దివ్యాంగులకు దిక్సూచి

22 Jan, 2018 11:03 IST|Sakshi
ఆశ్రమ పాఠశాల వ్యవస్థాపక అధ్యక్షుడు కాగిత భాస్కరరావుకు సాక్షి ఎక్స్‌లెన్స్‌ అవార్డు అందజేస్తున్న బరకాదత్‌

విధి చిన్నచూపు చూసినా అతడు కుంగిపోలేదు. వైకల్యం శరీరానికే కానీ మనసుకు కాదని నిరూపించాడు. పేదరికాన్ని జయించి చదువుకుని రైల్వేలో ఉద్యోగం సంపాదించాడు. తనలా శారీరక వైకల్యంతో బాధపడుతున్న వారిని ఆదుకోవాలనేఆశయంలో ఉద్యోగాన్ని వదిలి దివ్యాంగులకు అండగా నిలుస్తున్నారు దేవరపల్లికి చెందిన కాగిత భాస్కరరావు. గొల్లగూడెం వద్ద ఆశ్రమం స్థాపించి 56 మందికి ఆశ్రయం కల్పిస్తున్నారు.

దేవరపల్లి : పోలియో వ్యాధి బారిన పడి రెండు కాళ్లు చచ్చుపడిపోవడంతో మానసికంగా కుంగిపోయాడు దేవరపల్లికి చెందిన కాగిత భాస్కరరావు. చదువుకోవాలనే కోరిక ఉన్నప్పటికీ పేదరికం అడ్డుగా నిలిచింది. అయినా పట్టుదలతో తల్లిదండ్రులను ఒప్పించి ఇంటర్‌ వరకు ప్రభుత్వ కళాశాలలో చదువుకున్నాడు. అనంతరం ఓపెన్‌ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తిచేసి 1994లో దివ్యాంగుల కోటాలో రైల్వే శాఖలో ఉద్యోగం సంపాదించాడు. ఉద్యోగం చేస్తున్నప్పటికీ భాస్కరరావుకు తృప్తి లేదు. సమాజంలో దివ్యాంగులు పడుతున్న ఇబ్బందులను, అవమానాల నుంచి కొంతమదిౖకైనా విముక్తి కల్పించాలని నిర్ణయించుకుని రైల్వే ఉద్యోగానికి రాజీనామా చేశారు. 2004లో భారతి వికలాంగుల సేవా సమితి స్థాపించి లగడపాటి రామలక్ష్మమ్మ వికలాంగుల ఆశ్రమం పేరున దేవరపల్లి మండలం గొల్లగూడెం వద్ద ఆశ్రమం స్థాపించి సేవా కార్యక్రమాలు చేపట్టారు. పాఠశాలలో సుమారు 56 మంది దివ్యాంగులకు ఆశ్రయం కల్పిస్తున్నారు. చదువుతో పాటు మానసిక ఉల్లాసానికి క్రీడలు, వృత్తి విద్యలో శిక్షణ ఇస్తున్నారు. చేతివృత్తులతో పాటు కంప్యూటర్‌ రంగంలో శిక్షణ ఇస్తున్నారు.

దాతల సహకారంతో ఆశ్రమం అభివృద్ధి
ఆశ్రమం అభివృద్ధికి ప్రభుత్వ సహకారం లేకపోయినప్పటికీ దాతల సహకారం లభిస్తోంది. ఉభయగోదావరి జిల్లాలకు చెందిన ఎంతోమంది దాతలు ఆశ్రమాన్ని సందర్శించి విరాళాలు అందజేస్తున్నారు. ఎంతోమంది ధనికులు తమ పిల్లల పుట్టిన రోజు వేడుకలు, పెళ్లి్ల రోజు వేడుకలను ఆశ్రమంలో నిర్వహించి దివ్యాంగులకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తున్నారు. దాదాపు 13 సంవత్సరాలుగా భాస్కరరావు ఆశ్రమాన్ని నిర్వహిస్తూ ఎంతోమంది దివ్యాంగులను అక్కున చేర్చుకుంటున్నారు.

ఆశ్రమం ద్వారా వివిధ సేవలు
ప్రత్యేక విద్య, చేతివృత్తుల శిక్షణ, కంప్యూటర్‌ శిక్షణ, డిజిటల్‌ క్లాసులు, దివ్యాంగులకు ఉచిత హాస్టల్‌ వసతి సౌకర్యం, మెడికల్‌ క్యాంపుల నిర్వహణ, కృత్రిమ కాళ్లు, చేతులు, క్యాలిపర్స్, క్రచ్చెస్, వీల్‌చైర్స్, ట్రైసెకిళ్లు అందజేయుట, దివ్యాంగులకు వివాహ కార్యక్రమాలు నిర్వహించడం, వేసవి కాలంలో మినరల్‌ వాటర్‌తో చలివేంద్రాల ఏర్పాటు, అనాథలకు నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అంతేకాక కన్నబిడ్డల నిర్లక్ష్యానికి గురైన తల్లిదండ్రుల కోసం వృద్ధాశ్రమం స్థాపించి వృద్ధులకు ఆశ్రయం కల్పింస్తున్నారు. తనతో పాటు భార్య భారతి, ఇద్దరు పిల్లలు కూడా ఆశ్రమం సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. భాస్కరరావు కుటుంబమంతా దివ్యాగులు, వృద్ధుల సేవలకే అంకితమై పనిచేస్తున్నారు. నా చివరి శ్వాస వరకు దివ్యాగుల సేవలోనే ఉంటానని భాస్కరరావు అంటున్నారు. వృద్ధుల కోసం దాతల సహకారంతో భవన నిర్మాణం చేస్తున్నారు.

Read latest West-godavari News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా