అమెరికా ఎంబసీ వద్ద పేలుడు

26 Jul, 2018 14:13 IST|Sakshi

బీజింగ్‌: చైనా రాజధాని బీజింగ్‌లోని అమెరికా రాయబార కార్యాలయం వద్ద గురువారం బాంబు పేలుడు సంభవించింది. ఎంబసీ సమీపంలో పేలుడు శబ్దాలు వినిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారమందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకునిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పేలుడుకు పాల్పడింది చైనాలోని టోంగ్లియో ప్రాంతానికి చెందిన 26ఏళ్ల జియాంగ్‌గా గుర్తించారు. 

జియాంగ్‌ అమెరికా రాయబార కార్యాలయం ఎదుట బాంబు దాడికి యత్నించగా, బాంబు తీవ్రత తక్కువగా ఉండటంతో నిందితుడు మినహా ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని చైనా పోలీసులు తెలిపారు. నిందితుడి పూర్తి వివరాలను దాడికి గల కారణాలను పోలీసులు వెల్లడించలేదు. ఈ ఘటన జరిగిన ప్రాంతానికి కొద్ది దూరంలోనే భారత ఎంబసీ కూడా ఉంది. పేలుడు అనంతరం ఎంబసీ సమీపంలో దట్టమైన పొగ అలుముకున్న ఫోటోలు సామాజికమాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. పేలుడు జరిగిన కొద్ది సమయంలోనే ఎంబసీ కార్యకలాపాలను పునరుద్దరించారు.

>
మరిన్ని వార్తలు