పార్టీలు మారినా పరిస్థితులు మారలే..

27 May, 2018 11:37 IST|Sakshi

దేశంలో అశ్లీలత పెరిగిపోయింది

ప్రజల పక్షాన ప్రజానాట్య మండలి

బీఎల్‌ఎఫ్‌ రాష్ట్ర కన్వీనర్‌ తమ్మినేని వీరభద్రం

బచ్చన్నపేట: దేశాన్ని గత 70 సంవత్సరాలుగా వివిధ రకాల పార్టీలు పాలిస్తున్నా ప్రజల స్థితిగతులు, పరిస్థితులు మాత్రం మారడం లేదని బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ రాష్ట్ర కన్వీనర్‌ తమ్మినేని వీరభద్రం అన్నారు. శనివారం మండల కేంద్రంలో ప్రజానాట్య మండలి రాష్ట్ర స్థాయి శిక్షణ తరగుతులు జరిగాయి. ఈ శిక్షణ తగతులకు తమ్మినేని ముఖ్యఅతిథిగా, ప్రజానాట్య మండలి మాజీ రాష్ట్ర కార్యదర్శి పీఏ.దేవి, ప్రజా యుద్ధ నౌక గద్దర్‌ విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జిల్లెల్ల సిద్దారెడ్డి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో వారు పాల్గొని మాట్లాడారు.

 పేదల హక్కులను కాపాడడానికి 70 సంవత్సరాలుగా ప్రజానాట్య మండలి ప్రజల పక్షాన పోరాటాలు చేస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రంగా చేస్తున్నామని గొప్పలు చెబుతున్నారే తప్ప ఆచరణలో మాత్రం శూన్యమని అన్నారు. ఆనాడు దొరల పాలన విముక్తి కోసం నాట్య మండలి పని చేసినదని, నేడు ఈ ప్రభుత్వాల ఆడగాలను ఆపడానికి మళ్లీ ముందుకు వస్తుందని అన్నారు. తెలంగాణను ఏలుతున్న ప్రభుత్వం నాలుగేళ్లుగా చేసింది ఏమీ లేదన్నారు. దేశంలో అశ్లీలత పెరిగి పోయిందన్నారు. ప్రభుత్వాల మోసాలను అరికట్టడానికి ప్రజానాట్య మండలి ముందుంటుందని అన్నారు. 

గద్దర్‌ ఆటాపాట...
ప్రజానాట్య మండలి బహిరంగ సభలో ప్రజా యుద్ధ నౌక గద్దర్‌ పాడిన పాటలను అందరినీ అలరించినాయి. గద్దర్‌ గజ్జె కట్టి ఆడుతుంటే సభలో ఉన్న వారు అందరూ కోరస్‌ కలిపారు. కార్యక్రమంలో ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి కట్ట నర్సింహా, రాష్ట్ర అధ్యక్షుడు వేముల ఆనంద్, నాయకులు ఆముదాల మల్లారెడ్డి, మోకు కనకారెడ్డి, ఉడుత రవి, బొట్ల శ్రీనివాస్, మునిగల రమేష్, గొల్లపల్లి బాపురెడ్డి, మహబూబ్, సుధాకర్, నర్సింహా, వెంకటేష్, సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.

Read latest Warangal News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా