మీడియా సమక్షంలోనే అధికారికి కిమ్‌ మరణశిక్ష?

12 Sep, 2018 18:12 IST|Sakshi

సామాజిక మాధ్యమాల్లో ఏదైనా వీడియో ఇంట్రస్టింగ్‌గా కనిపిస్తే చాలు నెటిజన్లు షేర్లు, కామెంట్‌లు లైకులతో హోరెత్తిస్తుంటారు. అందులో నిజం ఎంత, అబద్ధం ఎంత అనే విషయాల గురించి ఆలోచించకుండానే తమకు తోచిన కామెంట్లు పెట్టి మరీ షేర్‌ చేస్తుంటారు. అప్పుడప్పుడు కొన్ని చారిత్రక ఘట్టాలు కూడా మార్ఫింగ్‌కు గురై వైరల్‌ అవుతుంటాయి. 

ఉత్తర కొరియాలో అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తన హయాంలో అవినీతి అధికారికి మీడియా సమక్షంలోనే మరణశిక్ష ఎలా విధించారో చూడండి.. అంటూ ఓ వీడియో ఇప్పుడు సమాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. కేవలం 12 సెకన్ల వీడియోలో కిమ్‌ మరో వ్యక్తికి కరచాలనం చేసి నవ్వుతూ పలకరిస్తారు. అనంతరం నడుస్తు ఓ ప్రదేశానికి వెళ్లగానే అక్కడ ఇదివరకే ఏర్పాటు చేసిన ఓ పెద్ద గుంతలో సదరు వ్యక్తి పడిపోయి, వెంటనే డోర్లు మూసుకుంటాయి. తర్వాత సింపుల్‌గా కిమ్‌ అక్కడి నుంచి వచ్చేస్తాడు. అంతేనా ఇదంతా మీడియా సమక్షంలోనే జరగడంతో రిపోర్టర్లు కూడా వామ్మో అంటూ ఓ లుక్కిస్తారు. ఆ వీడియోను మీరు ఓసారి చూసెయ్యండి.

వామ్మో అవినీతికి మరీ ఇంత పెద్ద శిక్ష వేశాడా కిమ్‌ అంటూ ఆయన గురించి తెలిసివాళ్లు ముక్కున వేలేసుకుంటుంటే, మరికొందరేమో అవినీతికి సరైన శిక్ష అంటూ కామెంట్లు పెడుతున్నారు.

అసలు ఏం జరిగిందంటే..
ఫన్‌ మూమెంట్స్‌ అనే ఓ సెటైరికల్‌ యూట్యూబ్‌ చానెల్‌ వాళ్లు ఈ వీడియోను తయారు చేశారు. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌తో వీడియోలో కనిపించిన వ్యక్తి దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌జే ఇన్. అతనేమీ ఉత్తర కొరియాకు చెందిన అవినీతి అధికారి కాదు. గత ఏప్రిల్‌లో ఇంటర్‌ కొరియన్‌ సమ్మిట్‌లో భాగంగా ఈ ఇద్దరు నాయకులు కలుసుకున్నారు. ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య చోటుచేసుకున్న ఓ అరుదైన చారిత్రక ఘట్టాన్నే ఫన్‌ మూమెంట్స్‌ యూట్యూబ్‌ చానెల్‌ తన క్రియేటివిటీని జోడించి పై వీడియోను తయారు చేసింది. ఉత్తర కొరియా, దక్షిణ కొరియా సైనిక సరిహద్దుల్లో అధినేతలు కరచాలనం చేసుకుని ఒకరి భూభాగంలోకి మరొకరు అడుగుపెట్టారు. ఇది ఉభయ కొరియా దేశాల మధ్య సానుకూల వాతావరణానికి సంకేతంగా నిలిచింది. తమ తమ ప్రతినిధి బృందంతో కలిసి ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌జే ఇన్ గంటన్నరపాటు సమావేశమయ్యారు. అణునిరాయుధీకరణను లక్ష్యంగా పెట్టుకున్నామని, కొరియా భూభాగంలో చిరకాల శాంతిని నెలకొల్పేందుకు తాము కలిసి పనిచేస్తామని వారిరువురు ప్రకటించారు. 1953లో జరిగిన కొరియా యుద్ధానంతరం 65 ఏళ్లలో కొరియా దేశాల మధ్య చర్చలు జరుగడం ఇది మూడోసారి కాగా, ఉత్తర కొరియా అధినేత దక్షిణ కొరియాలో అడుగుపెట్టడం అదే ప్రథమం. ఇరుదేశాలను వేరుచేసే సైనిక విభజనరేఖ వద్ద ఉన్న పన్‌ముంజోమ్ వారి కలయికకు వేదికైంది. ఇరుదేశాల మధ్య ఉన్న చిన్న దారికి అటువైపు నిలబడిన కిమ్‌ను తమ దేశంలోకి ఆహ్వానించేందుకు మూన్ ముందుకువెళ్లారు. అయితే ముందుగా మా దేశంలోకి వెళ్దామంటూ కిమ్ ఆయనను తోడ్కోని తమ భూభాగంలోకి తీసుకెళ్లారు. ఇరువురు నేతలు ఒకరిచేతులు మరొకరు పట్టుకుని కొంతదూరం నడిచారు. తర్వాత దక్షిణ కొరియాలో అడుగుపెట్టారు. చిరునవ్వు చిందిస్తూ మూన్‌తో కరచాలనం చేసిన కిమ్.. ఇది భావోద్వేగ కలయిక అని పేర్కొంటే, మూన్ కూడా చిద్విలాసంగా కరచాలనం చేస్తూ.. ఇలా కలువడం సంతోషంగా ఉందని అన్నారు. అప్పటి వీడియోను మీరు ఓ లుక్కేయండి..

మరిన్ని వార్తలు