ఉద్యోగి గ్రాట్యుటీ చెల్లిస్తారు ఇలా..

31 Jan, 2018 11:59 IST|Sakshi

సర్వీసు కాలాన్ని బట్టి లభించే గ్రాట్యుటీ

గ్రాట్యుటీ సొమ్ము రూ.10 లక్షల వరకూ పన్ను రాయితీ

నిడమర్రు: అటు ప్రభుత్వ ఉద్యోగులకు, ఇటు ప్రైవేట్‌ సంస్థల్లో పనిచేసేవారు గ్రాట్యుటీ అందుకుంటారు. దీన్ని ఎలా లెక్కించి ఇస్తారు.. అలాగే గ్రాట్యుటీపై చెల్లించాల్సిన పన్నుపై కూడా అవగాహన ఉండాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. గ్రాట్యుటీపై పన్ను మినహాయింపు పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచుతూ కేంద్ర క్యాబినెట్‌ ఇటీవల నిర్ణయం తీసుకుంది. పార్లమెంటులో ఆమోదం పొందాక ఇది అమల్లోకి వస్తుంది. ఒకే సంస్థలో ఎన్నో ఏళ్లుగా పనిచేసేవారికి ఈ నిర్ణయం పెద్ద ఊరటను కలిగించనుంది. ఉద్యోగంలో చేరే సంస్థ హామీ ఇచ్చిన విధంగా మొత్తం జీతం చేతికందదు. ప్రావిడెంట్‌ ఫండ్, గ్రాట్యుటీలాంటి కోతలుంటాయి. ఈ నేపథ్యంలో గ్రాట్యుటీని ఎలా లెక్కిస్తారు. ఎప్పుడు ఇస్తారు, పన్ను లెక్కింపు ఎలా అన్న విషయాలను తెలుసుకుందాం.

గ్రాట్యుటీ అంటే..
ఒక సంస్థలో 10 కంటే ఎక్కువ మంది పనిచేసేటట్టయితే ఆ సంస్థ పేమెంట్‌ ఆఫ్‌ గ్రాట్యుటీ చట్టం–1972 ప్రకారం ఉద్యోగులకు కొంత సొమ్ము నగదు రూపంలో ఇచ్చే ప్రయోజనాన్నే గ్రాట్యుటీ అంటారు.

ఐదేళ్ల పాటు పనిచేసి ఉండాలి
గ్రాట్యుటీ చెల్లింపుల చట్టం ప్రకారం ఐదేళ్లపాటు ఒకే సంస్థలో ఉద్యోగం చేసి ఉండాలి. పనిచేసిన ప్రతి సంవత్సరానికి 15 రోజుల వేతనానికి సమానమైన సొమ్మును ఇవ్వాలి. వేతనం అంటే ఇక్కడ బేసిక్‌ శాలరీ, డీఏ కలుపుకోవాలి.

పూర్తి సంవత్సరంగా లెక్కింపు
గడచిన సంవత్సరం ఉద్యోగి 6 నెలల కంటే ఎక్కువగా పనిచేస్తే.. గ్రాట్యుటీ చెల్లింపుల కోసం పూర్తి సంవత్సరం పనిచేసినట్టుగా లెక్కిస్తారు. ఉదాహరణకు ఒక వ్యక్తి ఏడేళ్ల 6 నెలలు పనిచేశాడనుకుందాం. ఆ వ్యక్తికి 8 ఏళ్లకు సమానమైన గ్రాట్యుటీని చెల్లిస్తారు.

15 రోజుల వేతనం
గ్రాట్యుటీ చెల్లింపులను లెక్కించేందుకు, ఒక నెలలో పనిదినాలను 26 రోజులుగా చూస్తారు. కాబట్టి 15 రోజులకు సమానమైన వేతనాన్ని.. నెల వేతనం (ఇంటూ) 15/26గా లెక్కిస్తారు. ఇలా వచ్చిన సంఖ్యను ఎన్నేళ్ల సర్వీసు ఉంటే అన్నేళ్లకు లెక్కవేసి గ్రాట్యుటీని చెల్లిస్తారు. పదవీ విరమణ చేసేటప్పుడూ ఇదే లెక్కను అనుసరించి గ్రాట్యుటీ ప్రభుత్వ/సంస్థ చెల్లింపు చేస్తుంది.

సర్వీసులో ఉండగా గతించినట్టయితే..
ఒకవేళ ఉద్యోగి సర్వీసులో ఉండగా మరణిస్తే.. ఐదేళ్ల కనీస పరిమితి వర్తించదు. గ్రాట్యుటీ ప్రయోజనాన్ని నామినీ లేదా చట్టబద్ధ వారసులకు అందజేస్తారు. ఉద్యోగి చివర పనిచేసిన రోజు మొదలుకుని 30 రోజుల్లోపు గ్రాట్యుటీ చెల్లింపులన్నీ జరిగిపోవాలని చట్టం చెబుతోంది. అలా చేయని పక్షంలో అదనంగా వడ్డీ చెల్లించాలని చట్టంలోని నిబంధనలు చెబుతున్నాయి.

సంస్థలు ఎలా చెల్లిస్తాయి..?
సంస్థలు గ్రాట్యుటీని తమ సొంత నిధుల నుంచి లేదా సామూహిక గ్రాట్యుటీ పథకం ద్వారా చెల్లిస్తుంటాయి. గ్రాట్యుటీ కోసం కేటాయించిన నిధులను ఏదైనా బీమా సంస్థ వద్ద ఉంచుతారు. బీమా సంస్థలు గ్రాట్యుటీ నిధిని పెట్టుబడిగా పెట్టి వాటిపై రాబడులు వచ్చేలా చూసుకుంటాయి. మార్కెట్‌ రిస్క్‌ తగ్గించుకునేందుకు సాధారణంగా ఈ నిధులను డెట్‌ లేదా స్థిర ఆదాయాన్నిచ్చే పథకాల్లోనే పెట్టుబడి పెడతారు.

గ్రాట్యుటీపై పన్ను వర్తింపు..
ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. గ్రాట్యుటీని ‘ఇన్‌కమ్‌ ఫారం శాలరీ’ విభాగంలోకి చేర్చారు. ఇన్‌కం ట్యాక్స్‌ యాక్ట్, 1961 ప్రకారం సెక్షన్‌ 10(10) కింద గ్రాట్యుటీ ద్వారా అందే సొమ్ముపై పన్ను ప్రయోజనాలు ఉంటాయి.

ఈ సందర్భాల్లో పూర్తి మినహాయింపు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, స్థానిక ప్రభుత్వ పరిపాలనలోని ఉద్యోగులకు గ్రాట్యుటీపై పూర్తి పన్ను మినహాయింపు ఉంటుంది. ఆదే విధంగా గ్రాట్యుటీ సొమ్మును పదవీ విరమణ తర్వాత అందుకున్నా లేదా సర్వీసులో ఉండగా ఉద్యోగి మరణించినట్టయితే పూర్తి పన్ను మినహాయింపు ఉంటుంది. ప్రస్తుతం రూ.10 లక్షల దాకా అందుకునే గ్రాట్యుటీ సొమ్ముపై పన్ను మినహాయింపు ఉంది.

ఇతర ఆదాయ వనరుల విభాగంలోకి..
ఉద్యోగి మరణించినప్పుడు నామినీకి లేదా చట్టబద్ధ వారసులకు అందించే గ్రాట్యుటీపై పన్ను మినహాయింపు ఉంటుంది. అయితే నామినీగా ఆ ప్రయోజనాన్ని అందుకునేవారు మాత్రం ఆదాయపు పన్ను చట్టం ఇతర ఆదాయ వనరుల విభాగం కిందకి వస్తుంది.

మరిన్ని వార్తలు