అధ్యక్ష ఎన్నికల్లో ఎమర్సన్‌ మునగాగ్వా విజయం

3 Aug, 2018 09:09 IST|Sakshi

హరారే : జింబాబ్వే అధ్యక్ష ఎన్నికల్లో అధికార జింబాబ్వే ఆఫ్రికన్‌ నేషనల్‌ యూనియన్‌–పేట్రియాటిక్‌ ఫ్రంట్‌ (జాను-పీఎఫ్‌)పార్టీ విజయం సాధించింది. ప్రస్తుత అధ్యక్షుడు ఎమర్సన్‌ మునగాగ్వా(75) విజయం సాధించారని దేశ ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎమర్సన్‌ మునగాగ్వాకు 50.8 శాతం ఓట్లు రాగా, ప్రతిపక్ష నాయకుడు నెల్సన్ చమీసాకు 44.3 శాతం ఓట్లు వచ్చాయి. 50 శాతానికి పైగా స్వల్ప ఓట్లు సాధించటంతో రెండో దఫా ఎన్నికలను ఎమర్సన్‌ మునగాగ్వా తప్పించుకున్నారు.

రెండోసారి జింబాబ్వే అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు జింబాబ్వే ప్రజలకు ఎమర్సన్‌ కృతజ్ఞతలు తెలిపారు. పోలింగ్‌ సమయంలో ప్రజలు వర్గాలుగా విభజించబడినా.. మనందరి కలలను సాకారం చేసుకోవడానికి ఐకమత్యంతో కలుసుందామని పిలుపునిచ్చారు. ఇదో కొత్త ఆరంభం అంటూ అభివర్ణించారు. ప్రేమ, శాంతి, ఐకమత్యంతో అందరం కలిసి కొత్త జింబాబ్వేని నిర్మిద్దామని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
 

గతేడాది నవంబర్‌లో జింబాబ్వేను 37 ఏళ్ల పాటు పరిపాలించిన రాబర్ట్ ముగాబేను పదవి నుంచి తొలగించిన తర్వాత ఆ దేశంలో జరిగిన తొలి ఎన్నికలు ఇవే. ఈ ఎన్నికల్లో అధికార జాను-పీఎఫ్ పార్టీకి 144 స్థానాలు, ఎండీసీ కూటమికి 64 స్థానాలు, నేషనల్ పాట్రియాటిక్ ఫ్రంట్‌కు ఒక స్థానం లభించాయి.

>
మరిన్ని వార్తలు