నేడు మహాజాతరకు అంకురార్పణ

17 Jan, 2018 01:43 IST|Sakshi

గుడి మెలిగె పండుగతో..

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: మేడారం మహాజాతరలో తొలిఘట్టమైన గుడిమెలిగె పండుగ బుధవారం జరగనుంది. మేడారంలోని సమ్మక్క, కన్నెపల్లిలో ఉన్న సారలమ్మ ఆలయాలతోపాటు పూజాసామగ్రిని శుద్ధి చేసి అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ తంతుతో మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర ప్రారంభం కానుంది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ఎస్‌ఎస్‌ తాడ్వాయి మండలం మేడారంలో జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు నాలుగు రోజులపాటు సమ్మక్క– సారలమ్మ మహాజాతర జరగనుంది.

ఈ జాతరకు కోటి మందికిపైగా భక్తులు హాజరవుతారని అంచనా. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిచెందిన ఈ జాతర గుడిమెలిగె పండుగతోనే ప్రారంభమవుతుంది. ఒకప్పుడు మేడారంలోని సమ్మక్క, కన్నెపల్లిలోని సారలమ్మలకు గుళ్లుగా గుడిసెలు ఉండేవి. జాతరకు ముందు ఈ గుడిసెలకు మరమ్మతులు చేసేవారు. గుడిసెలకు కొత్తగా పైకప్పు అమర్చడం(కప్పడం) చేసేవారు. దీన్ని గుడి మెలగడం అంటారు. ఈ ప్రక్రియతోనే జాతర తొలిపూజ కార్యక్రమాలు మొదలయ్యేవి. ఇప్పుడు గుడిసెలు లేవు. వీటి స్థానంలో భవనాలు కట్టారు. గుడిసెలు లేకున్నా.. జాతరకు రెండు వారాల ముందు గుడిమెలిగెను నిర్వహిస్తున్నారు. 

మరిన్ని వార్తలు