాజీపేట మార్గాల్లో ప్రస్తుతం ఉన్న రైళ్లకు అదనంగా మరికొన్ని రైళ్లను నడిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.   
 

మరిన్ని వార్తలు