వైద్యుల మెడపై ఎన్‌ఎంసీ కత్తి

4 Jan, 2018 12:43 IST|Sakshi

ఎంసీఐ స్థానంలో ఎన్‌ఎంసీ ఏర్పాటుకు కసరత్తు

స్వతంత్రత కోల్పోతామంటున్న వైద్యులు

జిల్లావ్యాప్తంగా ఆందోళనలు

పశ్చిమగోదావరి, తణుకు: ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎంసీఐ)ను రద్దు చేసి నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) బిల్లును కేంద్ర ప్రభుత్వం స్టాండింగ్‌ కమిటీకి పంపడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ చట్టం కార్యరూపం దాల్చితే నేషనల్‌ కమిషన్‌కు చైర్మన్‌ తోపాటు సభ్యులను ప్రభుత్వమే నా మినేట్‌ చేస్తుంది. ఈ బిల్లు ద్వారా గ్రాడ్యుయేషన్‌ వైద్య విద్యకు ఒక బోర్డు, పీజీ వైద్యవిద్యకు మరో బోర్డు వైద్య విద్యాసంస్థల గుర్తింపు, సమీక్షలకు మరో బోర్డు, వైద్యుల రిజిస్ట్రేషన్‌కు వేరొక బోర్డు ఇలా వేర్వేరుగా ఏర్పాటవుతాయి. అయితే కేంద్రం ప్రతిపాదిస్తున్న నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ స్వతంత్రంగా వ్యవహరించలేదని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైద్యులు కాని వారితో మొత్తం కమిషన్‌ను ఏర్పాటు చేసే అవకాశం ఉందని వారంటున్నారు. ఈ పరిస్థితుల్లో రోగులు, వైద్యుల ప్రయోజనాలు కాకుండా కార్పొరేట్‌ ఆసుపత్రుల ప్రయోజనాలకే పెద్ద పీట వేసినట్లు అవుతుందని వైద్యులు ఆరోపిస్తున్నారు.

రాజకీయ దురుద్దేశంతో..
దేశవ్యాప్తంగా రిజిస్టర్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్లుగా పిలువబడుతున్న వైద్యులంతా కలిసి సభ్యులను ఎన్నుకుని మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఏర్పాటు చేస్తుంటారు. ఈ కౌన్సిల్‌ ద్వారా వైద్య విద్య,  వైద్యుల రిజిస్ట్రేషన్‌ వంటివి పర్యవేక్షిస్తుంటుంది. అయితే ప్రస్తుతం ఈ విధానంలో లోపాలు ఎత్తిచూపుతూ రాజకీయ దురుద్దేశంతోనే ఎంసీఐను రద్దు చేసి ఆ స్థానంలో ఎన్‌ఎంసీ ఏర్పాటు చేయాలని కేంద్రం ఇటీవల బిల్లును కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. ఈ విధానంలో స్వయంప్రతిపత్తిని కోల్పోవడంతో పాటు పూర్తిస్థాయి అధికారాలు రాజకీయ నాయకుల చేతిలోకి వెళ్లనున్నాయి. దీంతో వైద్య కళాశాల ఏర్పాటు, ఫీజుల వసూళ్లపై నియంత్రణ ఉండదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైద్యవిద్యలో ప్రైవేట్‌ రంగంలో పెద్దఎత్తున ఫీజులపై నియంత్రణ ఎత్తివేసి తద్వారా ఎన్‌ఎంసీ సభ్యుల అవినీతి, స్వలాభాలకు గేట్లు తెరిచినట్లు అవుతుందని వైద్యులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే బ్రిడ్జి కోర్సుల పేరుతో అర్హత లేనివారిచే వైద్యం చేయించి ప్రజా రోగ్యంతో ప్రభుత్వాలు చెలగాటమాడుతున్నాయని వారంటున్నారు. కనీస విద్యార్హత లేని ఆర్‌ఎంపీ, పీఎంపీలకు శిక్షణ అంటూ ప్రజారోగ్యాన్ని పణంగా పెడుతోందని విమర్శిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లాలోని వైద్యులు ఆందోళనకు దిగారు. దశలవారీగా ఉద్యమాన్ని ఉదృతం చేసేందుకు ప్రణాళికలు చేపట్టారు. ఇందులో భాగంగానే మంగళవారం దేశవ్యాప్తంగా వైద్యసేవలు నిలిపివేసి తమ నిరసన తెలిపారు. రాబోయే రోజుల్లో భవిష్యత్తు కార్యాచరణ రూపొందించి మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.

పెరగనున్న ఫీజులు
జిల్లాలోని ఏలూరు ఆశ్రం కాలేజీ ద్వారా ఏటా 150 మంది ఎంబీబీఎస్‌ గ్రాడ్యుయేట్లు బయటకు వస్తున్నారు. అంతేకాకుండా జిల్లాకు చెందిన సుమారు 1,500 మంది ఏటా మెరిట్‌ను బట్టి రాష్ట్రంలోని పలు వైద్యకళాశాలల ద్వారా ఎంబీబీఎస్‌ పట్టా పొందుతున్నారు. ప్రస్తుతం జిల్లాలోని సుమారు 20 ఐఎంఏ శాఖల ద్వారా దాదాపు 1,200  మంది వైద్యులు ఆయా విభాగాల్లో వైద్యవృత్తిలో కొనసాగుతున్నారు. ఈ చట్టం కార్యరూపం దాల్చితే ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో ఫీజులు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఆయా కాలేజీల్లో ఎంబీబీఎస్‌ సీట్లలో 60 శాతం మేర కాలేజీ యాజమాన్యాలే అమ్ముకునే అవకాశం ఉంటుంది. ఎంబీబీఎస్‌ పాసైన ప్రతి విద్యార్థి ప్రాక్టీస్‌ చేయాలంటే మరో పరీక్ష రాయాల్సి ఉంటుంది. వంద పరీక్షలు రాసి పాసైతే తప్ప ఎంబీబీఎస్‌ పట్టా చేతికి రాదు. మరో పరీక్ష రాయడమంటే అదనపు భారం తప్ప పెద్దగా ప్రయోజనం ఉండదని వైద్య విద్యార్థులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఆయుర్వేదం, హోమియో చదివే విద్యార్థులు కొత్తగా ప్రవేశపెట్టే బిల్లుతో మోడ్రన్‌ మెడిసిన్‌ ప్రాక్టీస్‌ చేసే అవకాశం ఉంటుంది. ఎన్‌ఎంసీ బిల్లు కార్యరూపం దాల్చితే వైద్యప్రమాణాలు పడిపోయే ప్రమాదం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వైద్య విద్య సామాన్యులకు అందకుండా పోతుందని వారంటున్నారు.

వాపసు తీసుకోవాలి
వైద్యరంగ ప్రాతినిధ్యాన్ని నామమాత్రం చేసేలా రూపకల్ప న చేసిన నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) బిల్లును సత్వరమే వాపసు తీసుకోవాలి. దేశ ఆరోగ్య విధానాలు రూపకల్పనలో భారత వైద్య మండలి (ఎంసీఐ) వంటి సంస్థలను భాగస్వాములను చేయాలి. ఆయుర్వేదం, హోమియో వైద్యులంతా ఏడాది సాధారణ శిక్షణ పొంది అల్లోపతి వైద్యం (ఇంగ్లిష్‌ వైద్యం) చేసేందుకు అనుమతించడం నిబంధనలకు విరుద్ధం. దీని వల్ల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు దూరమవుతాయి. –డాక్టర్‌ జేవీవీఎన్‌ ప్రసాద్, కార్యదర్శి, ఐఎంఏ, తణుకు

మరిన్ని వార్తలు