ఉత్సాహంగా తెలుగమ్మాయి పోటీలు

12 Jan, 2018 11:33 IST|Sakshi

పట్టు పరికిణీలతో అలరించిన విద్యార్థినులు

సాక్షి, రోటరీ సెంట్రల్‌ క్లబ్‌ సంయుక్త నిర్వహణ

సంక్రాంతి సంబరాలలో భాగంగా నిడదవోలులో గురువారం తెలుగమ్మాయి పోటీలు జరిగాయి. పరికిణి, ఓణీలతో అచ్చు తెలుగింటి అమ్మాయిల్లా విద్యార్థినులు హోయ లొలికించారు.

నిడదవోలు : పట్టు పరికిణీల సందడులు సీతాకోకచిలుకల్ని గుర్తు చేశాయి. అచ్చు తెలుగింటి అమ్మాయిల్లా విద్యార్థినులు పరికిణి, ఓణీలతో హొయలొలికించారు. సంక్రాంతి ప్రాధాన్యతను వివరిస్తూ గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా విద్యార్థుల వేషధారణలు ఆకట్టుకున్నాయి. తెలుగమ్మాయిల పోటీలకు ఉత్సాహంగా తరలివచ్చారు. పట్టు బట్టలు, గాజులు, కళ్లకు కాటుక, కాలి పట్టీలు, వడ్డాణం, పావిట బొట్టు, నుదిటి బొట్టు, గోరింటాకు, పూలతో పాటు ప్రత్యేక వస్త్ర అలంకరణతో విద్యార్థినులు సందడి చేశారు. పట్టణంలోని ఎస్వీడీ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో రోటరీ సెంట్రల్‌ క్లబ్, సాక్షి పత్రిక సంయుక్త ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. దీనిలో భాగంగా విద్యార్థినులకు తెలుగమ్మాయి పోటీలను నిర్వహించారు. ఎస్వీడీ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, బాలికల ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, వికాస్‌ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీలను ప్రిన్సిపల్‌ పి.సరళ, రోటరీ సెంట్రల్‌ క్లబ్‌ అధ్యక్షులు కూచిపూడి వీర వెంకట రామారావులు ప్రారంభించారు.

సుమారు 200 మంది ఉత్సాహంగా పోటీ పడ్డారు. తెలుగమ్మాయి డిగ్రీ సీనియర్స్‌ విభాగంలో కె.నాగ పద్మిని (ఎస్వీడీ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల) ప్రథమస్థానం సాధించింది. కోహిని (వికాస్‌ కళాశాల) ద్వితీయ స్థానం, ఆర్‌.పద్మావతి (ఎస్వీడీ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల) తృతీయ స్థానంలో నిలిచారు. ఇంటర్‌ విభాగంలో అనూష, శైలజ, దేవిదుర్గలు వరుసగా మూడు స్థానాలను సాధించారు. సీనియర్‌ ముగ్గుల పోటీల్లో ఎస్వీడీ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు ఎం.దేవి, ఎ.అనూష, పి.సునీతలు ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలుగా నిలిచారు. జూనియర్స్‌ ముగ్గుల పోటీల్లో ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల విద్యార్థినులు వి.సుప్రియ, వి.మధు, ఏవీ.సాయిలక్ష్మీలు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. ముఖ్య అతిథిగా హాజరైన  మునిసిపల్‌ చైర్మన్‌ బొబ్బా కృష్ణమూర్తి చేతుల మీదుగా విజేతలకు బహుమతులు, మెమెంటోలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా చైర్మన్‌ కృష్ణమూర్తి మాట్లాడుతూ మన సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టేలా తెలుగమ్మాయి పోటీలను నిర్వహించిన సాక్షి, రోటరీ సెంట్రల్‌ క్లబ్‌ సభ్యులను అభినందించారు. తెలుగు సంప్రదాయాలను వివరిస్తూ నేలపాటి సువర్ణ చేసిన యాంకరింగ్‌ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో రోటరీ సెంట్రల్‌ క్లబ్‌ అధ్యక్షుడు కూచిపూడి వీర వెంకట రామారావు, ప్రిన్సిపల్స్‌ పి.సరళ, శ్రీనివాసరావు, కార్యదర్శి వీడీ గంగాధరరావు, కోశాధికారి చింతల కిషోర్, అసిస్టెంట్‌ గవర్నర్‌ ముళ్ళపూడి వెంకట్రావు, జిల్లా కార్యదర్శి గాలి రాఘవయ్య, బీఎన్‌వీ ప్రసాదరావు, కె.మోహన్‌బాబు, ముళ్ళపూడి హరిశ్ఛంద్రప్రసాద్, జీఎన్‌వీ ప్రసాద్, బండి వేణుగోపాలకృష్ణ, ఈదల నాగేశ్వరరావు, చుండ్రు అమ్మిరాజు, సింహాద్రి సాయిబాబా, సింహాద్రి శ్రీనివాస్, నీరుకొండ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. న్యాయ నిర్ణేతలుగా ఎం.శ్రీలక్ష్మి, ఉషారాణి, బి.శాంతిశేషు, గాలి ఈశ్వరి, కె.భువనేశ్వరి వ్యవహరించారు.

మరిన్ని వార్తలు