కష్టపడి దొంగను కాపాడిన పోలీసులు

13 Dec, 2018 16:27 IST|Sakshi

కాలిఫోర్నియా : దొంగతనం చేయడం అంటే అంత ఈజీ ఏమీ కాదు. అది కూడా ఓ ఆర్టే. దానికీ ఎన్నో ప్లాన్లు వేయాలి. ఎంతో శ్రమించాలి. ఎంతో గ్రౌండ్ వర్క్ చేయాలి. ఆ తర్వాతే రంగంలోకి దిగాలి. లేదంటే దొంగతనం చేయడం పక్కన పెడితే, అడ్డంగా బుక్కవుతారు. అమెరికాలో కాలిఫోర్నియాలోని శాన్‌లొరేంజోలో ఓ వ్యక్తి దొంగతనం చేయడానికి వచ్చి ఎవరి ప్రమేయం లేకుండానే ప్రాణాపాయ స్థితిలో చిక్కుకున్నాడు. చివరికి పోలీసులే వచ్చి కాపాడటంతో బతికిబట్టకట్టాడు.

ఓ 29 ఏళ్ల దొంగ రెస్టారెంట్లలో కిచెన్‌లో గాలి బయటికి వెళ్లేందుకు ఏర్పాటు చేసే రంధ్రాన్ని(గ్రీజ్ వెంట్‌) చోరీ చేయడానికి ఉపయోగించాలనుకున్నాడు. అంతే దగ్గర్లోని ఓ చైనీస్ ఫుడ్‌ రెస్టారెంట్‌లో గ్రీజ్ వెంట్‌ సహాయంతో చోరీ చేయడానికి ప్రయత్నించాడు. అయితే దాంట్లో దూరడానికి ప్రయత్నించి అందులోనే ఇరుక్కుపోయాడు. ఎటూ కదలలేని స్థితిలో రెండు రోజులపాటూ అందులోనే ఉన్నాడు. ఇక చివరికి చేసేదేమీ లేక సహాయం కోసం ఆర్థించడంతో.. అతని మూలుగుడు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గ్రీజు, ఆయిల్‌ అంటుకుని మెటల్‌ షీట్‌లో ఇరుక్కుపోయిన అతన్ని బయటకు తీయడానికి పోలీసులు దాదాపు గంటకుపైగా కష్టపడాల్సి వచ్చింది. డీహైడ్రేషన్‌కు గురైన అతడిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. గ్రీజ్ వెంట్‌లో ఇరుక్కున్న దొంగఫోటోలను పోలీసులు సామాజికమాధ్యమాల్లో పోస్ట్‌ చేయడంతో ఇప్పుడవి వైరల్‌ అయ్యాయి.

మరిన్ని వార్తలు