ఫిబ్రవరి 15, 16న దుబాయిలో 'లోక కేరళ సభ'

7 Feb, 2019 15:16 IST|Sakshi

‘లోక కేరళ సభ’ (ప్రపంచ కేరళ వేదిక) ప్రాంతీయ సమావేశం ఫిబ్రవరి 15, 16న దుబాయిలో నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న కేరళీయులను మాతృభూమి కేరళతో సాంస్కృతిక, సాంఘిక, రాజకీయ, ఆర్థికంగా అనుసంధానపరిచే యోచనతో ‘లోక కేరళ సభ’ (ఎల్‌కేఎస్‌)ను కేరళ రాష్ట్ర ప్రభుత్వం 2018లో ఏర్పాటు చేసింది. ఇందులో కేరళ రాష్ట్రానికి చెందిన అందరు ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటూ, కేరళకు చెందిన 100 మంది ప్రవాస భారతీయులు, భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలో నివసిస్తున్న 40 మంది కేరళ ప్రవాసులు, వివిధ రంగాలలో నిష్ణాతులైన 30 మంది కేరళ మేధావులు మొత్తం 351 మంది సభ్యులుంటారు. ప్రవాసీ కేరళీయుల కష్టాలను, ఆకాంక్షలను తెలుపుకోవడానికి, వారి నైపుణ్యాన్ని, అనుభవాన్ని రాష్ట్రాభివృద్ధికి వాడుకోవడానికి ఈ వేదిక ఉపయోగపడుతుంది. 

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, అసెంబ్లీ స్పీకర్ శ్రీరామక్రిష్ణన్, అసెంబ్లీలో ప్రతిపక్షనేత రమేష్ చెన్నితలతో సహా ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేరళ ప్రవాసీ ప్రముఖులు, ప్రపంచవ్యాప్తంగాఉన్న 200 కు పైగా ఎల్‌కేఎస్‌ సభ్యులు (65 మంది గల్ఫ్ నుండి) తో సహా 1500 మంది దుబాయి సభకు హాజరవుతారు. ఈ సందర్బంగా నెలవారీ ఆదాయాన్నిచ్చే ప్రవాసి డివిడెండు పథకంతో సహా నాలుగు సంక్షేమ పథకాలను ప్రకటించనున్నారు. ఉపాధినిచ్చే నైపుణ్యాలు, పార్థీవ దేహాల తరలింపు, పునరావాసం తదితర ఏడు ముఖ్యమైన విషయాలపై చర్చిస్తారు. 

-మంద భీంరెడ్డి +91 98494 22622 

మరిన్ని వార్తలు