అరచేతిలో టీటీడీ సేవలు

5 Feb, 2018 13:45 IST|Sakshi
గోవింద మొబైల్‌ అప్లికేషన్‌

గోవింద పేరుతో మొబైల్‌ అప్లికేషన్‌

పశ్చిమగోదావరి, నిడమర్రు: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనార్థం విచ్చేస్తున్న భక్తులకు టీటీడీ అనేక సౌకర్యాలు కల్పిస్తుంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త మొబైల్‌ అప్లికేషన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక నుంచి తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు కావాలంటే టీటీడీ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఈ యాప్‌ ద్వారా ఎ ప్పుడైనా.. ఎక్కడి నుంచైనా స్వామి దర్శనం టికెట్లు ఆన్‌లైన్‌లో బుక్‌చేసుకోవచ్చు. ఆ వివరాలు మీకోసం..

గోవింద యాప్‌తో..
గోవింద అనే మొబైల్‌ యాప్‌తో టీటీడీ సేవలు సులువుగా పొందవచ్చు. ఈ యాప్‌ను గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. యాప్‌ ద్వారా శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు, గదు ల బుకింగ్, ఈ– హుండీ, ఈ– డొనేషన్‌ సౌకర్యాలు అందుబాటులోకి తీసుకువచ్చారు. టీసీ ఎస్‌ సౌజన్యంతో తిరుమల తిరుపతి దేవస్థానం యాప్‌ను రూపొందించింది. దర్శనం ఖాళీగా ఉన్న రోజులు, సమయాలను మొబైల్‌లో చూ సుకుని టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు. 

రిజిస్ట్రేషన్‌ వివరాలు
గూగుల్‌ ప్లేస్టోర్‌లో ‘గోవింద–తిరుమల తిరుపతి’ అని ఆంగ్ల అక్షరాల్లో టైప్‌ చేసి గోవింద నామాలతో ఉన్న ముఖచిత్రం గల యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని, ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి.
అనంతరం కనిపించే యాప్‌ ముఖచిత్రం కింది భాగంలో రిజిస్ట్రేషన్‌ కాలం వద్ద క్లిక్‌ చేయాలి.
అక్కడ కనిపించే కాలమ్‌లో మీపేరు, చిరునామా, పిన్‌కోడ్, గుర్తింపు టైపు, గుర్తింపు కార్డు నంబర్‌ నమోదు చేయాలి.
పాన్‌ కార్డ్, రేషన్‌ కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్‌ లైసెన్స్, ఓటర్‌ కార్డ్, ఆధార్‌ కార్డుల్లో ఏదో ఒకదానిని ఎంపిక చేసుకోవాలి. ఆ కార్డు సంఖ్య ఎంటర్‌ చేయాలి.
తర్వాత యూజర్‌ నేమ్‌ కాలమ్‌లో వినియోగంలో ఉన్న మీ ఈ– మెయిల్‌ ఐడీ మాత్రమే నమోదు చేయాలి. తర్వాత  8 క్యారెక్టర్స్‌ పైబడిన పాస్‌వర్డ్‌ క్రియేట్‌ చేసుకోవాలి (పాస్‌వర్డ్‌లో ఆంగ్ల అక్షరాలు, అంకెలు, స్టార్, యాష్‌ వంటి గుర్తులు కలిగి ఉండేలా చూసుకోవాలి).
మీ మొబైల్‌ నంబర్‌ను నమోదు చేసి సబ్మిట్‌ బటన్‌ క్లిక్‌ చేస్తే రిజిస్ట్రేషన్‌ పూర్తవుతుంది.
గమనిక: గూగుల్‌ ప్లేస్టోర్‌లో టీటీడీ ఆన్‌లైన్‌ బుకింగ్‌ పేరుతో అనేక మొబైల్‌ అప్లికేషన్‌ కనిపిస్తున్నాయి. అయితే ‘గోవింద– తిరుమల తిరుపతి’ అనే యాప్‌ మాత్రమే టీటీడీ అధికారిక యాప్‌ అని గమనించాలి.

దర్శనం టికెట్ల బుకింగ్‌ ఇలా..
యూజర్‌ నేమ్, పాస్‌వర్డ్‌తో యాప్‌లోకి లాగిన్‌ అవ్వాలి. దర్శనం ఆప్షన్‌ క్లిక్‌ చేసి వివరాలు నమోదు చేయాలి. యాప్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వ్యక్తితో పాటు మరో తొమ్మిది మంది వరకూ టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు. అందరి ఆధార్‌ నంబర్లు లేదా గుర్తింపు కార్డుల నంబర్లు నమోదు చేయాలి.  
దర్శనంతోపాటు ప్రత్యేక పూజల వివరాలు కూడా కనిపిస్తాయి.  
దర్శనం / పూజ అనంతరం ప్రతి ఒక్కరికీ రెండు అదనపు లడ్డూల చొప్పున యాప్‌ ద్వారానే బుక్‌ చేసుకోవచ్చు. ప్రతి లడ్డూకు రూ.25 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
చెల్లింపులు సులభం
టికెట్లకయ్యే ఖర్చులను యాప్‌ ద్వారానే చెల్లించవచ్చు. దర్శనం టికెట్‌ ధర ఒక్కొక్కరికి రూ.300 చొప్పున చెల్లించాలి. ఆన్‌లైన్‌  / ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌ తోపాటు క్రెడిట్‌ / డెబిట్‌ కార్డుల ద్వారా చెల్లించవచ్చు.
బ్యాంక్‌ వివరాలు యాప్‌లో డిస్‌ప్లే అవుతున్నాయి. దాని ప్రకారం  భక్తుల సంఖ్య, లడ్డూలు, ప్రత్యేక పూజలకు చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించవచ్చు. 

మరిన్ని వార్తలు