ఇమ్రాన్‌ ప్రమాణస్వీకారానికి సిద్ధూ

17 Aug, 2018 18:30 IST|Sakshi

లాహోర్: మాజీ ఇండియన్ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ శుక్రవారం పాకిస్థాన్ వెళ్లారు. తన స్నేహితుడు ఇమ్రాన్‌ఖాన్ పాక్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో సిద్ధూ ప్రత్యేక ఆహ్వానితునిగా అక్కడికి వెళ్లారు. వాఘా సరిహద్దు మీదుగా లాహోర్‌ అడుగుపెట్టిన సిద్దూ అక్కడి నుంచి శనివారం ప్రమాణస్వీకారోత్సవం జరిగే ఇస్లామాబాద్‌కు వెళ్లనున్నారు. ఇండియా దూతగా ఓ ప్రేమ సందేశంతో తాను పాకిస్థాన్ వచ్చినట్లు సిద్ధూ మీడియాతో చెప్పారు. 'నేను ఇక్కడికి ఓ రాజకీయ నేతగా రాలేదు. కేవలం ఓ స్నేహితుడిగా వచ్చాను. నా స్నేహితుడి సంతోషంలో పాలుపంచుకోవడానికి వచ్చా' అని సిద్ధూ అన్నారు. క్రీడాకారులు, కళాకారులు రెండు దేశాలను దగ్గరికి తీసుకురావడంలో సాయపడ్డారని ఆయన చెప్పారు. 

మాజీ ప్రధాని వాజ్‌పేయి మాటలను ఈ సందర్భంగా సిద్ధూ గుర్తుచేశారు. మన పొరుగింట్లో మంట పుడితే ఆ వేడి మనకు తగులుతుంది అని వాజ్‌పేయి అన్న మాటలను సిద్ధూ చెప్పారు. బలహీనతలను బలంగా మార్చుకునే సామర్థ్యం ఇమ్రాన్‌ఖాన్‌కు ఉందని, ఆయనను పాకిస్థాన్ సామరస్యానికి ప్రతీకగా చూస్తున్నట్లు తెలిపారు. ఇమ్రాన్‌ఖాన్‌కు బహుమతిగా ఇవ్వడానికి తాను ఓ కశ్మీరీ శాలువాను తీసుకొచ్చినట్లు చెప్పారు. మాజీ క్రికెటర్లు గవాస్కర్, కపిల్ దేవ్‌లకు కూడా ఆహ్వానం అందినా వ్యక్తిగత కారణాల వల్ల వారు వెళ్లడం లేదు.

మరిన్ని వార్తలు