ఐఫోన్‌ 8 కోసం సింగపూర్‌ వెళ్లి..

23 Sep, 2017 20:51 IST|Sakshi

సింగపూర్‌: కుమార్తెకు గిఫ్ట్‌గా ఐఫోన్‌-8 ఇచ్చేందుకు ఓ భారతీయుడు ఏకంగా సింగపూర్‌కు వెళ్లారు. అక్కడ ఏకంగా 13 గంటలపాటు క్యూలో ఉండి అక్కడ ఐఫోన్‌ సాధించిన మొదటి వ్యక్తి అయ్యారు. సింగపూర్‌ డెయిలీ తెలిపిన వివరాలివీ... అమిన్‌ అహ్మద్‌ ధోలియా(43) అనే భారతీయ వ్యాపారవేత్త కుమార్తె వివాహం త్వరలోనే జరుగనుంది. దీంతో ఆయన తన కుమార్తెకు ఇటీవలే విడుదలైన ఐఫోన్‌-8 ను గిఫ్ట్‌గా ఇవ్వాలనుకున్నారు. ఇండియాలో ఐఫోన్‌ రిలీజ్‌ కాకపోవటంతో సింగపూర్‌ ప్రయాణమయ్యారు. గురువారం రాత్రి 7 గంటలకు సింగపూర్‌ నగరంలోని ఆర్చార్డ్‌ రోడ్డులో ఉన్న యాపిల్‌ స్టోర్‌కు చేరుకున్నారు.

ఆ రాత్రంతా అక్కడే క్యూలో నిలబడిన ఆయన, శుక్రవారం ఉదయం 8 గంటలకు స్టోర్‌ తెరుచుకునే వరకు అక్కడే ఉండి మొదటి ఫోన్‌ను అందుకున్నారు. కాగా ఆయన వెనుక క్యూలో పలువురు విదేశీయులు సహా 200మంది ఉన్నారు. రాత్రంతా క్యూలో నిలబడి ఉండటం జీవితంలో ఇదే మొదటిసారని ధోలియా అన్నారు. అనుకున‍్నట్లు ఐఫోన్‌ను సాధించినందుకు సంతోషంగా ఉందని, కానీ రాత్రి వేళ అన్ని గంటలపాటు క్యూలో ఉండటం కష్టసాధ్యమేనన్నారు. కాగా, టెల్కో కాంట్రాక్టు ఫలితంగా సింగపూర్‌ వాసులకు ఐఫోన్లు సబ్సిడీ ధరకే లభిస్తున్నాయి. ఇదిలా ఉండగా సదరు భారతీయ వ్యాపార వేత్త పూర్తి వివరాలు తెలియరాలేదు.
 

మరిన్ని వార్తలు