నిర్వాసితులకు న్యాయం జరిగేలా చర్యలు

21 Jan, 2018 07:39 IST|Sakshi

బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ

పోలవరం రూరల్‌: పోలవరం నిర్వాసితులకు న్యాయం జరిగేలా చూస్తానని రాజమండ్రి బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ హామీ ఇచ్చారు. పోలవరం గ్రామంలో ఆర్థికవేత్త డాక్టర్‌ పెంటపాటి పుల్లారావు నివాసం వద్ద ఉభయగోదావరి జిల్లాల నిర్వాసితుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలవరం జాతీయ ప్రాజెక్టు అని, నిర్వాసితుల సమస్యలు కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని పేర్కొన్నారు.

నిర్వాసితుల మొర
ఈ సందర్భంగా పలువురు నిర్వాసితులు ఆయనకు సమస్యలు వివరించారు. తమకు ఎకరానికి రూ.1.50 లక్షలు చెల్లించి బలవంతంగా భూములు తీసుకున్నారని గోపాలపురం మండలంలో కుడికాలువలో భూములు కోల్పోయిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అదే ప్రాంతంలో మరికొన్ని భూములకు ఎకరానికి రూ.40 లక్షల వరకు చెల్లించారని వెల్లడించారు.  తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో మామిడి తోటలకు ఎకరానికి రూ.35వేలు చెల్లించారని పలువురు రైతులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. పోలవరం మండలంలో నిర్వాసితులు గ్రామాలు ఖాళీ చేసే సమయంలో హామీ పత్రాలు ఇచ్చి కూడా అధికారులు తమ సమస్యలు పరిష్కరించలేదని కారం చెల్లాయమ్మ వివరించింది.

కేంద్రం నుంచి అధికారులు, నాయకులు పోలవరం సందర్శనకు వచ్చిన సమయంలోనూ తమ గోడు చెప్పుకుందామన్నా అవకాశం లేకుండా పోతోందని, వారిని కలవకుండా అధికారులు అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. ఆర్థికవేత్త పుల్లారావు మాట్లాడుతూ నిర్వాసితులకు కేంద్రం చట్ట ప్రకారం న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. అటవీహక్కుల చట్టం, 2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితుల భూములకు న్యాయమైన నష్టపరిహారం ఇవ్వాలన్నారు. ప్రతి కుటుంబానికీ ఒక ఉద్యోగం ఇవ్వాలని,  లేదా జీవన భృతి కల్పించాలని కోరారు.  పోలవరం నిర్మాణం వల్ల 5 లక్షల మంది నిర్వాసితులు అవుతున్నారని వివరించారు. అన్ని పార్టీల సహకారంతో నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి తాను పోరాటం చేస్తానని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు